జల పరవశం

ABN , First Publish Date - 2020-09-19T10:05:34+05:30 IST

ఓ వైపు కాళేశ్వరం జలాల పరవళ్లు.. మరో వైపు భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సంబరం నెలకొంది. వర్షపు చుక్క కోసం ఎదురుచూసిన చోట.. ఇప్పుడు బోరుబావుల నుంచి నీళ్లు ఉబికి వస్తున్న

జల పరవశం

జిల్లా అంతటా నీటి గలగలలు

1063 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం

గత ఏడాదికంటే 505 మి.మీ. అధికం

కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లకు కళ

పొంగుతున్న వాగులు, నిండిన చెరువులు

8.14 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు

గతేడాది పోల్చితే 9.62 మీటర్లు అదనం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు18 : ఓ వైపు కాళేశ్వరం జలాల పరవళ్లు.. మరో వైపు భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సంబరం నెలకొంది. వర్షపు చుక్క కోసం ఎదురుచూసిన చోట.. ఇప్పుడు బోరుబావుల నుంచి నీళ్లు ఉబికి వస్తున్న దృశ్యాలను చూసి రైతన్నలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. గోదావరి జలాలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు, వాగులు జలకళను సంతరించుకోవడమే కాకుండా తాజా వానలతో భూగర్భజలాలు సైతం ఆశించిన స్థాయికన్నా ఎక్కువే పెరిగాయి. 


రికార్డు స్థాయిలో డబుల్‌ వర్షపాతం

సాధారణంగా ప్రతీ సంవత్సరం 400 నుండి 500 మి.మీ.ల వర్షపాతం నమోదు అవుతూ ఉంటుంది. గడిచిన ఐదేళ్లుగా దాదాపు ఇవే గణాంకాలు రికార్డుల్లో కనిపిస్తాయి. అయితే తొలిసారిగా వర్షపాతం 1000 మి.మీ.ల మార్క్‌ను దాటి రికార్డు స్థాయిలో 1063 మి.మీ.ల అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. 2007లో గుర్తుంచుకోదగిన స్థాయిలో భారీ వర్షాలు కురిసినా ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. 


భూగర్భజలాలు పైపైకి

భూగర్భజలాలు కూడా రికార్డు స్థాయిని నమోదు చేశాయి. గడిచిన 20 ఏళ్లలో లేని విధంగా పైకెగసాయి. దీనికి భారీ వర్షాలతోపాటు కాళేశ్వరం జలాలు కూడా కారణంగా చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా సగటున జూన్‌ నెలలో భూగర్భ జలమట్టం 14.17 మీటర్లు ఉండగా జూలై మాసంలో 12.29 మీటర్లు ఉంది. ఇక ఆగస్టు నెలలో 8.14 మీటర్ల పైకి భూగర్భజలాలు ఎగబాకాయి. ప్రస్తుతం సెప్టెంబరులోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత పైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో 17.76మీటర్ల అడుగున ఉన్న నీళ్లు.. ఈ సీజన్‌ వానలతో 9.62 మీటర్లు పైకి రావడం గొప్ప పరిణామం.


13 టీఎంసీల నీటి ఎత్తిపోత

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో జిల్లాలోని అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మిడ్‌మానేరు నుంచి ఇప్పటివరకు సుమారుగా 13 టీఎంసీల నీటిని జిల్లాకు విడుదల చేశారు. 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న అనంతగిరి రిజర్వాయర్‌, 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. అదే విధంగా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 7 టీఎంసీలకు పైగానే నీళ్లున్నాయి. కాళేశ్వరం జలాలతో ఇప్పటికే చెరువులు, చెక్‌డ్యాములను నింపారు. 


నిండుకుండల్లా చెరువులు

జిల్లా వ్యాప్తంగా 2971 చెరువులు, 513 చెక్‌డ్యాములు ఉన్నాయి. దాదాపు 2,900 చెరువులు నిండుకుండల్లా మారినట్లు అధికారులు ధ్రువీకరించారు. అంతేగాకుండా ఏళ్లతరబడిగా చుక్కనీరు లేని చెరువులు మత్తడి దుంకిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇక చెక్‌డ్యాములు సైతం పొంగిపొర్లుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్లే వాగులు, చెక్‌డ్యాములు పొంగిపొర్లుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌ వరకు ఈ నీళ్లు రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు. 

Updated Date - 2020-09-19T10:05:34+05:30 IST