నూటెనిమిది స్తంభాలు.. లక్షకు పైగా శివలింగాలు..

ABN , First Publish Date - 2021-12-10T05:30:00+05:30 IST

ఆ ఆలయ ప్రాంగణంలోని ఏ శివలింగాన్ని అభిషేకించినా... ఆ అభిషేక జలం గర్భగుడిలోని పరమేశ్వరుణ్ణి చేరుతుంది. అక్కడ ఉన్న స్తంభాల చుట్టూ 108 సార్లు తిరిగితే.....

నూటెనిమిది స్తంభాలు.. లక్షకు పైగా శివలింగాలు..

ఆ ఆలయ ప్రాంగణంలోని ఏ శివలింగాన్ని అభిషేకించినా... ఆ అభిషేక జలం గర్భగుడిలోని పరమేశ్వరుణ్ణి చేరుతుంది. అక్కడ ఉన్న స్తంభాల చుట్టూ 108 సార్లు తిరిగితే... కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే! తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి గ్రామంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సహిత శ్రీ సత్య రామ రసలింగేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి.  




స్థానిక శ్రీ సత్యరామ తిలక్‌ ఆశ్రమ వ్యవస్థాపకుడు ముప్పిడి బాలగంగాధర తిలక్‌ ఈ ఆలయాన్ని రెండేళ్ళ కిందట నిర్మించారు. ఈ గుడిలో 108 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం పైనా 1,108... అంటే మొత్తం 1,19,664 శివలింగాలు ఉన్నాయి. ఈ స్తంభాల కింద భక్తులు అభిషేకించుకోవడానికి శివలింగాలను ఏర్పాటు చేశారు. స్తంభాలపై ఉన్న లింగాలను అభిషేకించిన జలం గర్భాలయంలోని రసలింగేశ్వర స్వామిపై  పడుతుంది. దీంతో భక్తులు నేరుగా గర్భగుడిలోని పాదరస లింగాన్ని అభిషేకించినట్టు అవుతుంది. అభిషేక జలం పడినప్పుడు... పాదరస వర్ణంలో ఉన్న ఆ లింగం బంగారు వర్ణంలోకి మారుతుంది. మొత్తం 108 స్తంభాల చుట్టూ నూట ఎనిమిది సార్లు తిరిగితే... కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయిదేళ్ళపాటు నిర్మించిన ఈ ఆలయంలో పాదరసలింగాన్ని 2019లో ప్రతిష్ఠించారు. దాన్ని పన్నెండు కిలోల పాదరసంతో తయారు చేశారు. ప్రతిరోజూ ఉదయం లింగాన్ని శుభ్రపరుస్తారు. పాదరసం కరిగిపోకుండా... ప్రతి అమావాస్య, పౌర్ణమి దినాల్లో పాదరసంతో లింగానికి అభిషేకిస్తూ ఉంటారు. పదమూడేళ్ళుగా ఈ ఆశ్రమ ట్రస్ట్‌ అన్నదానాన్ని నిర్వహిస్తోంది. భక్తులు తప్పనిసరిగా పిడికెడు బియ్యాన్నైనా తీసుకురావాలన్నది ఈ ఆలయంలో నియమం. దానితో సమీపంలోని మూడు గ్రామాల్లో వృద్ధులకు, అనాథలకు ఇళ్ళ దగ్గరకే భోజనాలు అందజేస్తున్నారు. బిక్కవోలుకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. 

                                                                                            ఆంధ్రజ్యోతి, బిక్కవోలు

Updated Date - 2021-12-10T05:30:00+05:30 IST