వేచి చూడండి: శశికళ రీఎంట్రీపై దినకరన్

ABN , First Publish Date - 2021-01-27T20:49:05+05:30 IST

అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ విడుదల కావడం తమకు చాలా సంతోషకరమైన ..

వేచి చూడండి: శశికళ రీఎంట్రీపై దినకరన్

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ విడుదల కావడం తమకు చాలా సంతోషకరమైన సందర్భమని ఆమె మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత టీటీడీ దినకరన్ అన్నారు. శశికళ రాకతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో మార్పులు వచ్చే అవకాశంపై 'వేచి చూడండి' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.


'శశికళ లాంఛనంగా బుధవారంనాడు విడుదలయ్యారు. ఇది మాకు సంతోషకరమైన సందర్భం. వైద్యుల సలహా తీసుకున్న అనంతరం ఆమెను తమిళనాడు తీసుకువెళ్లే విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రజలు ఆమె కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు' అని టీటీవీ చెప్పారు. మాజీ సీఎం దివంగత జయలలిత స్మారకం ఇవాళ ప్రారంభిస్తున్న సమయంలోనే చిన్నమ్మ విడుదల కావడం సెలబ్రేషన్ సందర్భమని చెప్పారు. చిన్నమ్మ రాకతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందా అనే దానిపై వేచిచూడండని నర్మగర్భంగా చెప్పారు. కాగా, అవినీతి కేసులో పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకున్న శశికళ బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. కరోనాతో  ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

Updated Date - 2021-01-27T20:49:05+05:30 IST