వేతన బకాయిలు..రిటైరయ్యాక!

ABN , First Publish Date - 2021-06-13T08:18:19+05:30 IST

ఎంతోకాలంగా వేచి చూస్తున్న పీఆర్సీని అమలు చేయడం ద్వారా ఉద్యోగుల్లో సంతోషం నింపిన ప్రభుత్వం..

వేతన బకాయిలు..రిటైరయ్యాక!

  • పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లింపు
  • ‘61 ఏళ్లకు పెంపు’తో మూడేళ్ల దాకా లేని రిటైర్మెంట్లు
  • కొత్తగా ఉద్యోగంలో చేరినవారికీ 2,046 తర్వాతే చేతికి
  • రెండు నెలల బకాయిల చెల్లింపుపైనా  అస్పష్టత
  • పెన్షనర్లకు 36 సమాన వాయిదాల్లో చెల్లింపు


హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఎంతోకాలంగా వేచి చూస్తున్న పీఆర్సీని అమలు చేయడం ద్వారా ఉద్యోగుల్లో సంతోషం నింపిన ప్రభుత్వం.. వేతన బకాయిల చెల్లింపు విషయంలో మాత్రం నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంది. 2018 జూలై 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రాగా.. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి దాకా మానిటరీ బెన్‌ఫిట్‌ను చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ కాలంలో వేతన బకాయిలను పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో చెల్లిస్తామని సర్కారు పేచీ పెట్టింది. దీంతో రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నవారి నుంచి ఇటీవలే ఉద్యోగాల్లో చేరినవారు కూడా  విరమణ సమయంలోనే ఈ బకాయిలను పొందాల్సిన పరిస్థితి. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు దాదాపు 30-35 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని 2,046 సంవత్సరానికి ముందు, వెనకగా రిటైరయ్యే అవకాశం ఉంటుంది. 


వీరంతా ఈ బకాయిలను అప్పటిదాకా మరిచిపోవాల్సిందే. మరోవైపు ఉద్యోగుల   విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచడంతో మరో మూడేళ్లదాకా రాష్ట్రంలో పదవీ విరమణలు లేవు. దాంతో 2024 సంవత్సరం నుంచే వేతన బకాయిలు విడుదల కానున్నాయి. ఈలోగా పీఆర్సీ కాలపరిమితి (2023 జూన్‌ 30) పూర్తవుతుంది. దీంతో ఈ ఏడాది మార్చిలో 58 ఏళ్లకు  విరమణ చేయాల్సిన వారంతా కొత్త పీఆర్సీ కాలపరిమితి ప్రారంభమయ్యాక పాత బకాయిలు పొందాల్సి వస్తుంది. ఇక 2021 ఏప్రిల్‌ నుంచి నగదుతో కూడిన ప్రయోజనాలు అందిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో ఏప్రిల్‌, మే నెలల బకాయిలైనా వెనువెంటనే ఇస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


వాయిదాలపై పెన్షనర్ల అసంతృప్తి

పెన్షనర్లకు వేతన బకాయిలను 36 సమాన వాయిదాల్లో చెల్లిస్తామనడం రిటైర్డ్‌ ఉద్యోగులనూ నిరాశకు గురిచేస్తోంది. పెన్షనర్లలో చాలా మంది రెండున్నరేళ్లుగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా, ఇతరత్రా కారణాలతో ఏడాదిలో 9981 మంది పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. బకాయుల విడుదలపె పునరాలోచన చేయాలని ఉద్యోగ సంఘాలూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 


బకాయిలు 2023 లోపు ఇవ్వాలి

వేతన బకాయిలను పీఆర్సీ కాలపరిమితి (2023 జూన్‌) ముగిసేలోపు నిర్దిష్టమైన సమాన వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వేదిక ప్రతినిధులు శనివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌ జీవోలు విడుదల చేయాలని వేదిక ప్రతినిధులు సంపత్‌కుమార్‌ స్వామి, సదానందంగౌడ్‌, జంగయ్య కోరారు.


కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం విస్మయం

 జీవో 51లో యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల వేతనాల పెంపును ప్రస్తావించకపోవడంపై తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెగ్యులర్‌ అధ్యాపకులకంటే కాంట్రాక్ట్‌ అధ్యాపకులే అధికంగా ఉన్నారని సంఘం స్టీరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ధర్మతేజ గుర్తు చేశారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు కూడా వేతనాలను పెంచాలని కోరారు.


పీఆర్సీ ఉత్తర్వుల్లో విశ్వవిద్యాలయం ఒప్పంద అధ్యాపకులను విస్మరించారని తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) రాష్ట్ర అధ్యక్షుడు రాజు చిట్యాల విమర్శించారు.


మున్సిపల్‌ కార్మికులకు అన్యాయం

 కార్పొరేషన్లు, మునిసిపల్‌ కార్మికులకు పీఆర్సీలో తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ తప్పును సరిదిద్దాలని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమర్‌ అలీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 14 నుంచి వినతిపత్రాలు ఇస్తామని, స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

Updated Date - 2021-06-13T08:18:19+05:30 IST