బ్రేకప్‌.. జీవితానికో వేక ప్‌!

ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST

కరోనా దెబ్బకు యువతకు రకరకాల సమస్యలు వచ్చిపడ్డాయి. ఓ వైపు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నన్న భయం... మరోవైపు మారిన షిఫ్ట్‌లు... ఇంటి నుంచే పని... ఆర్థిక ఇబ్బందులు... ఇంట్లో ఒంటరిగా గడపాల్సిరావడం... ఇలా ఎన్నో సమస్యలు మానసిక ప్రశాంతత లేకుండా...

బ్రేకప్‌.. జీవితానికో వేక ప్‌!

కరోనా దెబ్బకు యువతకు రకరకాల సమస్యలు వచ్చిపడ్డాయి. ఓ వైపు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నన్న భయం... మరోవైపు మారిన షిఫ్ట్‌లు... ఇంటి నుంచే పని... ఆర్థిక ఇబ్బందులు... ఇంట్లో ఒంటరిగా గడపాల్సిరావడం... ఇలా ఎన్నో సమస్యలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు బ్రేకప్‌ కూడా వాటికి తోడయితే..! అమ్మో... ఆ బాధ వర్ణించలేం. ఈ కష్ట కాలంలో బాయ్‌ఫ్రెండో.. గర్ల్‌ ఫ్రెండో హఠాత్తుగా బాయ్‌ చెప్పినా తట్టుకొని ముందుకు సాగేందుకు సైకాలిజిస్ట్‌లు కొన్ని సూచనలు చేస్తున్నారు.  


కాలం గాయాన్ని మాన్పుతుంది: బ్రేకప్‌ కన్నా ఆ వ్యక్తుల జ్ఞాపకాలతో జీవించాల్సిరావడమే చాలా పెద్ద సమస్య. ఒంటరివాళ్లం అనే భావనకు లోనవుతారు. నచ్చిన వ్యక్తికి దూరమైన బాధలో నలుగురిలో కలవడానికి ఇష్టపడరు. ఎంత వద్దనుకున్నా పదే పదే అవే జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మరింత ఒంటరితనం ఆవహిస్తుంది. అలాంటప్పుడే రాసిపెట్టినట్టు జరుగుతుందనే వేదాంతాన్ని ఒంటపట్టించుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌ వల్ల నేర్చుకున్న పాఠాలు ఏమిటనే విషయం ఆలోచించుకోవాలి. మీతో మీరు అనుబంధం పెంచుకోవడానికి మీ మరో ప్రపంచంలో మరింత సమయం గడపండి. 


ఫీల్‌ అవ్వండి: మనసులో ఉన్నదేదో బయటకు ఫీలవ్వండి. బాధ నుంచి బయటపడడానికి దాన్నో మార్గంగా మలచుకోవచ్చు. మనసుకు దగ్గరైన వ్యక్తులు దూరమైనప్పుడు పడే బాధ వర్ణనాతీతం. అలాంటప్పుడు బ్రేకప్‌ కలిగించే బాధతో దుఖం తన్నుకొస్తుంటే ఆపకండి. తప్పయినా సరే కోపం వస్తే కోప్పడండి. దీనివల్ల మనసు తేలికపడుతుంది. దూరమైన వ్యక్తుల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. స్కైప్‌, జూమ్‌లాంటి యాప్‌ల సాయంతో కోరుకున్నప్పుడల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎంత గొప్ప బంధం అయినా పరిస్థితుల ప్రభావంతో విడిపోవాల్సి రావొచ్చు అనే విషయం మరువకూడదు. ఎంత బాధ ఉన్నా, పరిస్థితులను చక్కదిద్ది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ పట్ల మీరు సానుభూతితో వ్యవహరించండి. అన్నిటికీ మించి మీ కోసం మీరే గట్టిగా నిలబడండి. 


అతిగా ఆలోచించొద్దు: మీరు జీవితంలో ముందుకు సాగటానికి పనికొచ్చే పాఠాలను బ్రేకప్‌ నేర్పుతుంది. ఇదీ మంచికే అనుకొని గడచిన కాలం గురించి అతిగా ఆలోచించడం మానండి. ‘నా పార్టనర్‌ హ్యాపీగా జీవితాన్ని అనుభవిస్తుంటే, నేను మాత్రమే ఇలా బాధపడుతున్నాను’ లాంటి పనికిరాని ఆలోచనలను పక్కనపెట్టండి. చింతించటానికి బదులు రిలేషన్‌షిప్‌లో మీ వైపు నుంచి జరిగిన పొరపాట్లు, మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సందర్భాలను గుర్తు చేసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో కొత్త రిలేషన్‌షిప్‌లో ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవచ్చు. 


నచ్చిన పనితో ముందుకు: ఎంత ప్రయత్నించినా బ్రేకప్‌ను మర్చిపోవడం అంత తేలిక కాదు. ఆ బాధ నుంచి బయటపడాలంటే మీకు మంచి చేసే విషయాల మీద శ్రద్ధ పెట్టాలి. మిమ్మల్ని మీరే పట్టించుకోవాలి. మీకు నచ్చిన పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయండి. అవసరమైతే మానసిక వైద్యుల సాయం తీసుకోండి. 


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST