వస్తున్నా అనేలోపే.. ఒక వార్డు కార్యదర్శికి 10 పనులు

ABN , First Publish Date - 2020-04-05T08:55:11+05:30 IST

అతనో వార్డు కార్యదర్శి. రేషన్‌షాపుల దగ్గర లబ్ధిదారులకు బదులుగా వేలిముద్ర వేసే పని ఆయనకు అప్పగించారు. ఇంతలోనే పోలీసు శాఖ నుంచి ఫోన్‌. ఫలానా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేయండి, అక్కడ పని ఉంది

వస్తున్నా అనేలోపే.. ఒక వార్డు కార్యదర్శికి 10 పనులు

  • ఏది చేయాలో.. ఎవరి ఆదేశాలను పాటించాలనేది తెలియక తికమక
  • పలు విభాగాల తీరుతో సతమతం
  • కొరవడిన సమన్వయంతో తంటా


అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): అతనో వార్డు కార్యదర్శి. రేషన్‌షాపుల దగ్గర లబ్ధిదారులకు బదులుగా వేలిముద్ర వేసే పని ఆయనకు అప్పగించారు.  ఇంతలోనే పోలీసు శాఖ నుంచి ఫోన్‌. ఫలానా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేయండి, అక్కడ పని ఉంది అని. ఆ కాసేపట్లోనే మరో ఫోన్‌. ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలు పంచాలి, ఫలానా చోటకు వెళ్లండని. ‘‘అది కాదు సార్‌! నాకు రేషన్‌ డ్యూటీ వేశారు. ఉదయం లేచేసరికే రేషన్‌ దుకాణాల ముందు పదుల సంఖ్యలో జనం ఉంటున్నారు. అక్కడికెళ్లకుంటే  ఇబ్బందిపడతారు’’ అని సదరు వార్డు కార్యదర్శి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘అవేమీ మాకు తెలీదు. మేం చెప్పినట్లు చేయాల్సిందే’’.. ఫోన్లు చేసిన ప్రతి శాఖ అధికారిదీ ఇదే హకుం. ఏం చేయాలి, ఎవరి ఆదేశాలు పాటించాలి, ఏ పనికి హాజరవ్వాలనేది గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శులకు ఎదురవుతున్న ప్రశ్న! పై స్థాయిలో సమన్వయం లేకుండా...వాళ్లు ఒకరికొకరు మాట్లాడకుండా కింద ఉన్న వారికి ఆదేశిస్తుండటమే దీనికి కారణం. అలాగే, గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శుల్లో ఏ విధుల్లో ఉన్నవారు ఏ విభాగం నియంత్రణలోకి వస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడమూ వారి కష్టాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరి ఆదేశాలే పాటిస్తే...మరొకరి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని సిబ్బంది వణికిపోతున్నారు. ‘‘మాకేమైనా శిక్షణ సమయంలో మాయలు, మంత్రాలు నేర్పించారా? లేకుంటే సినిమాలోలా ఒకే సమయంలో రెండు, మూడు చోట్ల ఉండే విద్య మాకేమైనా ఉందా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


రావాలంటే.. రవాణా ఉండొద్దా?

సచివాలయాల్లో పోలీసు బాధ్యతల్లో నియమితులైన మహిళలకు హఠాత్తుగా ఫోన్లు చేసి... ఎక్కడో 25 కిలోమీటర్ల అవతల ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లండంటూ ఆదేశాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ వాహనం లేని మహిళలు అక్కడికెళ్లేందుకు నానా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోందని సమాచారం. ‘‘రవాణా సదుపాయం లేదు. సొంత బైక్‌ లేదు. ఎలా అంటే...అవన్నీ తెలియదు...తక్షణం రావాల్సిందే అంటున్నారు’’ అని వారిలో కొందరు వాపోతున్నారు. పై స్థాయి నుంచి ఒకేసారి వస్తున్న విభిన్న శాఖల ఆదేశాలు, ఎలా చేయాలని అడిగితే...చేయాల్సిందే అంటూ ఎదురవుతున్న కరకు సమాధానాలతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్యదర్శులు పడిపోతున్నారు. తమ శాఖ పని అయిపోతే చాలుననే ఉద్దేశంతో...ఏ శాఖకు చెందినవారు ఆ శాఖ పనులను చెప్పేస్తున్నారు. అయితే ఈ చెప్పిన పనులు చేయాల్సిన వాళ్లు మాత్రం అసలే పని చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారు. ఉన్నతస్థాయిలో దీనిపై చర్చించి వీరిపై నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటిస్తే తప్ప ఈ గందరగోళానికి ముగింపు ఉండదని గ్రామ సచివాలయ వర్గాలే అంటున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీరికి శానిటైజర్లు, మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. నిత్యం వందలమందితో కలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న తమకు ఆరోగ్య రక్షణ లేదనే భయాందోళనలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-04-05T08:55:11+05:30 IST