మోపాడు రిజర్యాయర్‌కు లీకేజీలు

ABN , First Publish Date - 2021-12-02T01:09:45+05:30 IST

ప్రకాశం జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయరైన మోపాడుకు ప్రమాదం పొంచి ఉంది. గత రెండురోజుల నుంచి కురిసిన భారీవర్షాలతో వరద పోటెత్తడంతో

మోపాడు రిజర్యాయర్‌కు లీకేజీలు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయరైన మోపాడుకు ప్రమాదం పొంచి ఉంది. గత రెండురోజుల నుంచి కురిసిన భారీవర్షాలతో వరద పోటెత్తడంతో పుష్కలంగా నీరు చేరింది. దాంతో అలుగు ఉధృతంగా పారుతోంది. అలాగే రిజర్వాయర్‌ కట్టకు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీల ద్వారా నీరు బయటకు పోతుండటంతో కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దాంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టినా నీరు ఆగడం లేదు. మోపాడు, ఎల్‌ఎన్‌పురం, పుట్టంనాయుడుపల్లి, మోపాడు కొండారెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలతో పాటు ప్రధాన కాలువ వెంబడి ఉన్న పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. దాంతో వణికిపోయిన ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని కట్టుబట్టలతో మోపాడు బంగ్లా, లక్ష్మీనరసాపురం జడ్పీహైస్కూల్‌ల్లో తలదాచుకుంటున్నారు. అయితే బాధితులకు కనీస అవసరాలు సమకూర్చే విషయంలోనూ అఽధికారులు విఫలం చెందారు. దీంతో విషయం తెలిసి దాతలు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వాయర్‌ కట్టకు ఆరు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలను అరికట్టేందుకు ఉదయం నుంచి ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంగా సహాయక చర్యలు చేపట్టినా సమస్య కొలిక్కి రాలేదు. చెరువు లోతట్టు ప్రాంతంలో వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.



Updated Date - 2021-12-02T01:09:45+05:30 IST