కరోనా తగ్గిన 3 నెలల దాకా..సంతానం కోసం ప్రయత్నించొద్దు

ABN , First Publish Date - 2021-03-10T16:36:32+05:30 IST

కరోనా వచ్చి, తగ్గాక కొన్ని నెలలపాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయొద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వల్ల సంతాన సాఫల్యతపై ప్రభావం పడడమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా..

కరోనా తగ్గిన 3 నెలల దాకా..సంతానం కోసం ప్రయత్నించొద్దు

పురుషుల్లో తగ్గుతున్న వీర్యకణాలు

ఉన్న కణాల్లో లోపిస్తున్న చురుకుదనం

పది మందిలో ఒకరిద్దరికి సమస్య: వైద్యులు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వచ్చి, తగ్గాక కొన్ని నెలలపాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయొద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వల్ల సంతాన సాఫల్యతపై ప్రభావం పడడమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా.. కరోనా వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని, ఉన్న కణాల్లో చురుకుదనం లోపించి, కదలికలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున ఎవరూ సంతానం కోసం ప్రయత్నం చేయొద్దని గత ఏడాది దాదాపు ఇదే సమయంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 


దీంతో జననాల సంఖ్య గత ఏడాది గణనీయంగా తగ్గింది. ఇప్పుడు వైరస్‌ ముప్పు కాస్త తగ్గడంతో మళ్లీ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించే దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఇలా వస్తున్నవారిలో చాలా మంది కరోనా బారిన పడి కోలుకుంటున్నవారు ఉంటున్నారు. వచ్చే ప్రతి పది మందిలో ఒకరిద్దరిలో వీర్యకణాల సంఖ్య తగిన సంఖ్యలో ఉండట్లేదని వైద్యులు గుర్తిస్తున్నారు. కొంతమందికి పూర్తిగా జీరో కౌంట్‌ ఉంటోందని చెబుతున్నారు. మరి కొంత మందిలో వీర్యకణాలు తగిన సంఖ్యలో ఉన్నప్పటికీ.. వాటి కదలిక, చురుకుదనం తక్కువగా ఉంటున్నట్టు గుర్తిస్తున్నారు. కరోనా సోకినా.. తేలక పాటి లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే.. ఇన్ఫెక్షన్‌, లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో వీర్యం నాణ్యత బాగా తగ్గుతున్నట్టు గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.


గత ఏడాదే..

వీర్యంపై కరోనా ప్రభావం గురించి గత ఏడాదే చాలా పరిశోధనలు జరిగాయి. ఒక పరిశోధనలో భాగంగా.. కరోనాతో మరణించిన ఆరుగురి, కరోనా నుంచి కోలుకున్న 23 మంది వృషణాలు, ఎపిడిడైమి్‌సను (వీర్యాన్ని వృషణాల నుంచి రవాణా చేసే నాళం) పరీక్షించారు. ఆయా ఫలితాలను ఆరోగ్యవంతులైన, అదే వయసు పురుషుల వీర్యం నాణ్యతతో పోల్చిచూశారు. కరోనాతో మరణించినవారి నుంచి సేకరించిన నమూనాల్లో కణాలు, ప్రొటీన్లు వాపునకు గురవడాన్ని, వృషణాల్లో రక్తం ఉండడాన్ని గమనించారు. అలాగే.. వైరస్‌ బారిన పడి కోలుకున్న వారిలో 39 శాతం మందిలో వీర్యకణాల సంఖ్య తగ్గినట్టు గుర్తించారు. వారందరికీ ఇప్పటికే పిల్లలు ఉండడం గమనార్హం. కరోనా వచ్చాకే వారి వీర్యకణాల సంఖ్య తగ్గింది. మిగిలిన 61 శాతం మంది వీర్యంలో తెల్లరక్తకణాలు ఉండడం గమనించారు.


ఇదేం కొత్త కాదు..

వైర్‌సల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడం, కణాల్లో చురుకుదనం లోపించడం కొత్త కాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జికా వైరస్‌ వల్ల ఎలుకల్లో సంతాన సాఫల్యత తగ్గుత్నునట్టు గతంలో గుర్తించారు. హెచ్‌ఐవీ, మంప్స్‌, హెపటైటిస్‌ బి, సి, ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌పీవీ, ఎబోలా, ఈబీవీ, హెచ్‌ఎ్‌సవీ వంటి వైర్‌సల వల్ల కూడా పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందని గత అధ్యయనాల్లో తేలింది. కరోనా వైరస్‌ వల్ల వృషణాల్లో వాపు వస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి వైరస్‌ బారిన పడి కోలుకున్నవారు కొంతకాలం ఆగి పిల్లల కోసం ప్రయత్నిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


2-3 నెలలు ఆగాలి

వైరస్‌ సోకి, లక్షణాలు తీవ్రంగా ఉన్నట్టైతే.. అలాంటివారు కోలుకున్నాక రెండు, మూడు నెలల దాకా  సంతానం కోసం ప్రయత్నించవద్దని సూచిస్తున్నాం. మహిళల అండాశయంపైన మాత్రం వైరస్‌ ప్రభావం ఉండట్లేదు. అయినప్పటికీ రెండు, మూడు నెలల వరకు గర్భం దాల్చవద్దని సూచిస్తున్నాం.


- డాక్టర్‌ ప్రీతిరెడ్డి, ఇన్‌ఫెర్టిలిటి స్పెషలిస్టు, బర్త్‌ రైట్‌ఫెర్టిలిటి రైన్‌బో ఆస్పత్రి


పరీక్షలు చేయించుకోవాలి

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న కొందరిలో వీర్యకణాల సంఖ్య జీరోగా ఉంటోంది. మూడు నాలుగు నెలల తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. వీర్యకణాల సంఖ్య కనీసం 30 నుంచి 40 శాతం ఉంటే గర్భం నిలిచే అవకాశముంది. కరోనా వచ్చి తగ్గిపోయిన వారు స్పెర్మ్‌ కౌంట్‌ టెస్టు చేయించుకుంటే వీర్యకణాలు తగిన సంఖ్యలో ఉన్నాయో లేదో తెలుస్తుంది.


 - డాక్టర్‌ కావ్యప్రియ, గైనకాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి


Updated Date - 2021-03-10T16:36:32+05:30 IST