Abn logo
Oct 26 2021 @ 23:38PM

వాడి.. వేడి!

వైసీపీ ప్రచారం

బద్వేలు తుది పోరుకు మూడు రోజులే

30న ఓటరు తీర్పు

నేటితో ప్రచారానికి తెర

ప్రచారంలో వేడెక్కిస్తున్న ప్రధాన పార్టీల నేతలు

పల్లెల్లో తిష్టవేసిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు

టీడీపీ పోటీలో లేకున్నా.. వైసీపీని వేధిస్తున్న భయం

ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు


బద్వేలు ఉప ఎన్నిక తుది దశకు చేరింది. పోలింగ్‌కు మిగిలిన గడువు మూడు రోజులే. 30న ఓటరు తీర్పు ఇవ్వనున్నారు. త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు వాడి.. వేడి ప్రచారంతో ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినా.. అధికార పక్షం వైసీపీ నాయకుల్లో భయాందోళన నెలకొంది. మరో పక్క ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 


(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఎమ్మెల్యే డాక్టరు వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెల 28న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేయగా.. ఈ నెల ఒకటిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టరు కేతన్‌గార్గ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరించారు. 13వ విత్‌డ్రా చివరి రోజు సాయంత్రం 5 గంటలకు పోటీలో 15 మంది అభ్యర్థులు మిగిలారు. ప్రధాన పార్టీలు వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుఽధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ బరిలో ఉన్నారు. రాజకీయ సంప్రదాయానికి కట్టుబడి టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో త్రిముఖ పోరు అనివార్యమైంది. మొదట్లో ప్రచారంలో జోరు కనిపించకపోయినా.. తుదిపోరు దగ్గర పడేకొద్ది ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు బద్వేలులో తిష్టవేశారు. ఊరు వాడ వేడి రాజేశారు. కుల సంఘాల సమావేశాలతో పోరు జోరు పెంచారు. విమర్శలతో వైసీపీ, బీజేపీ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అధికార పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచాలకు తెర తీస్తుందని, ఈ పోలీసులతో ఎన్నికలు జరిపితే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని, కేంద్ర పారామిలిటరీ బందోబస్తుతో ఎన్నికలు జరపాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. కాగా ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని మొదట్లో జనసేన ప్రకటించింది. అయితే ప్రచారానికి ఒకరోజు ముందు తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని, ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు.


ప్రచారంలో రాజకీయ ఉద్ధండులు

బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ పోటీలో లేకపోవడంతో గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ సాధించాలని అఽధికార పార్టీ వైసీపీ అన్ని ఎత్తులు వేస్తోంది. ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్‌బాషా, ఆదిమూలపు సురేష్‌, ఇద్దరు ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు, కడప మేయర్‌ సురే్‌షబాబులకు బాధ్యతలు అప్పగించి ప్రచారం చేపట్టారు. మధ్యలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా ప్రచారంలో వేడి పుట్టించారు. తామేమి తక్కువ కాదంటూ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఇక్కడే తిష్టవేసి అధికార పార్టీ వైసీపీ వ్యూహాలకు దీటుగా ప్రచార వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు దూసుకువెళ్లింది. మరో పక్క వైసీపీ అక్రమాలకు ఎక్కడికక్కడే ఎండగడుతూ వచ్చారు. కేంద్ర మంత్రి మురగన్‌, బీజేతీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీజేవైఎం జాతీయ నాయకులు నాగోతు రమేశ్‌తో పాటు జిల్లా నాయకత్వం ప్రచారంలో రాజకీయ వేడి రాజేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ కోసం ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాఽథ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం సాగించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్రులు కూడా ఓటు వేటలో ఉన్నారు. ప్రచార రణగొన ధ్వనులకు, కుల మీటింగ్‌లకు నేటితో బ్రేక్‌ పడనుంది. 


వైసీపీలో భయాందోళన

గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా వైసీపీలో ఎక్కడో తెలియని భయాందోళన వెంటాడుతోందని రాజకీయ విశ్ల్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్యయ్యకు 44 వేల పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేదు. వైసీపీ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే సతీమణి కావడంతో సానుభూతి ఎలాగూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షకు పైగా మెజార్టీ రావాలని ఆ పార్టీ వ్యూహం. గత మెజార్టీతోనే గెలిస్తే రాజకీయంగా సంకేతాలు మరో కరంగా వెళ్తాయని, అందుకే మెజార్టీ లక్షకు పైగా సాధించాల్సిందేనని గట్టిప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎడుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్య నాయకులు గత 15 రోజులుగా బద్వేలు ముంగిట తిష్ట వేసి ప్రచార వ్యూహంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. వారికి దీటుగా బీజేపీ, కాంగ్రెస్‌ కూడా ఏమాత్రం తగ్గకుడా ఢీ కొడుతున్నాయి.

 

బీజేపీ ప్రచారం


కాంగ్రెస్‌ ప్రచారం