ముంపులోనే...

ABN , First Publish Date - 2021-09-29T06:10:20+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ బలహీనపడి కోస్తాకు దూరంగా వెళ్లిపోయినా జిల్లాను వర్షాలు వదలడం లేదు.

ముంపులోనే...
పాడేరు ఘాట్‌రోడ్డుపైకి జారిన బండరాళ్లు

నీటిలోనే పంట పొలాలు

ఆందోళన చెందుతున్న రైతులు

మరోవైపు కొనసాగుతున్న వర్షాలు

ఎలమంచిలిలో 194 మి.మీ.లు నమోదు

ఏజెన్సీలో పొంగుతున్న గెడ్డలు, వాగులు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఘాట్‌ రోడ్డుపైకి కొండ చరియలు

కేకేలైన్‌లో ట్రాక్‌పైకి మట్టి 

శిథిలావస్థలో ఉన్న భవనాలకు ముంపు


విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

గులాబ్‌ తుఫాన్‌ బలహీనపడి కోస్తాకు దూరంగా వెళ్లిపోయినా జిల్లాను వర్షాలు వదలడం లేదు. దీంతో పంట పొలాలు, పల్లపు ప్రాంతాలు  ముంపు నుంచి బయటపడడం లేదు. సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు నగరంతో పాటు రూరల్‌లోని అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. ఎలమంచిలిలో అత్యధికంగా 194 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. 


ముంపులో పంట పొలాలు

వర్షాలు కొనసాగడంతో పంట పొలాలు నీటిలోనే ఉండిపోయాయి. చోడవరం మండలం కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం, లక్ష్మీపురం, అంకుపాలెం, శ్రీరాంపట్నం, పీఎస్‌ పేట, గౌరీపట్నం, ఖండేపలి,్ల సింహాద్రిపురం తదితర ప్రాంతాల్లో వరి, చెరకు నీట మునిగాయి. శారదా, పెద్దేరు నదుల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పంట పొలాల్లో నీరు బయటకు పోయేదారి లేకుండాపోయింది. దీంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రాంబిల్లి మండలం రాజుకోడూరు, పంచదార్ల, వెల్చూరు, కొత్తూరు, నారాయణపురం, గోకివాడ, మూలజంప, దిమిలి, కట్టుబోలు, మురకాడ, మర్రిపాలెం, రజాల మర్రిపాలెం తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. వ్యవసాయ జేడీ లీలావతి, ఇతర అధికారులు మండలంలో ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ, నాలుగు రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, నీరు తగ్గిన వెంటనే ఎకరాకు 20 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్‌ ఎరువులు వేయాలని సూచించారు. మునగపాక మండలం మునగపాక, వాడ్రాపల్లి, టి.సిరసపల్లి, తోటాడ, యాదగిరిపాలెం, చూచుకొండ, గణపర్తి, మడకపాలెం తదితర గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కాగా మండలంలోని గణపర్తి వద్ద శారదా నది గట్టు కోతకు గురైంది. పల్లపు ఆనందపురంలో మంగళవారం గోడ కూలి కర్రి జోగులమ్మ (65) మృతిచెందింది. అచ్యుతాపురం మండలం హరిపాలెం, తిమ్మరాజుపేట, పెదపాడు, ఖాజీపాలెం, పెదపాడు, ఎర్రవరం, మల్లవరం, ఎంజేపురం గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఎలమంచిలి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో 5,767 ఎకరాల్లో వరి పంట, 210 ఎకరాల్లో చెరకు తోటలు ముంపుకు గురైనట్టు ఏడీ మాణిక్యాంబిక తెలిపారు.


అనకాపల్లి మండలం ఆవ ఖండం, శంకరం, బట్లపూడి, మార్టూరు, బవులవాడ, మాకవరం తదితర గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కశింకోట మండలం ఏనుగుతుని, నూతనగుంటపాలెం, తాళ్లపాలెం, గొబ్బూరు, సోమవరం, కశింకోట, వెదురుపర్తి, బుచ్చెయ్యపేట, కొత్తపల్లి, జమాదులపాలెం తదితర గ్రామాల్లో 812 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని తహసీల్దార్‌ బి.సుధాకర్‌, వ్యవసాయాధికారి కె.అరుణ్‌కుమార్‌ తెలిపారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2510.33 హెక్టార్లలో పంటలు నీటమునిగాయని ఆర్డ్డీవో జె.సీతారామారావు తెలిపారు. వీటిలో వరి 2460.33 హెక్టార్లు, చెరకు 50 హెక్లార్లు వున్నాయన్నారు. 


పాయకరావుపేట మండలం గుంటపల్లి, గోపాలపట్నం, నామవరం గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖాధికారి సౌజన్య తెలిపారు. ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరు, వాకపాడు, పెనుగొల్లు, వెంకటాపురం, జేవీపాలెం, తదితర గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారం, పోతనపూడి అగ్రహారం, జంపెన, వీరనారాయణం గ్రామాల్లో వరి, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. నర్సీపట్నం వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 1,813 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయని, 35 ఎకరాల్లో చెరకు తోటలు నేలవాలాయని ఏడీ వంగపండు మోహనరావు తెలిపారు. చీడికాడ మండలంలో తునివలస, దండిసురవరం, చీడికాడ గ్రామాల్లో వరి పంట నీటమునగ్గా, చెరకు తోటలు నేలవాలాయి. 


ఉధృతంగా వాగులు

ఏజెన్సీలోని పలు మండలాల్లో గెడ్డలు, వాగులు మంగళవారం కూడా ఉధృతంగా ప్రవహించాయి. పాడేరు మండలంలో మత్స్యగెడ్డ, హుకుంపేట మండలంలో రాళ్లగెడ్డ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మత్స్యగెడ్డ పాయల్లో వరద ఉధృతి కొనసాగింది. ముంచంగిపుట్టు మండలంలో మారుమూల బుంగాపుట్టు, బూసిపుట్టు, రంగబయలు, లక్ష్మీపురం పంచాయతీల పరిధిలోని గెడ్డలు, వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలకు అవతల వున్న గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. డుంబ్రిగుడ మండలంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన చాపరాయి జలపాతం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సందర్శకులను అనుమతించడం లేదు. సాయుధ పోలీసులతో పహారా ఏర్పాటుచేశారు. 


కోతకు గురైన ధారాలమ్మ ఘాట్‌ రోడ్డు

భారీవర్షాలతో జీకే వీధి మండలంలోని ధారాలమ్మ ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఆర్‌వీ నగర్‌ నుంచి సీలేరు వరకు 52 కిలోమీటర్ల రహదారి పదేళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోకపోవడంతో అధ్వానంగా తయారైంది. తుఫాన్‌ కారణంగా భారీవర్షాలు కురుస్తుండడంతో రహదారి మరింత ఛిద్రమైంది. 


కూలిన పాఠశాల భవనం

పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది. అప్పటికి పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలోని ఇరడాపల్లి, గుత్తులపుట్టు, రాయిగెడ్డ, గురుపల్లికాలనీ, తదితర ప్రాంతాల్లో గెడ్డలు, వాగులు మంగళవారం కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


కూలిన ఇళ్లు

తుఫాన్‌, భారీ వర్షాల కారణంగా పాడేరు మండలంలో 16 ఇళ్లకు నష్టం వాటిల్లినట్టు తహసీల్దార్‌ వి.ప్రకాశరావు తెలిపారు. కొయ్యూరు మండలంలో ఏడు పూరిళ్లు పూర్తిగా,  మూడిళ్లు పాక్షకంగా దెబ్బతిన్నట్టు తహసీల్దారు తిరుమలరావు తెలిపారు.


గులాబ్‌ నష్టంపై ప్రాథమిక అంచనా

ప్రభావిత మండలాలు           30

ప్రభావిత గ్రామాలు 244

ప్రభావిత ప్రజలు 28,636 మంది

పునరావాస కేంద్రాలు 28

పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు 2,160

మృతుల సంఖ్య 2

పంట నష్టం          8,250 హెక్టార్లు

మరణించిన పశువులు 4

దెబ్బతిన్న ఇళ్లు 135

గల్లంతైన వారి సంఖ్య 1

దెబ్బతిన్న రహదారులు 355.125 కి.మీ.

పడిపోయిన చెట్లు 21

దెబ్బతిన్న నీటి సరఫరా పైప్‌లైన్‌ 1.385 కి.మీ.లు

దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు 198

దెబ్బతిన్న స్కూలు భవనాలు 2

దెబ్బతిన్న బోట్లు, వలలు 2


ఘాట్‌ రోడ్లపై కొండచరియలు

పాడేరు ఘాట్‌ రోడ్డులో వ్యూపాయింట్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం కొండ చరియ విరిగిపడగా, ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించారు. సాయంత్రం మరోసారి భారీగా కొండచరియ విరిగిపడడంతో రోడ్డు మొత్తం మూసుకుపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారులు దగ్గరుండి కొండచరియలను తొలగిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు-గసభా రహదారిలో కొండచరియ విరిగి పడింది.



Updated Date - 2021-09-29T06:10:20+05:30 IST