పడకల కోసం పడిగాపులు!

ABN , First Publish Date - 2021-04-25T06:43:37+05:30 IST

కొవిడ్‌ బాధితులకు సంజీవనిగా మారిన ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం పడకల సమస్య నెలకొంది.

పడకల కోసం పడిగాపులు!
రిమ్స్‌లో కరోనా అడ్మిషన్‌ సెంటరు వద్ద పడిగాపులు కాస్తున్న బాధితులు

నేలపైనే వందల మంది కరోనా బాధితులు

ప్రాణవాయువు కోసం ప్రాణాలు అరచేతిలో..

పొరుగు జిల్లాల నుంచీ వస్తున్న బాధితులు

రోజుకు 7 టన్నుల ఆక్సిజన్‌ అవసరం

అధికారుల మధ్య కొరవడిన సమన్వయం

వైద్యం సరే.. సౌకర్యాలు అంతంతమాత్రమే

బెడ్ల సమస్య మరింత పెరిగి ప్రమాదం

బేస్తవారపేట మండలానికి చెందిన రమణయ్యకు కరోనాతో ఊపిరాడక పోవడంతో శుక్రవారం సాయంత్రం భార్యతో కలిసి రిమ్స్‌కు వచ్చాడు. ఆయనకు శనివారం సాయంత్రం వరకూ బెడ్‌ ఇవ్వలేదు. అధికారులు చూపే డిస్‌ప్లే బోర్డులో 118 పడకలు ఖాళీగా ఉన్నాయని, అయితే తనకు బెడ్‌ కేటాయించలేదని వాపోయాడు. ఆయన భార్య కనిపించిన వారినల్లా బెడ్‌ ఇప్పించి వైద్యం అందించాలని వేడుకుంటోంది. బాధితుడికి మాత్రం బెడ్‌ దొరికే పరిస్థితి లేదు.  


ఒంగోలు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన సుబ్బారావు భార్యకు కొవిడ్‌ రావడంతో వారంరోజులుగా రిమ్స్‌లో చికిత్స పొందుతోంది.దీంతో ముగ్గురు చిన్నపిల్లలతో ఆమె భర్త ఆస్పత్రిలోనే ఉంటున్నాడు. వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఆ చిన్నారులను వారం రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని చెట్ల కింద ఉంచారు. కనీసం మాటలు కూడా సరిగారాని ఆ చిన్నారులు తల్లి కోలుకుని త్వరగా వస్తుందన్న ఆశతో రేయింబవళ్లూ ఎదురుచూస్తూ దిగాలుగా కూర్చోవడం పలువురుని కలిచివేస్తోంది. 


చీరాలకు చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతోంది. శనివారం ఆయాసం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్‌లో ఒంగోలు బయల్దేరింది. రిమ్స్‌లో బెడ్‌లు ఖాళీలు లేవని తెలియడంతో ఆర్ధికంగా భారం అయినా ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. అయితే ఎక్కడా బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో చివరకు ఏం చేయలేక రిమ్స్‌కు వచ్చి పడిగాపులు కాస్తోంది. 


ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 24 : కొవిడ్‌ బాధితులకు సంజీవనిగా మారిన ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం పడకల సమస్య నెలకొంది. రోజురోజుకూ కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో అధికారులు సైతం బెడ్‌లు కేటాయించలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆక్సిజన్‌ బెడ్‌లన్నీ ఫుల్‌ కావడంతో బాధితులు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఊపిరాడని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వారికి తాత్కాలిక ఉపశమనం కోసం ఆరుబయటే ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేశారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోగా, కనీసం వైద్యాధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో బాధితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఇంటికెళతామో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోందని కన్నీరు పెడుతున్నారు. 


నేలపైనే వందల మంది బాధితులు

జిల్లాలోని బాధితులే కాకుండా పొరుగు జిల్లాలైన నెల్లూరు, గుంటూరు నుంచి కూడా ప్రతిరోజూ పదులసంఖ్యలో రిమ్స్‌కు వస్తున్నారు. దీంతో పడకల సమస్య ఎక్కువైంది. ఈ సమయంలో అధికారుల మధ్య లోపించిన సమన్వయం.. రోగుల పాలిట శాపంగా మారింది. దీంతో వందల మంది బాధితులు నేలపైనే పడుకొంటున్నారు. 


ప్రాణవాయువు అంతంతే!

రిమ్స్‌లో ప్రాణవాయువు నిల్వ కోసం ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.  20టన్నుల  ఆక్సిజన్‌ నిల్వ ఉంచేలా దీనిని నిర్మించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సరిపడా లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా కాకపోవడంతో ఏ రోజుకారోజు 8 టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుతున్నారు. రోజుకు 7 టన్నుల వరకూ  వాడుతున్నారు. దీంతో ఏ ఒక్కరోజు ఆక్సిజన్‌ కొరత ఏర్పడినా వందలమంది బాధితుల ప్రాణాలు గాలిలోకలిసిపోయే ప్రమాదం ఉంది.


5,433 మంది బాధితులు.. 1,596 పడకలు

ఈ నెల ఆరంభం నుంచి శనివారం వరకూ జిల్లాలో 5,433మంది కరోనా బారినపడ్డారు. కాగా పదిహేను కొవిడ్‌ ఆసుపత్రులు అన్నింటిలో కలిపి  మొత్తం 1,596 పడకలను ఏర్పాటుచేయగా 295 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు జిల్లా కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందిన సమాచారం మేరకు జిల్లాలోని దాదాపు అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ పడకలన్నీ బాధితులతో నిండిపోగా, వందలమంది బెడ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. శనివారం అడ్మిషన్‌ పొందిన బాధితులకు మరో రెండు,మూడు రోజుల వరకు బెడ్‌ లభించే పరిస్థితి లేదని వైద్యులే చెప్తున్నారు.   






Updated Date - 2021-04-25T06:43:37+05:30 IST