ప్రోత్సాహం కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-08-29T05:30:00+05:30 IST

పట్టుపరిశ్రమకు మూలాధారమైన రీలర్లు నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రీలర్లకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు(ఇన్‌సెంటివ్‌) చేతికి అందక నిరుత్సాహంతో దిగాలు పడిపోతున్నారు. జిల్లాలోని మదనపల్లె, పలమనేరు పట్టణాల్లో 55 పట్టుదారాల రీలింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లతో 500 కుటుంబాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారు.

ప్రోత్సాహం కోసం ఎదురుచూపులు
రీలర్లకు పెట్టుబడులు లేక మదనపల్లె నిలిచిపోయిన మల్టిఎండ్‌ రీలింగ్‌ మెషిన్‌

 రీలర్లకు పేరుకుపోయిన రూ.1.20కోట్ల బకాయిలు


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 29: పట్టుపరిశ్రమకు మూలాధారమైన రీలర్లు నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రీలర్లకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు(ఇన్‌సెంటివ్‌) చేతికి అందక నిరుత్సాహంతో దిగాలు పడిపోతున్నారు. జిల్లాలోని మదనపల్లె, పలమనేరు పట్టణాల్లో 55 పట్టుదారాల రీలింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లతో 500 కుటుంబాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా రీలర్లు మదనపల్లె, పలమనేరు, కుప్పంలోని ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌కు వెళ్లి రైతుల వద్ద పట్టుగూళ్లను కొనుగోలు చేస్తారు. ఈ గూళ్లను రీలింగ్‌ యూనిట్లకు తీసుకెళ్లి పట్టుదారాలను తీసి ఎగుమతి చేస్తారు. పట్దుదారాల శాంపిల్‌ను ధర్మవరంలోని ల్యాబ్‌కు పంపుతారు. అక్కడ పరీక్షలు చేశాక,  రీలర్లకు కిలో పట్టుదారానికి రూ.130 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్‌ చెల్లిస్తుంది. గతంలో రెండు నెలలకు ఒకసారి రీలర్ల ఖాతాలోకి ప్రోత్సాహ నగదును జమ చేసేవారు. కాగా ప్రస్తుతం పది నెలల నుంచి రీలర్లకు ఖాతాలకు నగదు జమ కావడం లేదు. ఒక్కో రీలర్‌కు ఎంత లేదన్నా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల దాకా నగదు రావాల్సివుంది. ఈ క్రమంలో జిల్లాలోని 55 రీలింగ్‌ యూనిట్లకు రూ.1.20కోట్ల ఇన్సెంటివ్‌ అందాల్సి ఉంది. ఈ విషయమై మదనపల్లె రీలర్లు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. గతంలో నెలలో 26 రోజులు రీలింగ్‌ యూనిట్లు నడిచేవి. ఇటీవల రీలర్లకు పెట్టుబడులు లేక కేవలం 10 రోజులు మాత్రమే నడుస్తున్నాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మల్టీ ఎండ్‌ రీలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసిన రీలర్లు అప్పులకు వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నారు. అంతేకాక రీలింగ్‌ యూనిట్లలో పనిలేక కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఇదిలా ఉండగా అద్దె భవనాల్లో రీలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసిన రీలర్లు అద్దె కూడా చెల్లించలేక యూనిట్లు మూసివేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రీలర్లకు ప్రోత్సాహక నగదును వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.



Updated Date - 2021-08-29T05:30:00+05:30 IST