కరోనాపై సుదీర్ఘ పోరాటం

ABN , First Publish Date - 2020-07-10T06:58:38+05:30 IST

కరోనా వైర్‌సపై మనం చేయాల్సిన పోరాటం సుదీర్ఘమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు సదా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గమని చెప్పారు...

కరోనాపై సుదీర్ఘ పోరాటం

  • అప్రమత్తంగా ఉండాలి.. మార్గదర్శకాలు పాటించడమే మార్గం
  • యూపీ ఏమౌతుందోనని భయపడ్డారు
  • సమర్థంగా తట్టుకొని నిలబడింది
  • వారాణసీ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ
  • ఆర్థిక వ్యవస్థ కొత్త చిగుర్లు వేస్తోంది
  • స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగిస్తాం
  • ఇండియా గ్లోబల్‌ సమిట్‌లో వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 9(ఆంధ్రజ్యోతి) : కరోనా వైర్‌సపై మనం చేయాల్సిన పోరాటం సుదీర్ఘమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు సదా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గమని చెప్పారు. గురువారం ఆయన తన సొంత నియోజకవర్గం వారాణసీకి చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వారాణసీ నగరం కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొందని ప్రశంసించారు.


వందేళ్ల క్రితం కూడా ఇలాగే భయంకరమైన వైరస్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, అప్పట్లో భారతదేశ జనాభా తక్కువే అయినప్పటికీ భారీ ఎత్తున మరణాలు సంభవించాయని చెప్పారు. ఈ సారి కూడా భారత్‌లో మరణాలు ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు ఆందోళన చెందారన్నారు. ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉండి, నిరు పేదలకు ఆహారం దొరకని పరిస్థితి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ గురించే వారు ప్రత్యేకంగా హెచ్చరించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజల కఠోర శ్రమ, వారి సహకారంతో నిపుణుల భయాలు నిజం కాకుండా చూడగలిగామన్నారు. కరోనా వైర్‌సను అరికట్టడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రశంసనీయ పాత్ర పోషించిందని 24 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం విపత్తును తట్టుకొని నిలబడిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌తో సరిసమానమైన జనాభా ఉన్న బ్రెజిల్‌ దేశంలో ఇప్పటికే 65 వేల మంది కరోనా వైర్‌సతో మరణించారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 800 మంది మాత్రమే మరణించారని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి వేగాన్ని సమర్థంగా అరికట్టిందని, రోగులు వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. వారాణసీలో కొవిడ్‌ను సమర్థంగా అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా ఎంతో ఉందని ప్రశంసించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా వారాణసీ భవిష్యత్తులో పెద్ద ఎగుమతి కేంద్రంగా భాసిల్లుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో వారాణసీలో ఎవరూ ఆకలికి అలమటించకుండా చేసిన స్వచ్ఛంద సంస్థలను ప్రశంసించారు. దాదాపు 100 స్వచ్ఛంద సంస్థలు నియోజకవర్గంలో 20 లక్షల ఆహారం పొట్లాలను, రెండు లక్షల కిరాణం కిట్లను అందజేశాయని చెప్పారు. నియోజకవర్గం అంతటా మాస్కులు, శానిటైజర్లను పంచిపెట్టాయని తెలిపారు.


నియోజకవర్గంలో మొబైల్‌ ఏటీఎంలను కూడా తిప్పారని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. అమెరికా జనాభాకు రెట్టింపు సంఖ్యలో ప్రజలకు భారత ప్రభుత్వం నవంబరు వరకు ఆహార ధాన్యాలు, వంటగ్యాస్‌ సరఫరా చేస్తోందని మోదీ ప్రస్తావించారు. వారాణసీలో ఆకలితో ఉన్న వారి కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని, నగరమంతటా కమ్యూనిటీ వంటశాలలు పెడతామని చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా వారాణసీని స్మార్ట్‌ సిటీగా మారుస్తామని ప్రకటించారు.


ఆర్థిక వ్యవస్థ చిగుర్లు వేస్తోంది

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటోందని, కొత్త చిగుర్లు వేస్తోందని ప్రధాని అన్నారు. భవిష్యత్తులోనూ భారత ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గురువారం మోదీ ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించే అంతర్జాతీయ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తామని చెప్పారు. భారత్‌లో కొత్త రంగాల్లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణల వల్ల గోదాములు, రవాణా రంగంలో భారీఎత్తున పెట్టుబడులకు అవకాశం ఏర్పడిందని చెప్పారు.


ప్రతిభతో అన్నీ జయిస్తాం

భారత్‌కు ఎలాంటి ఆర్థిక, సామాజిక సవాలునైనా ఎదుర్కొనే సత్తా ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతిభా సంపత్తికి ఇప్పటికే గుర్తింపు వచ్చిందని చెప్పారు. భారతీయులు సంస్కరణలను ఇష్టపడతారని, సవాళ్లను తట్టుకోగలమని చరిత్ర నిరూపించిందన్నారు.


రోడ్లపై ఉమ్మి వేయొద్దు

ప్రజలు ఇప్పటికైనా రోడ్లపై ఉమ్మి వేయడం లాంటి అలవాట్లను మానుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బనారసీ పాన్‌ను రోడ్డుపై ఉమ్మివేయడం లాంటి అలవాట్లను వదులుకోవాలని వారాణసీ ప్రజలకు సూచించారు. తరచూ చేతులు కడుక్కోవడం, మొహానికి మాస్కు, రెండు గజాల ఎడం పాటించడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఇవన్నీ మన సంస్కృతిలో భాగం చేసుకోవాలని చెప్పారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడొద్దని కోరారు. 

Updated Date - 2020-07-10T06:58:38+05:30 IST