స్కూళ్లు అప్పుడే వద్దు, మరో 3 నెలలు ఆగండి: డాక్టర్ ట్రెహాన్

ABN , First Publish Date - 2021-08-29T23:21:47+05:30 IST

స్కళ్లు పునఃప్రారంభం కానుండటంపై మేదాంత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ స్పందించారు. పెద్దలు, పిల్లలకు అత్యవసర వినియోగం కింద..

స్కూళ్లు అప్పుడే వద్దు, మరో 3 నెలలు ఆగండి: డాక్టర్ ట్రెహాన్

న్యూఢిల్లీ: స్కూళ్లు పునఃప్రారంభం కానుండటంపై మేదాంత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ స్పందించారు. పెద్దలు, పిల్లలకు అత్యవసర వినియోగం కింద జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్‌కు ప్రభుత్వ ఆమోదం లభించినందున, పిల్లలు పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేంత వరకూ స్కూళ్ల ప్రారంభించే విషయంలో రెండు, మూడు నెలలు వేచిచూడాలని ఆయన సూచించారు.


''మనం మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. వ్యాక్సిన్ సిద్ధమవుతున్న దశలో ఉంది. ఎందుకంటే జైడస్ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ నుంచి ఇప్పుడిప్పుడే ఆమోదం లభించింది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నా 30 నుంచి 50 శాతం రక్షణ ఉటుంది. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మరో రెండు-మూడు నెలలు మనం ఓపికగా ఉండాలి. పిల్లలను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్కూళ్లకు అనుమతించ వచ్చు. స్కూళ్లు తెరచేందుకు మనం తొందరపడుతున్నట్టే కనిపిస్తోంది'' అని డాక్టర్ ట్రెహాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఫ్లోరిడా ఉదంతమే చూస్తే, అక్కడ ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోయాయని, ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఆ కోణంలోంచి చూసినప్పుడు ఇండియాలోని పిల్లలు వ్యాక్సిన్ తీసుకోలేదని, ఎక్కువ మంది పిల్లలు జబ్బుపడితే అవసరమైన సౌకర్యాల కొరత ఇక్కడ ఉందన్నారు. తగినంత మంది పిల్లల డాక్టర్లు, పిల్లలకు తగినన్ని ఐసీయూలు, వెంటిలేటర్లు లేవని, సాధ్యమైనంత త్వరగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి ప్రభుత్వం తేవాలన్నారు. 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రెహాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


కాగా, పెద్దవాళ్లు, 12 ఏళ్లు, ఆ పైబడిన వయసు కలిగిన పిల్లల అత్యవసర వినియోగం కోసం జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్‍కు గత శుక్రవారంనాడు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. థర్డ్ వేవ్ పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యగా దీనిని చెబుతున్నారు.

Updated Date - 2021-08-29T23:21:47+05:30 IST