వ్యర్థానికి అర్థం... పర్యావరణం భద్రం!

ABN , First Publish Date - 2021-04-01T05:30:00+05:30 IST

ఆరేళ్ళ క్రితం మాట... కేరళలోని కొచ్చీ సెయింట్‌ థెరిసా కాలేజీలో ఎకనామిక్స్‌ క్లాస్‌ జరుగుతోంది. ఎకనామిక్స్‌ విభాగాధిపతి

వ్యర్థానికి అర్థం... పర్యావరణం భద్రం!

వ్యర్థాల సమస్య తీర్చడం, పేద పిల్లలకు హాని కలిగించని, పర్యావరణ అనుకూలమైన ఆట వస్తువులను అందించడం...ఒకే ఆలోచనతో  వీటన్నిటికీ పరిష్కారం చూపించారు కేరళలోని కొచ్చీ విద్యార్థినులు...ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ నుంచి ప్రత్యేకంగా ప్రశంసలందుకున్న వారి ఆవిష్కరణ నేపథ్యం ఇదీ...


ఆరేళ్ళ క్రితం మాట... కేరళలోని కొచ్చీ సెయింట్‌ థెరిసా కాలేజీలో ఎకనామిక్స్‌ క్లాస్‌ జరుగుతోంది. ఎకనామిక్స్‌ విభాగాధిపతి నిర్మలా పద్మనాభన్‌ వివిధ అంశాల గురించి విద్యార్థినులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ప్లాస్టిక్‌ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాల గురించి చర్చ వచ్చింది. కనీసం తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోనైనా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటే ఏం చెయ్యాలో ఆలోచించారు. ఈ సందర్భంగా నిర్మల చేసిన ఒక సూచనను అందరూ ఆమోదించారు. ‘సొసైటీ ఆఫ్‌ తెరేసియన్స్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ (స్టెప్‌) ఏర్పాటయింది. ఆనాడు వేసిన ఆ ‘స్టెప్‌’ ఇప్పుడు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకొనే స్థాయికి చేరుకుంది.



అది అంచనాలకన్నా ఎక్కువే...

‘‘అసలు ఈ ఆలోచనకు బీజం పడింది 2014లో. ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో నడుస్తున్న ఒక ప్రాజెక్ట్‌ నిమిత్తం... నాలుగు జిల్లాల్లో పోగవుతున్న వ్యర్థాలపై తిరువనంతపురంలోని గులాటీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ ఆధ్వర్యంలో ఒక ఆడిట్‌ నిర్వహించాను. వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ శాతం అయిదున్నర నుంచి ఆరున్నర శాతం ఉంటుందన్నది సాధారణ అంచనా. కానీ గ్రామాల్లో అది పది పైనే ఉందనీ, దీనిలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల వాటాయే ఎక్కువనీ తెలిసింది. మట్టిలో కలిసిపోకుండా ఎంతో కాలం పర్యావరణానికి ముప్పుగా ఉండే ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలంటే... వాటికి ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందించాలి. వస్త్రాలతో తయారు చేసిన సంచులే  పరిష్కారమని నాకు అనిపించింది’’ అంటారు నిర్మల.



ట్రెండీగా.... ఆకర్షణీయంగా...

తమ కళాశాల విద్యార్థినులతో చర్చ వచ్చినప్పుడు... ఇదే సూచన ఆమె చేశారు. దాన్ని అమలులో పెట్టారు. ఉపయోగించి పడేసిన వస్త్రాలను సేకరించి, వాటితో మడత పెట్టే చేతి సంచులు, పర్సులు ఆకర్షణీయంగా, ట్రెండీగా ఉండేలా... క్యారెట్‌, బంతి, పర్సు, బ్యాక్‌ప్యాక్‌, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల డిజైన్లను విద్యార్థినులు రూపొందించారు. వీటి తయారీ కోసం భూమిమిత్ర సేనా క్లబ్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ క్లబ్‌లు ఏర్పాటు చేశారు.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్ఛతా మిషన్‌’ స్ఫూర్తితో వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్‌, భూమిలో కలిసిపోయే మెటీరియల్‌ వినియోగంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టులో వంద మందికి పైగా విద్యార్థినులు పాలు పంచుకున్నారు. కేరళ స్వయం సహాయక మహిళా సంఘాలైన ‘కుటుంబశ్రీ’ యూనిట్లకు వీటి తయారీ బాధ్యతను నిర్మల అప్పగించారు. మొదట ఒక సంస్థ నుంచి సేకరించిన లక్ష రూపాయల వడ్డీలేని రుణంతో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమయింది.


రీయూజ్డ్‌ వస్త్రాలతో చేసిన బ్యాగ్‌లు, ‘ప్రకృతి బ్యాగ్స్‌’ పేరిట కొత్త వస్త్రాలతో, పేపర్‌తో చేసిన బ్యాగులను కూడా తయారు చేయించి... పాఠశాలలు, కళాశాలలు, క్లబ్‌లు, పుస్తకాల దుకాణాల్లో విక్రయాలు ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ధర పాతిక రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 



పిల్లల కోసం ‘బొమ్మల బుట్ట’

భూమిమిత్ర ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నప్పుడు... పిల్లల ఆట వస్తువులు ఎందుకు తయారు చేయకూడదనిపించింది. ఆట వస్తువుల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌తో తయారైనవే. వాటిలో ఆరోగ్యానికి హాని చేసే విషపదార్థాలు ఉంటాయి. పిల్లలు ఎక్కువసేపు వాటితో ఆడుకోవడం, నోట్లో పెట్టుకోవడం వల్ల దుష్పరిణామాలు తప్పవు. టైలర్‌ షాపులు, కట్‌పీస్‌ సెంటర్లలో మిగిలిపోయే వేస్ట్‌ మెటీరియల్‌ను రోడ్ల మీదో, కాలువల్లోనో పారేస్తూ ఉంటారు. వాటినీ, కలప ముక్కలనూ ఉపయోగించి బొమ్మలు తయారు చేస్తే అటు వ్యర్థాల సమస్య తగ్గడంతో పాటు పిల్లల ఆరోగ్యానికి హాని ఉండదనీ, పర్యావరణానికి కూడా అనుకూలమనీ భావించాం. అలా ‘కలిచెప్పు’ (బొమ్మల బుట్ట) అనే కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం’’ అని చెబుతున్నారు నిర్మల.




ఈ ప్రాజెక్ట్‌తో కొచ్చి కార్పొరేషన్‌, కుటుంబశ్రీ బృందాలు చేతులు కలిపి, కొచ్చీ జిల్లాలోని క్లాత్‌ వేస్ట్‌ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చాయి. బొమ్మల రూపకల్పనలో అపెరల్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ టెక్నాలజీ కోర్సు రెండో ఏడాది విద్యార్థినులు, తయారీలో కుటుంబశ్రీ యూనిట్ల మహిళలు పాలుపంచుకుంటున్నారు. ఈ బొమ్మల ప్రయోజనం గురించి అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెటీరియల్‌ ఎలా సేకరించాలి, దాన్ని ఎలా శుద్ధి చెయ్యాలి, స్థానికంగా బొమ్మలు ఎలా తయారు చెయ్యవచ్చో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ బొమ్మలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు పంపిణీ చేస్తున్నారు.



ఆ మాటలతో గొప్ప ప్రోత్సాహం

‘‘మేము తయారు చేస్తున్న బొమ్మల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు మా భూమిపుత్ర ప్రాజెక్ట్‌ ద్వారా క్యారీ బ్యాగ్స్‌, కాలేజీ బ్యాగ్స్‌, కూరగాయల సంచులు, లంచ్‌ బ్యాగ్స్‌, శానిటరీ నేప్‌కిన్స్‌, డైపర్లు... ఇలా ఎన్నో క్లాత్‌, కాగితం ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ఎన్నో విభాగాలు ఇప్పుడు మాతో కలిసి పని చేస్తున్నాయి. ఈ స్ఫూర్తితో కొచ్చీ కార్పొరేషన్‌ ద్వారా ‘కాలిపట్టమ్‌’ అనే కొత్త ప్రాజెక్ట్‌ చేపట్టాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధించడానికి సాఫ్ట్‌ టాయ్స్‌ రూపొందిస్తున్నాం. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తున్న మా ప్రాజెక్టులను ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ‘మన్‌కీ బాత్‌’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించడం, పిల్లలకు అనుకూలమైన ఇలాంటి బొమ్మలను అంగన్‌వాడీలకు విరాళంగా అందజేస్తున్నందుకు అభినందించి, ఇలాంటి కార్యక్రమాలను అందరూ చేపట్టాలని సూచించడం మాకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.


త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ మా ప్రాజెక్టుల్ని విస్తరిస్తాం. ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌తో సహా వ్యాపార నిర్వహణ గురించి ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మా విద్యార్థినులకు మంచి అవగాహన కలుగుతోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌ విక్రయాల మీద కూడా దృష్టి పెడుతున్నాం’’ అంటున్నారు నిర్మల.


Updated Date - 2021-04-01T05:30:00+05:30 IST