Abn logo
Sep 20 2021 @ 02:28AM

తడిచి..చెదలుపట్టి..

కాకినాడ కౌంటింగ్‌లో బ్యాలెట్‌ బాక్సులో కనిపించిన చెదలుపట్టిన బ్యాలెట్‌ పేపర్లు

  • ప్రహసనంగా జడ్పీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • కరప, పెద్దాపురం, ఏజెన్సీ మండలాల బ్యాలెట్‌ బాక్సుల్లోకి వర్షం నీళ్లు 
  • మరోపక్క కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం

కాకినాడ (ఆంధ్రజ్యోతి): పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహాసనంగా మారింది. ఎక్కడి కక్కడ బ్యాలెట్‌ పత్రాల్లోకి వర్షపు నీరు చేరి తడిచిముద్దవడం, మరికొన్నిచోట్ల ఏకంగా చెదలు పట్టడంతో చాలాసేపు కౌంటింగ్‌ నిలిచిపోయింది. వందలాది బ్యాలెట్‌ పత్రాలు లెక్కింపునకు కూడా పనిచేయని విధంగా మారిపోవడంతో వీటిని ఏంచేయాలో తెలియక అధికారులు తర్జన భర్జన పడ్డారు. చివరకు విషయాన్ని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు. కొన్నిచోట్ల విషయాన్ని పార్టీల కౌంటింగ్‌ పర్యవేక్షణ ఏజెంట్లకు వివరించి వారి అనుమతితో లెక్కింపునకు అనువుగా ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకున్నారు. గంగవరం మండలానికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్లకు చెదలు పట్టాయి. దీంతో చెరో 31 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించిన ఓట్లు పనికి రాకుండా పోయాయి. కరప మండలం అరట్లకట్ట బూతకు సంబంధించిన బ్యాలెట్‌బాక్సుల్లో వర్షపునీరు చేరింది. ఇదిజరిగి చాలారోజులు కావడంతో 450వరకు ఓట్లు ముద్దయిపోయాయి. విషయం పార్టీల ఏజెంట్లకు తెలియడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జరిగిన లెక్కింపు కేంద్రంలో వీటిని ఫ్యాన కింద ఆరబెట్టారు. పెద్దాపురం మం డలం పులిమేరు బూత నెంబర్‌ 13/25లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు చెరో 730 ఓట్లు పోలవగా ఈ బ్యాలెట్‌ బాక్సులను సా్ట్రంగ్‌రూం నుంచి బయటకు తెచ్చి లెక్కింపు కోసం తెరవగా అందులో 162 జడ్పీటీసీ, 139 ఎంపీటీసీ అభ్యర్థులకు పోలయిన ఓట్లు చెదలుపట్టి ఉన్నాయి. దీంతో అభ్యర్థులతో అధికారులు చర్చలు జరిపారు. చివరకు అందులో గుర్తించ డానికి వీలున్న బ్యాలెట్‌ పత్రాలను కౌంటింగ్‌కు పరిగణనలోకి తీసుకున్నారు. రాజవొమ్మంగి ఎంపీటీసీ-2 బ్యాలెట్‌ బాక్సులో 150 ఓట్లు తడిచిపోయి ముద్దయ్యాయి. దీంతో వీటిని ఆరబెట్టి లెక్కించారు. అలాగే తాడేపల్లి ఎంపీటీసీ స్థానం పరిధిలో 296, సున్నంపడు ఎంపీటీసీ స్థానం పరిధిలో 350 ఓట్లు తడిచిపోయాయి. చాలాచోట్ల ఓట్లలెక్కింపు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక ఎన్నికల సిబ్బంది ఇబ్బందిపడ్డారు.