సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2021-01-13T05:21:23+05:30 IST

జిల్లాలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. పల్లెల్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు హుషారెత్తిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం చూపినప్పటికీ... పెద్ద పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా చేసుకునేందుకు వలసజీవులంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పాలకొండ తదితర కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికుల సందడి కనిపించింది.

సంక్రాంతి సందడి
శ్రీకాకుళం మార్కెట్‌లో రద్దీగా ఉన్న జనం

- నేడు భోగి

- స్వగ్రామాలకు చేరుకున్న వలసజీవులు

- కళకళలాడుతున్న పల్లెలు, పట్టణాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ఆమదాలవలస) 

జిల్లాలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. పల్లెల్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు హుషారెత్తిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం చూపినప్పటికీ... పెద్ద పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా చేసుకునేందుకు వలసజీవులంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పాలకొండ తదితర కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికుల సందడి కనిపించింది. మరోవైపు వలసజీవుల రాకతో ఆమదాలవలస రోడ్డు(శ్రీకాకుళం) రైల్వేస్టేషన్‌లో మంగళవారం రద్దీ నెలకొంది. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనల మేరకు కొన్ని రైళ్లను నడుపుతున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో అధికమంది ప్రయాణికులు తరలివచ్చారు. స్టేషన్‌ నుంచి ప్రైవేటు వాహనాల్లో తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. బుధవారం భోగభాగ్యాల భోగిని సందడి జరుపుకోనున్నారు.  వాస్తవంగా భోగి మంటకు అవసరమైన కలపను ముందుగా సేకరిస్తారు. పిల్లలు నెల రోజుల పాటు తయారుచేసిన పిడకలను ఈ మంటల్లో వేస్తారు. భోగి మంట కాగడం ఆరోగ్యానికి మంచిదని...ఆ పొగ శరీరానికి తగిలితే వ్యాధులు కూడా దరిచేరవని గ్రామాల్లో పెద్దలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాడి సంపద తగ్గుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం భోగిపిడకలను తయారు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రోజురోజుకూ భోగిమంటల్లో భోగిపిడకల వినియోగం తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం.. భోగీతో పాటు గురువారం సంకాంత్రి, శుక్రవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు.  


ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందా....


సంక్రాంతి పండగ వేళ.. ప్రైవేటు వాహనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వలసజీవులంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. స్థానికంగా ఉపాధి పొందుతున్న కొంతమంది తమ స్వస్థలాలకు పయనమయవుతున్నారు. అత్యధిక శాతం శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాలకొండ, రాజాం, పలాస ప్రాంతాల నుంచి విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్తున్నారు. పండగ నేపథ్యంలో కేవలం హైదరాబాద్‌కు పది బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. రైళ్ల రిజర్వేషన్‌ లభించక... చాలా మంది ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రస్తుతం టిక్కెట్‌ ధరలను పెంచేశారు. నాన్‌ ఏసీ అయితే రూ.1020, స్లీపర్‌ అయితే రూ.1420 చొప్పున హైదరాబాద్‌కు తీసుకుంటున్నారు. అలాగే ఏసీ బస్సు అయితే రూ.1840, రూ.1990 చొప్పున వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళానికి రూ.2600 చొప్పున టికెట్‌ ధర నిర్ణయించారు. ఇలా ప్రతి టికెట్‌పై అదనపు భారం మోపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా పెట్టి ధరలు నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


 11 కేసులు నమోదు  

జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై తనిఖీలు చేస్తున్నాం. సోమవారం, మంగళవారాల్లో  11 కేసులు నమోదు చేశాం. అధిక ధరలతోపాటు, బస్సుల్లో నిబంధనలు అతిక్రమణపై కేసులు నమోదు చేసి రూ. 41వేలు అపరాధ రుసుం విధించాం. 

 - వి.సుందర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ 


Updated Date - 2021-01-13T05:21:23+05:30 IST