గుక్కెడు మంచినీటి కోసం

ABN , First Publish Date - 2020-12-04T05:47:50+05:30 IST

నివర్‌ తుఫాను కనీవిని ఎరుగని నష్టం మిగిల్చిం ది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

గుక్కెడు మంచినీటి కోసం
రాజంపేట పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న బురదనీరు

చెయ్యేరులో కొట్టుకుపోయిన ఫిల్టర్‌ పాయింట్లు 

తల్లడిల్లుతున్న నదీ పరివాహక గ్రామాలు 

రాజంపేట, డిసెంబరు 3: నివర్‌ తుఫాను కనీవిని ఎరుగని నష్టం మిగిల్చిం ది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు ఇల్లు చేరకుండానే కళ్లముందే నీటిపాలయ్యాయి. నదులు, ప్రాజెక్టులు, చెరువులకు భారీగా వరద నీరు చేరడంతో ఫిల్టర్‌ పాయింట్లు, మోటార్లు, రక్షి త మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దీంతో అనేక నదీ పరివాహక గ్రామాలు తాగునీటికి తల్లడిల్లిపోతున్నాయి. నదిలో కావాల్సినంత వరదనీరు వెళుతున్నా తాగలేని పరిస్థితి. ఊరంతా చుట్టా లే, కానీ.. అన్న చందంగా చుట్టూ నీరున్నా తాగడానికి గుక్కెడు నీరు దొరకడం లేదు. అరకొర ట్యాంకర్ల ద్వారా తెచ్చే నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. 


పట్టణ కుళాయిల్లో బురదనీరు 

60వేల జనాభా ఉన్న రాజంపేట పట్టణంలోని అన్ని కుళాయిల్లో వర్షం వచ్చినప్పటి నుంచి బురదనీరు రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలో అన్నమయ్య బృహత్తర మంచినీటి పథకానికి ప్రత్యామ్నాయంగా సుమారు 40ప్రత్యేక మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్ల నీటిని ప్రస్తుత సమయంలో సరఫరా చేయకుండా బురదనీటిని సరఫరా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో సుమారు 10వేల పైబడి కుళాయిలకు బురదనీరు సరఫరా చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గుక్కెడు మంచినీటికి..

నదిలోని మోటార్లు, రక్షిత మంచినీటి పథకాలు, ఫిల్టర్‌ పాయింట్లు వరదపాలయ్యాయి. దీంతో రాజంపేట మండలంలోని మందపల్లె, మందపల్లె దళితవాడ, వడ్డిపల్లె, పులపత్తూరు, శేషమాంబపురం, రోళ్లమడుగు, పెద్దూరు, తొగురుపేట,  బాలరాజుపల్లె, నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె, అరవపల్లె, తోటపాలెం, పెనగలూరు మండలంలోని ఓబిలి, సిద్దవరం తదితర గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. ఆయా గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీరు సరిపడటం లేదు. అధికారులు స్పందించి నదీ పరివాహక గ్రామాలకు మంచినీటి పథకాలను వెంటనే పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. 


వరద ఉధృతి తగ్గిన వెంటనే..

- వీరన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ 

నదీ పరివాహక గ్రామాలలో పాడైన నీటి పథకాలను వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరిస్తాం. ఈలోపు ఆయా గ్రామాల్లో ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. 

Updated Date - 2020-12-04T05:47:50+05:30 IST