తీరిన దాహార్తి..

ABN , First Publish Date - 2020-06-01T10:58:02+05:30 IST

ఆరేళ్ల క్రితం కోర్‌సిటీలో సైతం వారానికి ఒక రోజు నీటిని సరఫరా చేసేందుకు ఇబ్బంది పడిన వాటర్‌ బోర్డు ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ వరకు

తీరిన దాహార్తి..

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల క్రితం కోర్‌సిటీలో సైతం వారానికి ఒక రోజు నీటిని సరఫరా చేసేందుకు ఇబ్బంది పడిన వాటర్‌ బోర్డు ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నీటిని అందించేందుకు చర్యలు చేపడుతోంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తోంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ పరిధిలోని గ్రామాల్లోనూ కృష్ణా, గోదావరి జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. రోజు విడిచి రోజు నీరు అందించే పరిస్థితి నుంచి రోజూ తాగునీటి అందించే దిశగా ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి.


నగర దాహార్తిని తీర్చడానికి  జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లతోపాటు అవసరానికి అనుగుణంగా సింగూరు, మంజీర జలాలను బోర్డు వినియోగించింది. ఆయా జలాశయాల్లో నీటిలభ్యత లేకపోవడంతో నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌ల్లో 1,255 మిలియన్‌ లీటర్లు, గోదావరి జలాలను ఎల్లంపల్లి నుంచి 760 మిలియన్‌ లీటర్లను రోజూ నగరానికి తరలిస్తున్నారు.  శివారు మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు రూ. 1,900 కోట్లతో హడ్కో ప్రాజెక్టును చేపట్టింది. ఔటర్‌ పరిధిలోని గ్రామాలకు నీరందించేందుకు రూ. 756కోట్లతో పైపులైన్లు, స్టోరేజీ కోసం రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. కొత్తగా 200కి పైగా రిజర్వాయర్లు అందుబాటులోకి తీసుకొ చ్చారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యితే ఔటర్‌ వరకు నగరంలో ఏకాలంలోనైనా మంచినీటికి ఢోకా ఉండదు.


మురుగునీటి నిర్వహణలో మెరుగు

నగరంలో ఎన్నోఏళ్ల క్రితం నాటి సీవరేజీ వ్యవస్థ ఉన్నా.. మురుగునీటి నిర్వహణ చర్యలు మెరుగ్గా చేపడుతున్నారు.  మానవరహిత పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా మినీ జెట్టింగ్‌ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటర్‌బోర్డు రూపొందించిన మినీ ఎయిర్‌ టెక్‌ యంత్రాలనే ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో వినియోగిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మురుగునీటి నిర్వహణకు ఎస్టీపీల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తోంది. మురుగునీటి నిర్వహణ మరింత సులభతరం చేసేందుకు రోబోటిక్‌ యంత్రాలను ప్రోత్సహించే దిశగా బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


నాణ్యమైన నీటి సరఫరా 

వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న మంచినీరు ఐఎ్‌సఓ సర్టిఫికెట్‌ పొందింది. నగరంలో  సరఫరా చేస్తున్న నీరు  సురక్షితమని కేంద్ర ప్రభుత్వం సైతం కితాబిచ్చింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్‌ నగరాల్లో శాంపిల్స్‌ సేకరించి నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించింది. నగరంలో సేకరించిన శాంపిళ్లు నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయని ప్రకటించింది. దేశంలోనే నాణ్యమైన నీటి సరఫరాలో ముంబై మొదటి స్థానంలో నిలువగా హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2020-06-01T10:58:02+05:30 IST