Abn logo
Sep 27 2021 @ 00:30AM

రిజర్వాయర్లకు జలకళ

నిండుగా ఉన్న కోనాం


గరిష్ఠస్థాయిలో పెద్దేరు..

రైవాడకు పెరిగిన ఇన్‌ఫ్లో

కోనాందీ అదే పరిస్థితి

దేవరాపల్లి, సెప్టెంబరు 26: మండలంలోని రైవాడ జలాశయంలోకి ఆదివారం 400 క్యూసెక్కులు వరద నీరు పినకోట, సమ్మెద గెడ్డల నుంచి పారుతున్నది. రైవాడ జలాశయ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 110.70 మీటర్లకు చేరింది. ఎడమ కాలువ ధ్వారా ఆయకట్టుకు 100 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 50, విశాఖ నగర పాలక సంస్థకు తాగునీటి కోసం 50 క్యూసెక్కు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం 18 మిల్లీమీటర్లు వర్షం పడింది.


పెద్దేరుకు వరద నీరు

మాడుగుల రూరల్‌: మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరువగా ఉంది. తుఫాన్‌, ఇటీవల కురిసిన వర్షాలతో నీటి నిల్వలు పుష్కలంగా చేరాయి. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. కాగా ఆదివారం నాటికి 136.70 మీటర్లకి చేరింది. ఇన్‌ఫ్లో 501 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో రాచకట్టు కాలువకి 60 క్యూసెక్కులు, కుడి కాలువకు 50 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 391 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టామని జేఈ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. తుఫాన్‌ హెచ్చరికతో అప్రమత్తమై జలాశయం నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనించి నీటిని విడిచిపెడుతున్నామని ఆయన చెప్పారు.


కళకళలాడుతున్న కోనాం జలాశయం

చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం కళకళలాడుతున్నది. జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ఆదివారం ఉదయానికి 98.30 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 170 క్యూసెక్కులు కాగా, ఎగువ, దిగువ కాలువల ద్వారా 80 క్యూసెక్కుల నీటిని ప్రతీ రోజూ విడుదల చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఏఈఈ సీహెచ్‌.జయరాం తెలిపారు. కాగా, జలాశయం పరిధిలో 12,638 ఎకరాల్లో వరి, చెరకు నాట్లు లక్ష్యం కాగా, ఈనెల 19నాటికి పూర్తి అయ్యిందన్నారు.