ఊటుకూరు రహదారికి మరమ్మతులు ఎప్పుడో..?

ABN , First Publish Date - 2021-04-20T03:34:06+05:30 IST

నిత్యం రద్దీగా ఉండే రహదారి... రోజుకి లక్షల రూపాయిల రొయ్యలను ఈ రహదారిపై నెల్లూరుకి తరలిస్తుంటారు. ప్రయాణికుల

ఊటుకూరు రహదారికి మరమ్మతులు  ఎప్పుడో..?
తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న ముదివర్తి -ఊటుకూరు రహదారి

 నివర్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారి 

  పట్టించుకోని అధికారులు

విడవలూరు, ఏప్రిల్‌ 19: నిత్యం రద్దీగా ఉండే రహదారి... రోజుకి లక్షల రూపాయిల రొయ్యలను ఈ రహదారిపై నెల్లూరుకి తరలిస్తుంటారు. ప్రయాణికుల రాకపోకలతో హడావిడిగా ఉండే రహదారి మరమ్మతులకు గురైంది. రోడ్డుకి ఇరువైపులా మట్టి కుచించుకుపోయి ప్రమాధకంగా మారింది. నెలల గడుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటంలేదు. ఇది ముదివర్తి - ఊటుకూరు రహదారి పరిస్థితి. 

  తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారి


 గతేడాది నవంబరులో వచ్చిన నివర్‌ తుఫాన్‌ కారణంగా పెన్నానదికి పెద్దఎత్తున వరద నీరు వచ్చింది. దీంతో ఊటుకూరు, ముదివర్తి గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అంతేకాక రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. విడవలూరు, ముదివర్తి నుంచి ఊటుకూరుకి వెళ్లే ప్రధాన రహదారికి  గండ్లు పడ్డాయి. రోడ్డుకి ఇరువైపులా పెద్దపెద్ద గొతులు ఏర్పడ్డాయి. అప్పట్లో రహదారికి ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కలికంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. 


 ప్రమాదాల బారిన ప్రయాణికులు


 రొయ్యల సాగుకి పేరొందిన ఊటుకూరుకి రాత్రి పగలు తేడాలేకుండా నిత్యం వందల మంది వ్యాపారులు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ప్రాధాన్యత ఉన్న రహదారి దెబ్బతినటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రివేళ వాహనదారులు అదుపు తప్పి గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా  సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  


 రెండు రోజుల్లో మరమ్మతులు


 ఊటుకూరు రహదారి మరమ్మతులకు సుమారు  రూ. 6లక్షలతో అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తాం. రెండురోజుల్లో రోడ్డుకు  తాత్కాలిక మరమ్మతులు చేస్తాం.

- చంద్రశేఖర్‌, ఏఈ, ఆర్‌అండ్‌బీ


Updated Date - 2021-04-20T03:34:06+05:30 IST