ప్ర‘జల’ కష్టాలు తీరాయి!

ABN , First Publish Date - 2021-01-20T05:13:47+05:30 IST

భద్రాచలం పట్టణవాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రతి రోజు తాగునీటి సౌకర్యం మార్చి నుంచి ప్రారంభం కానుంది.

ప్ర‘జల’ కష్టాలు తీరాయి!

నెరవేరిన చిరకాల స్వప్నం

మార్చి నుంచి ప్రతి రోజూ తాగునీరు 

రోజుకు ఒక్కో కనెక్షన్‌కు 300 లీటర్ల సరఫరా

నల్లాలకు మోటార్లు తొలగించకుంటే కనెక్షన్‌ తొలగింపు

భద్రాచలం, జనవరి 19: భద్రాచలం పట్టణవాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రతి రోజు తాగునీటి సౌకర్యం మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు వెల్లడిస్తున్నారు. జీవనది గోదావరి చెంతనున్నా పట్టణంలోని 20 వార్డుల పరిధిలో ఉన్న ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందని పరిస్థితి ఇంతకాలం నెలకొంది. అయితే ఇటీవల కాలంలో అన్ని కాలనీలలోని వారికి నల్లాలను ఏర్పాటు చేయడంతో తాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయ్యిందని మిషన్‌ భగీరథ అధికారులు పేర్కొంటు న్నారు. అయితే వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు సామర్థ్యం రోజుకు 12 మిలియన్‌ లీటర్లు. కాగా భద్రాచలం జనాభా 60 వేలను ప్రాతిపదికగా చేసుకొని ఆరు మిలియన్‌ లీటర్లను ప్రతిరోజు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. భద్రాచలంలో ఇప్పటి వరకు 15,472 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇందులో మిషన్‌ భగీరఽథ కనెక్షన్లు 10,950 ఉండగా పాత  నల్లా కనెక్షన్లు 4,522 ఉన్నాయి. ఈక్రమంలో ప్రతి రోజు ఒక్కొ కనెక్షన్‌కు 300 లీటర్ల నీటిని సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

నల్లాలకు మోటారు కనెక్షన్లతోనే అసలు సమస్య

భద్రాచలంలో దశాబ్దాల కాలంగా నల్లాలకు మోటారు కనెక్షన్లు అమర్చడంతో అన్ని కాలనీలకు తాగునీటిని సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కాలనీల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పాత నల్లా కనెక్షన్లు మొత్తం 4,522 ఉండగా అందులో మూడవేల కనెక్షన్లకు మోటార్లు బిగించి ఉన్నాయంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అవగతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు నల్లా నుంచి నీరు సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నా పూర్తిస్థాయిలో ప్రజల సహకారం లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నట్లు అంగీకరిస్తున్నారు. కాగా పాత నల్లాలకు మోటార్లు అమర్చగా వాటిని తొలగించాలని అధికారులు గత కొద్ది నెలలుగా విస్తృతస్థాయిలో మైకు ద్వార ప్రచారం చేసినా కనెక్షన్లు ఎవరూ తొలగించకపోవడం గమనార్హం.   

నల్లాలకు మోటార్లు తొలగించకుంటే కనెక్షన్‌ కట్‌

మిషన్‌ భగీరధ డీఈ ఎన్‌.శ్రీనివాసరావు

నల్లాలకు అమర్చిన మోటార్లు తొలగించాలని ఇప్పటికే మైకు ద్వారా విస్తృతంగా పట్టణంలో ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఇంటి యజమానులే తమ ఇళ్లల్లో ఉన్న పాత నల్లా కనెక్షన్లకు మోటార్లు తొలగిస్తారని భావించాం. కాని ఎటువంటి స్పందన లేదు. ఈ నేపధ్యంలో రాబోయే నెల రోజుల్లో పాత నల్లాలకు అమర్చిన మోటార్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఫిబ్రవరి ఒకటి నుంచి తాము చేపట్టే మోటార్ల తొలగింపు కార్యక్రమంలో ఎవరైనా పట్టుబడితే వారి నల్లా కనెక్షన్‌ను అధికారికంగా తొలగించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 


Updated Date - 2021-01-20T05:13:47+05:30 IST