అందని నీరు.. ఎండుతున్న పైరు

ABN , First Publish Date - 2021-08-09T14:24:06+05:30 IST

ఖరీఫ్‌సీజన్‌లో..

అందని నీరు.. ఎండుతున్న పైరు

రైతు సమస్యలపై స్పందించాలి..

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ 


బాపట్ల: ఖరీఫ్‌సీజన్‌లో వెదసాగు చేస్తున్న పొలాల్లో పైరు ఎండిపోతున్నదని తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఆదివారం ఆయన పార్టీశ్రేణులతో కలిసి అప్పికట్ల, భర్తిపూడి, గుడిపూడిగ్రామాలలో వెదపైర్లను పరిశీలించారు. రైతులను సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో నీరు వస్తుందని పొలాలలో వెదపెడితే మాకు వ్యధ మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నరేంద్రవర్మ మాట్లాడుతూ ప్రకాశంబ్యారేజి నుంచి వేలక్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్న ప్రభుత్వం రైతులకు నీరందించటంలో తీవ్ర విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అన్నంపెట్టే రైతు ఆందోళనలలో ఉన్నార న్నారు. రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పంటకాల్వలు, డ్రైనేజిల మరమ్మత్తులు చేయటంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కాల్వల ద్వారా వస్తున్న నీరు చివరి పొలాల కు అందే పరిస్థితి లేదన్నారు. ప్రతిగ్రామంలో రైతులకు భరోసాగా పెట్టిన రైతుభరోసా కేంద్రాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత ఖరీఫ్‌లో నివర్‌తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతుల కు ఇప్పుడు మరలా కష్టాలు, నష్టాలు రావటం దారుణమన్నారు. పాలకుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రైతుసమస్యను పరిష్కరించాలన్నారు. లేకుంటే రైతు ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, భర్తిపూడి సర్పంచ్‌ ఆచంట అమరేష్‌, గుడిపూడి గ్రామసర్పంచ్‌ హానుమా, మాజీ సర్పంచ్‌ నాగరాజు, నువ్వుల శివప్రసాద్‌, కుర్రా ప్రభాకరరావు, ఇనగంటి శ్రీను, కుర్రా సాయిబాబు, నాగయ్య, గంగరాజు, సోమయ్య, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-09T14:24:06+05:30 IST