చినుకు సందడి

ABN , First Publish Date - 2020-07-06T10:33:48+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎడతెరపిలేకుండా ముసురు పట్టింది. శనివారం సాయంత్రం నుంచి

చినుకు సందడి

ఇరు జిల్లాల్లో ఎడతెరపిలేని ముసులు

సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 

ఖమ్మం జిల్లాలో 2.8, భద్రాద్రి జిల్లాలో1.8 సెంటీమీటర్ల వర్షపాతం 

కదిలినవాగులు.. చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు

కిన్నెరసాని రిజర్వాయర్‌కు జలకళ 


ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం/పాల్వంచ రూరల్‌, జూలై 5: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎడతెరపిలేకుండా ముసురు పట్టింది. శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఆదివారం కూడా కొనసాగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురసింది. ఇప్పటి వరకు జిల్లాలో ఓ మోస్తారు వర్షపాతం తప్ప భారీ వర్షాలు ఎక్కడా నమోదవ్వలేదు.  జిల్లాలో ఈసీజన్‌లో జూన్‌లో 19 రోజులు వర్షం కురిసింది. ఆ నెలలో 105.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కాగా 169.3మిల్లీమీటర్లు కురిసింది. 79శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. జూలైలో ఇప్పటివరకు 74.9 మిల్లీమీటర్లు కురిసింది. ఈ నెలలో ఇప్పటివరకు 5రోజుల పాటు వర్షం కురిసింది. జిల్లాలో 18మండలాల్లో 20శాతం అదనంగానే వర్షాలు పడగా మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.


భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 18.00 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో చిన్న చిన్న చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. గత రెండు రోజులుగా కరుస్తున్న వర్షాలకు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. ప్రస్తుతం కరుస్తున్న వర్షాలు పత్తిపంటకు అనుకూలంగా మారాయి. అశ్వారావుపేటలో అత్యధికంగా 38.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.


బలహీనంగా విద్యుత్‌ స్తంభాలు, రక్షణ ఏర్పాట్లు లేని ట్రాన్స్‌ఫార్మర్లు తదితర వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ప్రతి మండల కార్యాలయం మునిసిపల్‌ సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో, ఆర్‌ అండ్‌  బీ, టీపీవో, వైద్య, ఇంజనీరింగ్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించేందుకు వీలుగా 24గంటలు పని చేయాలన్నారు. ప్రతి రెండు గంటలకు కలెక్టరేట్‌ కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. 


కిన్నెరసానికి రిజర్వాయర్‌కు  జలకళ 

ఎగువన కురుస్తున్న వర్షాలతో పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఆదివారం రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 407అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 399.50 అడుగులకు చేరుకుంది. గుండాల, మర్కోడు, ఆళ్లపల్లి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కరుస్తుండడంతో ఆ వరదంతా కిన్నెరసాని రిజర్వాయర్‌కు చేరుతోంది. ఇన్‌ఫ్లో 5వేల క్యూసెక్కులు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. యానంబైలువాగు దాటే క్రమంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. కిన్నెరసాని కాలువకు ఇరువైపుల ఉన్న విద్యుత్‌ మోటర్లను రైతుఉలు భద్రపరచుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-07-06T10:33:48+05:30 IST