RRR రెండో భాగం కూడా ఉంటుందా అని రాజమౌళిని అడగ్గా.. రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2021-10-31T05:39:55+05:30 IST

RRR రెండో భాగం కూడా ఉంటుందా అని రాజమౌళిని అడగ్గా.. రియాక్షన్ ఇదీ..

RRR రెండో భాగం కూడా ఉంటుందా అని రాజమౌళిని అడగ్గా.. రియాక్షన్ ఇదీ..

  • పవన్‌ కోసం వేచి చూశా
  • - ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు రెండో భాగం ఉండదు
  • - నాలుగు భాగాలుగా ‘మహాభారతం’
  • - దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడి
  • - జెమ్స్‌లో వైద్య విద్యార్థులతో ముఖాముఖి


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి) : ‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో సినిమా కోసం చాలా రోజులు ఎదురుచూశా. ఆయన నుంచి ఫోన్‌ రాలేదు. ఆ తరువాత నాదైన శైలిలో సినిమాలు తీయడం మొదలు పెట్టా. విజయాలు చవి చూశా’ అన్నారు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో శనివారం గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


పవన్‌ను కలిశా...

కొన్నాళ్ల కిందట పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీసేందుకు ప్రయత్నించా. దీని కోసం చాన్నాళ్లు వేచి ఉన్నాను. ఓ షూటింగ్‌లో నేరుగా వెళ్లి పవన్‌ కల్యాణ్‌ను కలిశాను. ఆయనతో మాట్లాడేటప్పుడు నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ‘ఎటువంటి సినిమా చేయాలనుకుంటున్నారు?’ అని నేను అడిగా. ఎలాంటి సినిమా అయినా చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ఆ తర్వాత సుమారు ఏడాదిన్నర వరకు ఆయన నుంచి నాకు ఫోన్‌ రాలేదు. ఆ తర్వాత విభిన్న చిత్రాలపై అంటే... మగధీర, యమదొంగ, బాహుబలి వంటి వాటిపై దృష్టి సారించా. పవన్‌ కల్యాణ్‌ కూడా సినిమాల కంటే రాజకీయ రంగం పట్ల ఇష్టం చూపించారు. నేను మంచి కథలతో సినిమాలు తీసి ఇలా మీ ముందు ఉన్నా’ అంటూ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు రాజమౌళి. రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దంపతులను జెమ్స్‌ సిబ్బంది, వైద్య విద్యార్థులు సత్కరించారు.


ఈ సందర్భంగా వైద్యవిద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన వివిధ ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘విధి రాతను... తలరాతను నేను నమ్మను. కేవలం శ్రమను, అదృష్టాన్ని మాత్రమే నమ్ముతా. విద్యార్థి దశ నుంచే ఎవరైనా కష్టపడాలి. బాల్యం నుంచి ఉన్నత చదువుల వరకు శ్రమతో నే ఫలితం ఉంటుంది. అదే ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు డ్రైవింగ్‌లో మంచి పట్టుంది. ఓ దశలో డ్రైవర్‌గా మారుతానేమో అనుకున్నా. ఇదంతా సినిమాల్లోకి రాకముందు. మా నాన్న, నా భార్య ప్రోత్సాహంతో రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. అది కూడా చిన్నచిన్న కథలకు మాత్రమే.  అందులో పట్టు సాధించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను రెండు భాగాలుగా తీసే ఆలోచన లేదు. కేవలం మూడు గంటల్లో మాత్రమే ప్రేక్షకులకు చూపిస్తా. ఇంకొద్ది భాగం షూటింగ్‌ మిగిలి ఉంది. ఇక నా డ్రీమ్‌ ప్రాజెక్టు మహాభారతం. దాన్ని నాలుగు భాగాల్లో తీసే ఆలోచనలో ఉన్నాను.



Updated Date - 2021-10-31T05:39:55+05:30 IST