వచ్చే నెల రెండో వారంలో ఆయకట్టుకు నీరు!

ABN , First Publish Date - 2021-07-29T05:30:00+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిఽధిలో ఎడమ కాల్వ ఆయకట్టుకు వచ్చే నెల రెండో వారంలో సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

వచ్చే నెల రెండో వారంలో ఆయకట్టుకు నీరు!

నాగార్జునసాగర్‌, జూలై 29: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిఽధిలో ఎడమ కాల్వ ఆయకట్టుకు వచ్చే నెల రెండో వారంలో సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మూడేళ్లుగా ఆగస్టు నెలలోనే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది సైతం ఆగస్టు నెలలోనే నీటిని విడుదల చేయాలని ఎడమకాల్వ పరిధిలోని జిల్లా ఆయకట్టుతోపాటు ఖమ్మం జిల్లా రైతులు కోరడంతో అధికారులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు.

నిండుకుండలా ప్రాజెక్టులు

కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా సాగర్‌ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సతంరించుకొని నిండుకుండలా మారాయి. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885అడుగులకు గురువారం రాత్రికి 884.40అడుగులకు చేరింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచే శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్లను 15అడుగుల మేరకు ఎత్తి 3,75,680క్యూసెక్కుల నీటిని, రెండు జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 53,887 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం నుంచి మొత్తం 4,38,268 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. ఎగువ నుంచి వరద రాక ఇలాగే కొనసాగితే ఐదు రోజుల్లో సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. ఆగస్టు మొదటి వారంలో సాగర్‌ ప్రాజెక్టు నిండితే రెండో వారంలో ఎడమ కాల్వకు నీటిని విడుదలచేయడంతోపాటు, సాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 549.50 అడుగులకు(208.6780టీఎంసీలకు) చేరింది. మరో 104టీఎంసీల నీరు సాగర్‌కు వస్తే ప్రాజెక్టు గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. సాగర్‌ నుంచి ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 28,224 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వలకు ఎటువంటి నీటి విడుదల లేదు. సాగర్‌ నుంచి మొత్తం 29,324 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 4,38,268క్యూసెక్కుల నీరు వస్తోంది. వరద ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను తాకింది.

3.60లక్షల ఎకరాల ఆయకట్టు

సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,78,860ఎకరాలు, ఎత్తిపోతల పథకాల కింద 81,841 ఎకరాలు, మొత్తం 3,60,701ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. నల్లగొండ జిల్లాలో ఎనిమిది మండలాలు అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో 1,53,542ఎకరాల ఆయకట్టు ఉంది. సూర్యాపేట జిల్లాలో 11మండలాలు పెన్‌పహాడ్‌, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెర్వు, చిలుకూరు, నడిగూడెం, మునగాల, కోదాడ మండలాల్లో 2,07,159 ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రైతులు నారుమడులు సిద్ధం చేసుకొని నాట్లు వేసేందుకు ఎదురుచూస్తున్నారు.

ఆయకట్టు రైతుల్లో ఆశలు

సాగర్‌కు ఎగువ నుంచి భారీ మొత్తంలో వరద వస్తుండటంతో ఎడమకాల్వ ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. సాగర్‌కు ఎగువ ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడంతో ఆగస్టు మొదటి వారంలోనే ప్రాజెక్టుకు నీరు వస్తుందని అంచనావేశారు. వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం ఆగస్టు రెండో వారంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలపడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుపనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST