Abn logo
Sep 25 2020 @ 19:25PM

రాలుతున్న కశ్మీరీ వాల్‌నట్స్!

Kaakateeya

శ్రీనగర్: వాల్‌నట్స్.. మన ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతాఇంతా కాదు. జ్ఞాపకశక్తి పెంచడం నుంచి, గుండెకు మేలు చేయడం, కేన్సర్‌ ప్రమాదం తగ్గించడం వంటి ఎన్నో రకాల ప్రయోజనాలు వాల్‌నట్‌ సొంతం. వీటిని ఆక్రోటు గింజలు అని కూడా పిలుస్తారు. ఇన్ని ఉపయోగాలున్న వాల్‌నట్స్ మనదేశంలో హిమాలయాలకు సమీపంలోనే ఎక్కువగా పండుతాయి. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోనే వీటిని బాగా పండిస్తారు. వీటిలో కూడా కశ్మీరీ వాల్‌నట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.

ఈ వాల్‌నట్స్‌ను చాలామంది బ్రెయిన్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గింజలను పగలగొట్టి తినే పప్పులు.. మెదడులా కనిపిస్తాయట. ఈ పేరుకు తగ్గట్లే వాల్‌నట్స్‌ మన మెదడుకు ఎనలేని మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. జ్ఞాపకశక్తి పెంచడంతోపాటు డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించి మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ యాసిడ్స్ సహాయపడతాయి.

వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవి కేన్సర్ కణాలతో పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే టైప్ టూ డయాబెటీస్ విషయంలో కూడా వాల్‌నట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నానబెట్టిన వాల్‌నట్స్‌ను ప్రతిరోజూ ఉదయం, రాత్రి తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను నియంత్రించవచ్చని నిపుణులు స్పష్టంచేశారు. ఇలా రోజుకు కనీసం ఐదు వాల్‌నట్స్‌ను తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టేయొచ్చని పరిశోధనల్లో కూడా బయటపడింది.

ఇన్ని ప్రయోజనాలున్న వాల్‌నట్స్‌ను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ నుంచి విదేశాలకు వాల్‌నట్స్ ఎగుమతి భారీగా జరుగుతుంది. వీటిలో కూడా కశ్మీర్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్రోటు గింజలు మహారుచిగా ఉంటాయని పేరు. అందుకే ఎప్పుడెప్పుడు కశ్మీరీ వాల్‌నట్స్‌ ఎగుమతులు ప్రారంభమవుతాయా? అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంటుంది. ఈ ఎగుమతులు కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి కూడా. ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే వాల్‌నట్స్‌ తోటల్లో పని ప్రారంభమవుతుంది.

ఆక్రోటు తోటల్లో పనివాళ్లు.. పెద్ద పెద్ద కర్రలు తీసుకొని, చెట్ల కింద నిలబడి బాగా ఆక్రోటు పళ్లు ఉన్న కొమ్మలను కర్రలతో కొడతారు. ఆ దెబ్బలకు కింద రాలిన పళ్లను సేకరిస్తారు. ఇలా చేసేటప్పుడు ఎత్తుగా ఉన్న ఆక్రోటు పళ్ల కోసం చెట్లెక్కి మరీ శ్రమపడతారు. ఆపై ఈ సేకరించిన ఆక్రోటు పళ్లను ఓపెన్ చేసి లోపల ఉన్న గింజలను వేరుచేస్తారు. ఈ గింజలన్నింటినీ తట్టల్లో వేసుకొని నీటిలో శుభ్రం చేస్తారు. దీనికోసం ఎక్కువగా నదుల వద్దకు వెళ్లి, ప్రవహించే నీటిలో ఈ వాల్‌నట్స్‌ను కడుగుతారు. కడిగిన వాల్‌నట్స్‌ను ఎండలో ఆరబెట్టడంతో పని ముగుస్తుంది.

గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కశ్మీర్‌లో వాల్‌నట్స్‌ ఉత్పత్తి బాగా జరిగిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తోటల యజమానులతోపాటు పనివాళ్లు, అధికారులు అందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ ఏడాది వాతావరణం వాల్‌నట్స్‌ సాగుకు చాలా సహకరించిందని వాళ్లు చెప్పారు. వీటితోపాటు బాదం వంటి మిగతా తోటల్లో కూడా ఈ ఏడాది విస్తారంగా దిగుమతి వచ్చిందట. ఈ విషయాన్ని కశ్మీర్‌లోని ఐకార్- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ టెంపరేచర్ హార్టికల్చర్ అధికారులు కూడా ధ్రువీకరించారు.

తోటలసాగు విషయంలో పెంపకం దారులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, మొక్కలు నాటినప్పటి నుంచి వారికి అన్ని రకాల సూచనలూ ఇస్తామని ఐకార్ అధికారులు చెప్పారు. ఆక్రోటు తోటలు వేయడానికి, సాగు సమయంలో తలెత్తే అన్ని రకాల ఇబ్బందులకూ తాము పరిష్కార మార్గాలు చూపిస్తామన్నారు. ఈ విషయంలో తోటల పెంపకం దారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని చెప్పారు. మొక్కలు నాటే సమయం నుంచి, పళ్లు కోసే వరకు అన్ని దశల్లో తోటల పెంపకం దారులకు అందుబాటులో ఉంటామని వివరించారు.

నదిలో శుభ్రం చేసి, ఆరబెట్టిన ఆక్రోటు గింజలను అలానే తినేయొచ్చు. లేదంటే నిప్పులపై కాల్చుకొనిగానీ తింటారు. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే చాలా ఉపయోగమని నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తారు. ఈ వాల్‌నట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా రోగాలను కంట్రోల్ చేయవచ్చని పరిశోధనల్లో కూడా తేలింది. ఈ గింజలు గుండెపోటు, కేన్సర్, అతిబరువు, నిద్రలేమి తదితర వ్యాధులను తగ్గిస్తాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ వాల్‌నట్స్‌కు భారీగా డిమాండ్ ఉంది.

Advertisement
Advertisement
Advertisement