తాగునీటి కోసం ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-09-16T03:52:10+05:30 IST

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కూతవేటు దూరంలోని గండిపాళెం జలాశయం ప్రాంగణంలో రూ.కోట్లు వెచ్చించి రక్షిత మంచినీటి పథకం నిర్మించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.

తాగునీటి కోసం ఇక్కట్లు
పెద్దిరెడ్డిపల్లిలో అలంకారప్రాయంగా వాటర్‌ ట్యాంకు

వరికుంటపాడు, సెప్టెంబరు 15: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కూతవేటు దూరంలోని గండిపాళెం జలాశయం ప్రాంగణంలో రూ.కోట్లు వెచ్చించి రక్షిత మంచినీటి పథకం నిర్మించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ప్రధానంగా ప్లోరిన్‌ ప్రభావిత గ్రామాలకు పఽథకం కింద సరఫరా కావాల్సిన సురక్షిత తాగునీరు అందని ద్రాక్షగానే మారింది. తోటలచెరువుపల్లి, పెద్దిరెడ్డిపల్లి, వెంగళరావునగర్‌ తదితర గ్రామాలకు సుమారు ఐదారు నెలలుగా ఆ నీరు సరఫరా కావడం తేదంటే పరిస్థితి  ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతుంది. దీంతో గ్రామాల్లో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు సైతం చుక్కనీరు లేక అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్వాహకులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమిలేక కిలోమీటర్ల కొద్ది వాటర్‌ప్లాంట్ల వద్దకు పరుగులు తీసి తాగునీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. అవకాశం లేని ప్రజలు ఫ్లోరిన్‌ నీటినే తాగి రోగాలపాలు కావల్సి వస్తుందని బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృిష్టి సారించి సురక్షిత తాగునీటిని గ్రామాలకు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-09-16T03:52:10+05:30 IST