ఆదోనికి నీటి గండం

ABN , First Publish Date - 2021-08-03T05:50:13+05:30 IST

పట్టణానికి రక్షిత మంచినీటి సరఫరా చేసే..

ఆదోనికి నీటి గండం
ఒట్టిపోయిన ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

దెబ్బతిన్న ఎస్‌ఎస్‌ ట్యాంకు కట్ట

మరమ్మతు చేసిన మూడు నెలలకే..!

పనుల్లో నాణ్యతపై అనుమానాలు


ఆదోని(కర్నూలు): పట్టణానికి రక్షిత మంచినీటి సరఫరా చేసే బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ సైడ్‌వాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ స్లాబ్‌లు కుంగిపోయాయి. మట్టి వదులుగా మారి సీసీ స్లాబ్‌లు విరిగిపోతున్నాయి. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి 2003-04లో టీడీపీ ప్రభుత్వం రూ.48 కోట్లు మంజూరు చేసింది. తుంగభద్ర దిగువ కాలువకి అనుసంధానంగా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం బసాపురం వద్ద 250 ఎకరాల భూమిని సేకరించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పనులను చేపట్టింది. ఎల్‌అండ్‌టీ సంస్థ కాంట్రాక్ట్‌ దక్కించుకుని, రత్నం కన్‌స్ట్రక్షన్‌కు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ ఫిల్టర్‌ బెడ్స్‌, పైపు లైన్లు, ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులను రత్నం కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేసింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కానీ 13 ఏళ్ల క్రితం నిర్మించిన ఆదోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ అప్పుడే దెబ్బతింది. ఆనకట్ట పొడవునా నెర్రలిచ్చింది. ఫిల్టర్‌బెడ్స్‌ వైపు ఎటుచూసినా సిమెంట్‌ కాంక్రీట్‌ స్లాబ్‌లు కుంగి పగిలిపోతున్నాయి. కట్టకు మూడు వైపులా ఇదే పరిస్థితి ఉంది. 


డిజైన్‌ మార్పు వల్లేనా..? 

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు సీసీ లైనింగ్‌తో పోలిస్తే రాతి పరుపు ఎక్కువ భద్రత ఇస్తుందని నిపుణులు అంటున్నారు. ఆదోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో రాతి పరుపు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రతిపాదనల్లో ఉంది. కానీ రాళ్లు దొరకవని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని అప్పటి ఇంజనీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సీసీ లైనింగ్‌ చేపట్టారు. ఇది సరైంది కాదని నిపుణులే అంటున్నారు. రాతి పరుపు ఏర్పాటు చేసివుంటే ఒకటి రెండు రాళ్లు జారి పోయినా వెంటనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని, సీసీ లైనింగ్‌ కూలిపోతే సరిచేసేందుకు ఎంతో కష్టపడాలని అంటున్నారు. రాళ్ల మధ్య ఉండే నల్లమట్టికి నీరు తాకి, కట్ట బలంగా ఉండేదని, సీసీ లైనింగ్‌ చేయడం వల్ల నల్లమట్టికి నీరు తగలక లూజుగా మారి లైనింగ్‌ కూలి పోతోందని ఇంజనీర్లు అంటున్నారు. 


నిర్వహణ లోపం

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి. ఆనకట్ట పొడవునా నెర్రలు ఇచ్చిన వెంటనే గుర్తించి సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టాలి. సీసీ స్లాబ్‌లకు చిన్నపాటి పగుళ్లిచ్చిన వెంటనే గుర్తించి సరి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ మరమ్మతుల కోసం అందులో ఉన్న నీటిని బయటికి వదిలారు. 


కొట్టుకుపోయిన రూ.కోట్లు

కుంగిపోయిన స్లాబ్‌ మరమ్మతుల కోసం రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో కడప జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా రెండు నెలల్లోనే పూర్తి చేశారు. మరమ్మతులు చేసి మూడు నెలలు గడవక ముందే మరోసారి పగుళ్లు ఇచ్చాయి. రూ.1.50 కోట్ల నిధులు నీటిపాలయ్యాయి. కాంట్రాక్టర్‌కు ఇంకా బిల్లులు చెల్లించలేదని, అదే కాంట్రాక్టర్‌తో మరోసారి పనులు చేస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పుడు పనులు చేపట్టినా, పూర్తికావాలంటే దాదాపు ఆరు నెలలు సమయం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉన్న ఆదోని పట్టణ జనాభాకు తాగునీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 


నాటి ఎమ్మెల్యే ముందు చూపు

టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తవచ్చని ముందుగానే గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను మంజూరు చేయించారు. బసాపురం, పర్వతాపురం గ్రామాల రైతులతో మాట్లాడి 250 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో 3,110 మిలియన్‌ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంకును నిర్మించారు. ఇందులోకి ఎల్లెల్సీ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. పూర్తి స్థాయిలో నీరు చేరితో అలల తాకిడికి ఆనకట్ట నిలబడే పరిస్థితి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా వేసవిలో ఆనకట్ట నిర్వహణ పనులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. 


నీటి కోసం ఇక్కట్లు

పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడింది. పలు కాలనీలకు పదిహేను రోజులుగా నీరు సరఫరా చేయడం లేదు. కేవీబీఆర్‌ నగర్‌లో కౌన్సిలర్‌ ఇంటికి వెళ్లి స్థానికులు నిలదీశారు. కౌన్సిలర్‌కు ఏం చెప్పాలో తెలియక తన ఇంట్లో ఉన్న నీటిని స్థానికులకు కడవల ద్వారా అందజేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని కౌన్సిలర్‌ సోదరుడు గోవిందు విలేఖరులకు తెలిపారు. 


మరమ్మతులు చేపడతాం

బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ సైడ్‌ కాంక్రీట్‌ వాల్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. మరమ్మతుల కోసం జనరల్‌ ఫండ్‌ కింద రూ.1.50 కోట్లు విడుదల అయ్యాయి. కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌తో పనులు చేయించాం. జనవరిలో పనులు పూర్తి చేసి అప్పజెప్పారు. ఈ లోగా ఆ ట్యాంక్‌లోకి కొంతవరకు నీరు నింపాం. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలోనే మరోసారి పగుళ్లు వచ్చాయి. కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయలేదు. మరోసారి పనులు చేయిస్తాం. ప్రస్తుతం తాగునీటి కొరత లేదు. వేసవిలోపు పూర్తిస్థాయి పనులు చేపించి నీటిని నింపుతాం.

- ఆర్‌జీవీ కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదోని


తాత్కాలిక మరమ్మతులు చేశాం

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశాం. మార్చి నెలలో ఎల్లెల్సీ కెనాల్‌కు నీరు నిలుపుదల చేస్తారన్న ఉద్దేశంతో తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నింపుకున్నాం. కాంట్రాక్టర్‌కు ఎలాంటి బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు పనులు చేయించి బిల్లులు ఇస్తాం. నీటి సమస్య రాకుండా ఏర్పాటు చేస్తున్నాం. నిర్మాణ పనులకు నాలుగు నెలలు పట్టవచ్చు. భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సకాలంలో పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. 

- సత్యనారాయణ, మున్సిపల్‌ ఇంజనీర్‌, ఆదోని

Updated Date - 2021-08-03T05:50:13+05:30 IST