సాగర్‌కు జలకళ

ABN , First Publish Date - 2021-07-31T08:28:43+05:30 IST

కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని

సాగర్‌కు జలకళ

ప్రాజెక్టులోకి భారీగా వరద.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం  

కొనసాగుతున్న కృష్ణమ్మ ఉధృతి.. శ్రీశైలంలోకి 5 లక్షల క్యూసెక్కులు


అమరావతి/కర్నూలు/విశాఖపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్‌లోకి భారీ వరద చేరుతోంది. నీటిమట్టం క్రమేణా పెరుగుతుండటంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను,  ప్రస్తుతం 211.04 టీఎంసీల నిల్వ ఉంది. శుక్రవారం జలాశయంలోకి4,93,765 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 5,50,590 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఏపీ పవర్‌ హౌస్‌ నుంచి 30,735 క్యూసెక్కులు, తెలంగాణ పవర్‌ హౌస్‌ నుంచి 25,426 క్యూసెక్కులు వదిలారు. అలాగే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 20వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సాగర్‌లోకి 3,52,137 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 31,086 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకుగాను.. 231.22 టీఎంసీలకు చేరింది. శనివారం నుంచి వరద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


ఎగువన ప్రాజెక్టులన్నీ ఫుల్‌: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువన ప్రధాన జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌ గరిష్ఠ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను.. 98 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఆల్మట్టిలోకి 4,20,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 4,23,000 క్యూసెక్కులు వస్తుంటే.. 4,17,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 4,67,100 క్యూసెక్కులు వస్తుండగా.. 4,76,797 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక తుంగభద్ర జలాశయం నీటి సామర్థ్యం 100.86 టీఎంసీలకు గాను ప్రస్తుతం 99.12 టీఎంసీల నిల్వ ఉంది. 29,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 43.06 టీఎంసీల మేర నిల్వ ఉంది. పులిచింతలలోకివస్తున్న 27,873 క్యూసెక్కుల వరదను వచ్చినట్టుగానే దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దాదాపు నిండిపోయింది. 10,353 క్యూసెక్కులను సముద్రంలోనికి వదులుతున్నారు. 


పోతిరెడ్డిపాడు వద్ద ఎస్‌ఆర్‌ఎంసీకి రంధ్రం   

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ఎస్‌ఆర్‌ఎంసీకి రంధ్రం పడింది. ప్రాజెక్టు సేఫ్టీవాల్‌ను ఆనుకుని లైనింగ్‌పై 10 అడుగుల మేర రంధ్రం ఏర్పడింది. గతంలో ఇదే ప్రాంతంలో కిందవైపు లైనింగ్‌ దెబ్బతింది. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం పైభాగంలో కూడా రంధ్రం పడింది. 


నేడు, రేపు తేలికపాటి వర్షాలు: గాంగ్‌టక్‌-పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఝార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీ మీదుగా పడమర గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


రిజర్వాయర్లు పొర్లుతున్నా సీమకు నీరివ్వరా?: సోమిరెడ్డి


అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్లు పొంగి పొర్లుతూ వరద నీరు సముద్రంలోకి వెళ్లే పరిస్థితులు వచ్చినా కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాయడం దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కృష్ణా బోర్డు  సమావేశం జరిగిన తర్వాతే పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా సీమకు నీరు వదలాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత ఘోరంగా లేఖలు రాస్తున్నా ఏపీ సీఎం జగన్‌ కిక్కురుమనడం లేదని, తెలంగాణ వైఖరిని తప్పుబట్టే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కాగా.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఈఎన్‌సీ శాడిజంతో వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. నీటిని సముద్రంలోకి వదిలేసినా ఫర్వాలేదు గానీ, పోతిరెడ్డ్డిపాడుకు మాత్రం ఇవ్వొద్దని కృష్ణా బోర్డుకు చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు.

Updated Date - 2021-07-31T08:28:43+05:30 IST