నీరు లేకుండా రబీ సాగెలా!

ABN , First Publish Date - 2021-01-19T07:07:53+05:30 IST

‘పంట కాలువల్లో చుక్కనీరు లేదు... వేసిన నారుమడులు పాడైపోయే పరిస్థితి... దుక్కిదున్నినా నీరులేక నాట్లు వేయలేకపోతున్నాం’ అంటూ చిందాడగరువు, రోళ్లపాలెం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నీరు లేకుండా రబీ సాగెలా!
రోళ్లపాలెంలో రైతుల సమస్యలు వింటున్న వ్యవసాయాధికారి ధర్మప్రసాద్‌

వ్యవసాయాధికారి ఎదుట చిందాడగరువు, రోళ్లపాలెం పరిసర ప్రాంతాల రైతుల ఆవేదన - ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

అమలాపురం రూరల్‌, జనవరి 18: ‘పంట కాలువల్లో చుక్కనీరు లేదు... వేసిన నారుమడులు పాడైపోయే పరిస్థితి... దుక్కిదున్నినా నీరులేక నాట్లు వేయలేకపోతున్నాం’ అంటూ చిందాడగరువు, రోళ్లపాలెం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘నారున్నా.. నీరేదీ’ శీర్షికన ప్రచురితమైన కఽథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. అమలాపురం మండల వ్యవసాయాధికారి కడలి ధర్మప్రసాద్‌ తన సిబ్బందితో ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను స్వయంగా గుర్తించారు. చిందాడగరువు పంట కాలువల్లోను, బోదెల్లోను చుక్కనీరు లేకపోవడాన్ని రైతులు అధికారులకు చూపించి నీరు లేకుండా సాగుచేసేదెలా అని ప్రశ్నించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారుల మధ్య సమన్వయలోపంతోనే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు పేర్కొన్నారు. రోళ్లపాలెంలో నీరందక పంట పొలాలు కనీసం దుక్కి దున్నని పరిస్థితి ఏర్పడింది.  20-25 రోజుల్లోపు పెరిగిన నారును నాటాల్సి వేయాల్సి            ఉండగా ఇప్పటికే 35 రోజులుగా ఉన్న నారు పాడైపోయే  పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, అయినా నీరులేక నాట్లు వేయలేని పరిస్థితిని వ్యవసాయాధికారికి వివరించారు. మరో వారం లోగా నాట్లు వేయకపోతే నర్సరీలన్నీ పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని రైతులు వేడుకున్నారు. నీటి సంఘాలను రద్దు చేయడం వల్ల పంట కాలువల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని, కనీసం పూడికతీత కూడా లేకుండా పోయిందని తెలుగు రైతు అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మి ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రబీకి ఇంతవరకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి  తలెత్తిందని, క్రాస్‌బండ్‌లు ఎప్పుడు ఏర్పాటుచేస్తారో తెలియడం లేదన్నారు. వ్యవసాయాధికారి వెంట రైతులు రంకిరెడ్డి సూర్యనారాయణ, పిల్లా బాబులు, తిరుమనాథం మురళి, గుమ్మళ్ల అబ్బులు, దాసం సురేష్‌, రంకిరెడ్డి బుజ్జి తదితరులు వున్నారు.


Updated Date - 2021-01-19T07:07:53+05:30 IST