Abn logo
Oct 27 2021 @ 02:17AM

వాంఖడే.. సాక్షులు ముందే సిద్ధం!

ముంబై నౌకలో డ్రగ్స్‌ రేవ్‌పార్టీ కేసులో 

గోసావితో రైడ్‌లో పాల్గొన్న అధికారి!!

సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌

వాంఖడే చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

వాంఖడే జన్మతః ముస్లిం అని నిరూపిస్తా

ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై నేడూ వాదనలు

నా భర్తకు ప్రాణహాని ఉంది: వాంఖడే భార్య

సెయిల్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు


ముంబై నౌకలో డ్రగ్స్‌ రేవ్‌పార్టీ కేసులో.. గోసావితో రైడ్‌లో పాల్గొన్న అధికారి..!!.. సోషల్‌ మీడియాలో ఫొటోల వైరల్‌


రంగంలోకి ముంబై పోలీసులు..

వాంఖడే చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై నేడూ వాదనలు

ఇద్దరికి బెయిల్‌ ఇచ్చిన ట్రయల్స్‌ కోర్టు

ముంబై, అక్టోబరు 26: నౌకలో డ్రగ్స్‌ రేవ్‌పార్టీ కేసులో ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ముందే సాక్షులను సిద్ధం చేసుకున్నారా? రైడ్‌ జరుగుతున్నంత సేపు.. సాక్షులు ఆయన వెంటే ఉన్నారా? ఆర్యన్‌ఖాన్‌ వద్ద డ్రగ్స్‌ లభించకున్నా.. అతణ్ని ఇరికించే ప్రయత్నం చేశారా? ఈ ప్రశ్నలకు మంగళవారం వైరల్‌ అయిన కొన్ని ఫొటోలు అవుననే చెబుతున్నాయి. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధామేచా సహా 20 మంది అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ గోసావి, అతని అంగరక్షకుడు ప్రభాకర్‌ సెయిల్‌, అర్బాజ్‌ అనుచరుడు మనీశ్‌ భానుసాలి సహా.. తొమ్మిది మందిని సాక్షులుగా చేర్చారు. అయితే.. అరెస్టులకు వాంఖడే సాక్షులతో అంటకాగినట్లు కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అందులో రైడ్‌ జరిగినంత సేపు వాంఖడే వెంట గోసావి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్యన్‌ఖాన్‌తో దిగిన సెల్ఫీ వైరల్‌ అవ్వడంతో గోసావిని సాక్షిగా గుర్తించామని అప్పట్లో దర్యాప్తు అధికారులు చెప్పినా.. తాజాగా వైరల్‌ అయిన ఫొటోలను బట్టి అతను ముందు నుంచే వాంఖడే వెంట ఉన్నట్లు తెలుస్తోంది. మరో సాక్షి మనీశ్‌ కూడా వాంఖడేతో కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ తాజాగా మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వాంఖడే 26 కేసుల్లో నిబంధనలను ఉల్లంఘించారు. బాలీవుడ్‌ ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేశారు. నా నంబర్‌తో పాటు.. నా కూతురి మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన కాల్‌ డేటా ఇవ్వాలంటూ ముంబై పోలీసులను కోరారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై ఎన్‌సీబీకి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు, హోంమంత్రికి లేఖలు రాసినట్లు చెప్పారు. ‘‘వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ 1970లో జహీదాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్లాంను స్వీకరిస్తూ.. దావూద్‌గా పేరు మార్చుకున్నారు. ముస్లిం జంటకు పుట్టిన సమీర్‌ వాంఖడే.. జన్మతః ముస్లిమే’’ అని పున రుద్ఘాటించారు. సమీర్‌ వాంఖడేతోపాటు.. కొందరు అధికారులు రూ.1,000కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాలిక్‌ లేఖపై విచారణ జరిపిస్తామని ఎన్‌సీబీ అధికారి అశోక్‌ జైన్‌ వెల్లడించారు. మాలిక్‌ ఆరోపణలు ఓ జోక్‌ అంటూ సమీర్‌ వాంఖడే కొట్టిపారేశారు. ఆయన ఢిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయంలో 2 గంటల పాటు గడిపారు. ఆయన ఎవరెవరిని కలిశారనే వివరాలు బయటకు రాలేదు. రూ.25 కోట్ల లంచం ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌సింగ్‌ మాత్రం వాంఖడే తనను కలవలేదని వివరించారు. శివసేన కూడా తన అధికారిక పత్రిక సామ్నాలో మంగళవారం ప్రచురించిన సంపాదకీయం ద్వారా రూ. 25 కోట్ల లంచం ఆరోపణలపై స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని, దాని పర్యవసానాలు ఉంటాయని అందులో హెచ్చరించింది. ఎన్‌సీపీ, శివసేన దాడి నేపథ్యంలో తన భర్తకు ప్రాణహాని ఉందంటూ వాంఖడే భార్య, మరాఠీ నటి క్రాంతి రేద్కార్‌ ఆరోపించారు. మరోవైపు ఎన్‌సీబీ తనతో తెల్లకాగితాలపై సంతకం తీసుకుందని, ఆర్యన్‌ విడుదలకు రూ. 25 కోట్ల లంచం తీసుకుందని సాక్షి ప్రభాకర్‌ సెయిల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ముంబై పోలీసులు మంగళవారం సాయంత్రం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీన్ని బట్టి.. సమీర్‌ను కూడా ముంబై పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది.

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై వాదోపవాదాలు

ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌, మున్‌మున్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో జస్టిస్‌ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌సింగ్‌ వాదనలు వినిపించారు. ‘‘ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ వినియోగదారుడే కాకుండా.. విక్రయ ముఠాలతో సంబంధం ఉన్న వ్యక్తి. అతని వద్ద డ్రగ్స్‌ దొరకకపోయినా.. నౌకలో డ్రగ్స్‌ రేవ్‌పార్టీ కుట్రలో అతను భాగస్వామి. గతంలో ఆయన డ్రగ్స్‌ వాడారనడానికి, అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్స్‌తో చాటింగ్‌ చేశారనడానికి ఆధారాలున్నాయి. ఆర్యన్‌ఖాన్‌తోపాటు.. షారూఖ్‌ఖాన్‌ మేనేజర్‌ పూజ దాడ్లానీ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముంది’’ అని వాదించారు. ఆర్యన్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ, సతీశ్‌ మనెషిండే వాదనలు వినిపించారు. ‘‘ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ లభించలేదు. చేయని నేరానికి 20 రోజులుగా జైలులో ఉన్నారు’’ అని తెలిపారు. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ సాంబ్రే ప్రకటించారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు మనీశ్‌ రాజ్గారియా, అవిన్‌ సాహూలకు ఎన్‌సీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

రూ. 14 కోట్ల చరస్‌ స్వాధీనం

ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సోమవారం నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ. 14.44 కోట్ల విలువైన చర్‌సను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముంబైకి చెందిన డాంగు ఉదాన్షివే, అతని భార్య క్లెరా, కూతురు సింథియా, వారి అనుచరుడు జసార్‌ జహంగీర్‌ షేక్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా జమ్మూకశ్మీర్‌ నుంచి కారులో డ్రగ్స్‌ తీసుకువస్తున్నారనే సమాచారంతో దాడి చేశామన్నారు.