ఢిల్లీలో వెయిటింగ్‌

ABN , First Publish Date - 2021-07-22T08:44:56+05:30 IST

కేంద్ర మంత్రులను కలుసుకోవడానికి ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి.. అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నారు

ఢిల్లీలో వెయిటింగ్‌

మంత్రులతో భేటీకి బుగ్గన పడిగాపులు

2రోజులుగా దొరకని అపాయింట్‌మెంట్‌

అప్పులు, పోలవరంపై విన్నపాల కోసమే!

ఆర్థిక, జలశక్తి మంత్రులను కలిసే యత్నం

తరచూ వస్తున్నా కొందరినే కలిసే చాన్స్‌

పర్యటన వివరాలపై ఆద్యంతం గోప్యత


న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రులను కలుసుకోవడానికి ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి.. అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నారు. ఏఏ అంశాలపై మాట్లాడటానికి ఆయన కేంద్ర మంత్రులను కలవాలనుకొంటున్నారనేది మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తూ పోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాల సవరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీకి బుగ్గన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే.. ఇటీవలే కేంద్ర మంత్రి హోదా పొందిన పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలవడంతోపాటు, వేర్వేరు అంశాలపై ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌, న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు, కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ఆయన కలవొచ్చునని చెబుతున్నారు. వీరితో పాటు నీతిఆయోగ్‌ అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి, ఈ నెల తొలివారంలో జరిపిన ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర న్యాయ, పర్యాటక, ఉక్కుశాఖల మంత్రులను కలియాలని బుగ్గన ప్రయత్నించారు. అప్పట్లో వారు అందుబాటులో లేరు. ఇంతలో జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ మూడు శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. కాగా, గురువారం కొందరు మంత్రుల అపాయింట్‌మెంట్‌ లభించొచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


చక్కర్ల మంత్రి ఆయన.. ఢిల్లీలో జోక్‌..

మంత్రి బుగ్గన నెలలో కనీసం రెండు,మూడు పర్యాయాలు ఢిల్లీకి రావడం గత రెండేళ్లుగా పరిపాటిగా మారింది. గతంలో ఆయన పర్యటన వివరాలు మీడియాకు తెలిసేవి. గత రెండు, మూడు నెలల నుంచి మాత్రం గోప్యత పాటిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్న నేపథ్యంలో అప్పుల కోసం ఆర్థిక మంత్రి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నట్లు మరోపక్క ప్రచారం జరుగుతుంది. దీంతో ‘చక్కర్ల మంత్రి’ అంటూ తెరవెనుక సరదాగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా.. ఎవరెవరిని ఎందుకు కలిశారు... వారికి సమర్పించిన వినతి పత్రాల సమాచారం కూడా మీడియాకు ఉండటం లేదు. రాష్ట్రం నుంచి అధికారిక పర్యటనలకు వచ్చినప్పుడు మంత్రులు ఏపీభవన్‌లో బస చేయడం సంప్రదాయం. దీనికి భిన్నంగా ఆయన, ఆయన వెంట ఢిల్లీకి వచ్చే ఉన్నతాధికారులు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి స్టార్‌ హోటళ్లలో దిగుతున్నారు. జగన్‌ మంత్రివర్గంలోని మిగతా మంత్రుల తీరూ ఇదేనని ఏపీ భవన్‌ వర్గాలే అంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు ఢిల్లీ వస్తున్నారో, ఎప్పుడు వెనుతిరుగుతున్నారో కూడా మీడియాకు తెలియనీయడం లేదు. వ్యక్తిగత పర్యటన అంటూ అధికార వర్గాలు కప్పిపెడుతున్నాయి. 

Updated Date - 2021-07-22T08:44:56+05:30 IST