యథేచ్ఛగా నీటి దందా

ABN , First Publish Date - 2020-12-03T06:33:34+05:30 IST

సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ నీటి దందా మూడు ప్లాంట్లు, ఆరు ట్యాంకర్లుగా వర్ధిల్లుతున్నది.

యథేచ్ఛగా నీటి దందా
కంది శివారులోని కింగ్స్‌ దాబా ఎదురుగా ట్యాంకర్లు నింపడానికి ఏర్పాటు చేసిన బోరు

 అనుమతులు లేకుండా వెలుస్తున్న వాటర్‌ప్లాంట్లు

 ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు నీటి తరలింపు

 ధ్వంసమవుతున్న గ్రామాల రహదారులు

 అడుగంటుతున్న భూగర్భ జలాలు

 కంది మండలంలో వాల్టా  చట్టానికి తూట్లు


కంది, డిసెంబరు 2: సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ నీటి దందా మూడు ప్లాంట్లు, ఆరు ట్యాంకర్లుగా వర్ధిల్లుతున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేసుకుంటూ ట్యాంకర్ల ద్వారా యథేచ్ఛగా నీటిని  తరలిస్తున్నారు.  లేదంటే  రైతులకు కొంత డబ్బిచ్చి వ్యవసాయ బోర్ల నుంచీ నీటిని  అడ్డూ అదుపూ లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్న నీటి దళారులు మండలంలోని పలు గ్రామాల్లో ఇష్టారీతిన వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని ఇంద్రకరణ్‌, కవలంపేట, కంది, చిమ్నాపూర్‌, జుల్‌కల్‌, చేర్యాల, ఎర్ధనూర్‌ గ్రామాల్లో అనుమతి లేని వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటర్‌ ట్యాంక్లర్ల ద్వారా నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యాడు.


అసలే నీటి ఎద్దడి

మూడేళ్లుగా కంది మండలంలో ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిశాయి. రైతులు కూడా వర్షాధార పంటలనే పండించుకుంటున్నారు. ఈ మధ్యనే కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో  భూగర్భ జలాలు అడుగంటిపోగా నేటికీ మంచినీటి సమస్య పరిష్కారం కాక నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో అసలే నీటి సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే మరోపక్క ఉన్న నీటి వనరులను అక్రమార్కులు జలగల్లా పీల్చేయడం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది.


దోపిడీ జరిగేది ఇలా..

మండలంలో అనుమతి లేకుండా వెలసిన వాటర్‌ ప్లాంట్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో ముఖ్యంగా కంది, ఇంద్రకరణ్‌ గ్రామాలనుంచి రోజూ పదుల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా ఎలాంటి అనుమతులు పొందకుండా పరిశ్రమలవారికి నీటి సరఫరా చేస్తున్నారు.  ఒక్కో ట్యాంకర్‌ సామర్థ్యం వెయ్యి లీటర్ల వరకు ఉంటుంది. ఇందుకుగానూ వాటర్‌ప్లాంట్‌ యజమానులు వ్యవసాయ బోరు ఉన్న రైతులకు ఒక్కో ట్యాంకర్‌కు రూ. 2 వేల నుంచి 3వేల వరకు చెల్లిస్తూ,  పరిశ్రమల వారి నుంచి రూ. 4వేల  నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కంది, ఇంద్రకరణ్‌ గ్రామాల నుంచే రోజుకు దాదాపు వంద వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామాల నుంచి రెండు లేదా మూడు ట్రిప్పుల చొప్పున అక్రమంగా నీటి సరఫరా జరుగుతున్నది.


రోడ్లన్నీ  ధ్వంసం

వాటర్‌ ట్యాంకర్ల రాకపోకల ద్వారా గ్రామాల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. గ్రామాల రోడ్లు పాడై శిథిలావస్థకు చేరుకుంటున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్లు ధ్వంసం కావడంతో ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు అస్తవ్యస్త రోడ్లతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు.

 జరిమానాలకూ జంకడం లేదు  

రెవెన్యూ అధికారులు అడపాదడపా వాటర్‌ ట్యాంక్లర్లను అడ్డుకొని జరిమానాలు విధిస్తున్నప్పటికీ, నీటి దళారులు ఏ మాత్రం జంకకుండా తమ దందాను రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు.  భూగర్భ జలాలు అడుగంటి పోతే రేపటి పరిస్థితి ఏమిటని రైతుల బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకొని, అక్రమ నీటి దందాకు అడ్డుకట్ట వేసి, భూగర్భ జలాలను కాపాడాలని మండల ప్రజలు, రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు.          

    అక్రమ వాటర్‌ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటాం   - పరమేశం, తహసీల్దార్‌,  కంది

 అక్రమ నీటి దందాకు అడ్డుకట్ట వేస్తాం. అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాటర్‌ ప్లాంట్లను తొలగిస్తాం. నీటి ట్యాంకర్లను సీజ్‌ చేసి, దళారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.  


Updated Date - 2020-12-03T06:33:34+05:30 IST