సాగు నీరు సక్రమంగా ఇవ్వండి

ABN , First Publish Date - 2021-03-04T05:17:50+05:30 IST

సాగునీరు సక్రమంగా అందించాలని వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగంను రైతులు కోరారు.

సాగు నీరు సక్రమంగా ఇవ్వండి
పాతవయ్యేరుపై రైతు సమస్యలు నమోదు చేసుకుంటున్న గౌసియా బేగం

వ్యవసాయ శాఖ జేడీకి రైతుల మొర


కళింగపాలెం (ఆకివీడు రూరల్‌) మార్చి 3: సాగునీరు సక్రమంగా అందించాలని వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగంను రైతులు కోరారు. మండలంలోని కళింగపాలెం రైతుల సాగునీటి సమస్యలు తెలుసుకున్నారు. కాలువ శివారు ప్రాంతం కావడం, వరద ముంపు ఆలస్యంగా తగ్గడం, ఆక్వా చెరువుల నీటి చౌర్యం, కాలువలలో తూడు, నీటిపారుదల శాఖాధికారులు నిర్లక్ష్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాకు తాగునీరు పేరుతో వంతు సమయంలోనే నీటిని తోడేస్తున్నారని రైతులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. మండలంలో నాట్లు ఆలస్యంగా వేశారని, ఏప్రిల్‌ రెండోవారం వరకు సాగు నీరు పంపిణీ చెయ్యాలని రైతులు కోరారు. వంతు సమయంలో ఇబ్బందులను ఇరిగేషన్‌ ఎస్‌ఈకి ఆమె ఫోన్‌లో వివరించారు. ఏడీఏ అనిల్‌కుమారి, ఏవో ప్రియాంక, వీఏవో చందూ, రైతులు మూల చిట్టిబాబు, జానుపాముల వెంకటేశ్వరరావు, నున్న గణపతి, తదితరులు పాల్గొన్నారు.


ఒక్క ఎకరానికి కూడా నీటి సమస్య రానివ్వం

ఉండి : ఒక్క ఎకరానికి కూడా నీటి సమస్య రాకుండా చర్యలు తీసు కుంటామని జేడీఏ గౌసియా బేగం అన్నారు. చెరుకువాడలోని నీటి ఎద్దడి ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. సర్పంచ్‌ కొండవీటి శివయ్య మా ట్లాడుతూ తమ ప్రాంతం పంట కాలువకు శివారు కావడంతో వంతులలో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.  రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని జేడీ తెలిపారు. ఎన్‌ ఆర్‌పిఅగ్రహారం రైతుభరోసా కేంద్రం వద్ద సమగ్ర సస్యరక్షణ, నీటి యాజ మన్యంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఏవో బి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.


ఉండి పంట కాలువకు వంతు

ఉండి సబ్‌ డివిజన్‌లో ఎక్కడ సాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నామని ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండి, ఆకివీడు అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉండి పంట కాలువకు వంతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడీఏ అనిల్‌ కుమా రి, ఇరిగేషన్‌ ఏఈలు రాము, పెద్దిరాజు, ఫణిశంకర్‌, ఖాదరవలి, ఉండి, కాళ్ల, ఆకివీడు ఏవోలు సంధ్య, జయవాసుకి, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T05:17:50+05:30 IST