కేంద్ర జాబితాలో జల వనరులు

ABN , First Publish Date - 2020-06-03T09:11:35+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వెనుకటి జలజగడాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. కృష్ణానది బేసిన్ జలాల వినియోగం తన పరిమితులను ఎప్పుడో మించిపోయింది. అయినా ఎప్పుడూ ఎందులోనో తలమునకలై ఉన్నట్టు కనపడాలి కాబట్టి రాజకీయ...

కేంద్ర జాబితాలో జల వనరులు

జలవనరులను ఉమ్మడి జాబితా నుంచి తన అధీనంలోకి తీసుకోవటానికి, ఆ వనరుల నిర్వహణను చేపట్టడానికి ముందు కేంద్ర ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేకుండా నిష్పాక్షికమైన వృత్తి నిపుణులతో ఒక విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జల వివాదాలకు తక్షణ పరిష్కారం కావాలంటే ఇంతకంటే మార్గాంతరం లేదు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వెనుకటి జలజగడాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. కృష్ణానది బేసిన్ జలాల వినియోగం తన పరిమితులను ఎప్పుడో మించిపోయింది. అయినా ఎప్పుడూ ఎందులోనో తలమునకలై ఉన్నట్టు కనపడాలి కాబట్టి రాజకీయ నాయకులు ఈ కలహాలను రేకెత్తిస్తున్నారు. త్వరలోనే ప్రజలనూ ఇందులోకి లాగుతారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు గల ప్రధాన కారణాలలో నదీ జలాలపై గల నిరంతర పేచీలు ఒకటి. అప్పుడు ఒకే రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండిన ఆ సమస్య ఇప్పుడు అంతరాష్ట్ర సమస్యగా మారింది. 


భారతదేశంలోని జలవివాదాలవల్ల కలుగుతున్న ఆర్థిక నష్టాలు అన్నింటిని ఎవరైనా లెక్కవేసినట్లయితే, ఇతరత్రా వివిధ అంతర్గత సమస్యల వల్ల, ఇతర దేశాలతో సంఘర్షణల వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టాలు అన్నింటినీ అది మించిపోతుంది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగి మొదలైన ప్రస్తుత వివాదాన్ని దేశవ్యాప్తంగా జలవనరుల నిర్వహణ నేపథ్యంలో చూడాలి. ప్రస్తుత వివాదం చేయిదాటిపోయినా పోవచ్చు. ఇంతకూ నానాటికీ క్లిష్టమవుతున్న ఈ సమస్య విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం‍ చేస్తున్నది? జల వనరుల విషయమై మొదటినుంచీ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. అందువల్ల తీవ్రమైన హాని జరిగింది. కేంద్ర ప్రభుత్వం ధృఢంగా వ్యవహరిస్తూ సరైన నిర్ణయాలను తీసుకోవాలి. లేనిపక్షంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కేంద్రం ముందుగా కొన్ని మౌలిక విషయాలను గుర్తించాలి. ఈ మౌలిక విషయాలంటున్నవి ఆరు ఉన్నాయి:


1. దేశంలో ఇంకా పంచేందుకు నదీ జలాలు ఏమీ మిగిలి లేవు. ఏదైనా రాష్ట్రానికి కేటాయింపుతోనో, రహస్య పద్ధతులలోనో ఒక్క చుక్క నీరు అదనంగా లభించినా ఇతర రాష్ట్రాలు నష్టపోతాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎవరికీ లాభించేది ఏమీ ఉండదు. ఘర్షణ పడినంత మాత్రాన నదులలో నీటి ప్రవాహం పెరగదు. 2. భారీగా తోడివేస్తూడటం వల్ల భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. నదీ ప్రవాహాలు దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని ఎక్కువ భాగం నదులలో కలిపి లక్షలాది బోరు బావులున్నాయి. దానితో వేసవిలో నదులలో చుక్కనీరు మిగలటం లేదు. వందలాది అడుగులలోతు వరకు ఇదే పరిస్థితి. ఈ స్థితిలో నదీ జలాల పంపకాలకు అర్థం లేకుండాపోతున్నది. ఏ వాటాకు ఎవరూ కట్టు బడి ఉండటం లేదు. అన్ని వివాదాల మధ్య ఇది అసలు సమస్యగా ఉంది. 3. కొత్త పథకాలలో అధికభాగం ఎత్తిపోతలవే. అవి వేలకోట్లు ఖర్చుతో పలు దశలలో సాగుతుంటాయి.


ఖరీదైన ఋణాలతో చేపడతారు. ఈ పథకాలలో వేటికీ రైతులతో సంబంధం ఉండదు. వాటి వెనుక మరేవో ఉద్దేశాలుంటాయి. వ్యవసాయానికి ఒకగూరుతాయని చెప్పే ప్రయోజనాల కన్నా ఆ ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులు ఎక్కువ. జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు లేనందున రాష్ట్రాలు తమ పరిధిలో నీటిని ఎక్కడినుంచి ఎక్కడికి అయినా తరలించుకుపోవచ్చును. కాంట్రాక్టర్లకు, ఇతరకు ఇదంతా ఒక విందు భోజనంగా మారుతున్నది. 4. క్షీణిస్తున్న నదులతో పర్యావరణ నష్టాలు పెరుగుతున్నాయి. వేసవిలో ప్రవాహం అంటూ ఏదైనా ఉంటే అది మురుగు నీటి జలాలే. సంప్రదాయక నదులలో అనేకం సముద్రాన్నే చేరటం లేదు. ఇందువల్ల నదీతీర పర్యావరణాలు, అక్కడ నివసించే జన సమూహాలు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సామాజికమైన నష్టాలు వ్యవసాయిక ఉత్పత్తి లాభాలను మించిపోతున్నాయి. 5. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయం దెబ్బతినటం ఇప్పటికే మొదలైంది. వర్షపాతం తీరు మారు తున్నది. ఒక దశాబ్దకాలాన్నంతా కలిపి లెక్కిస్తే మార్పు ఎక్కువ కనిపించకపోవచ్చు. కాని సంవత్సరాలవారీగా చెప్పుకోదగిన మా ర్పులు ఉంటున్నాయి. నీటి లభ్యతపై ఇది ప్రభావం చూపుతున్నది. ఈ స్థితి వల్ల రాష్ట్రాల మధ్య సమ స్యలు పెరుగుతాయి. 6. దేశంలోని రైతులు, రాజకీయవాదులు, సాధా రణ ప్రజలు కూడా నీళ్లు ఉచితంగా వస్తాయని, కనుక తమకు ఉచితంగా, శాశ్వతంగా ఇవ్వాలని నమ్ముతారు. ఇది కాలం చెల్లిన నమ్మకం. సదుద్దేశాలు గల కొందరు వ్యాఖ్యాతలు కూడా పేదల పేరిట ఇటువంటి డిమాండ్లే చేస్తుంటారు. కాని రైతులు, పేదల ప్రయోజనాలను కాపాడుతూనే నీటికి ఖరీదు కట్టి సరఫరా చేసే పద్ధతులు ప్రపంచంలో కనుగొన్నారు. భారతదేశం ఈ మార్గంలో ఆలోచించటమైనా ఇంకా మొదలుపెట్టలేదు. 


ఇవన్నీ రహస్యాలేమీ కావు. జలవనరుల నిర్వహణ గురించి తెలిసిన నిపుణులందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయాలే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా చేయవలసింది ఏమిటి? 


మొదటి పద్ధతి: జలవనరులను కేంద్ర జాబితాలో చేర్చాలి. ఇది బృహత్తరమైన బాధ్యత. అయితే కేంద్రం ఎటువంటి రాజకీయాలకూ పాల్పడకుండా నిజాయితీగా అమలుపరిస్తేనే ఇది సాధ్యం. ఇందులో భాగంగా నీటి పంపకాలు, ప్రాజెక్టులూ కాల్వల నిర్వహణ, పరిహారాల చెల్లింపులూ మొదలైనవి జరగాలి. ఇందుకు సంబంధించి మంచి నమూనాలు ఉన్నాయి. సరిగా వివరించినట్లయితే అన్నీ కాకపోయినా కనీసం అత్యధిక రాష్ట్రాలు ఇందుకు అంగీకరిస్తాయి. కనుక ఆ మార్పులు తెచ్చి, నిర్వహణలు జరపగల వ్యవస్థలను సృష్టించి, వాటికి స్వయంప్రతిపత్తి కల్పించాలి. టెలికాం అథారిటీ తరహాలో కేంద్ర స్థాయి రెగ్యులేటరీ అథారిటీని సృష్టించి రాజకీయాలకు దూరంగా ఉంచాలి. 


రెండవ పద్ధతి: నీటి పంపకాలకు, నిర్వహణకు కేంద్రీకృత వ్వ్యవస్థను నెలకొల్పటం. రాజ్యాంగ సవరణ చేయకుండా ఇది వీలు కాకపోవచ్చు. ఈ పద్ధతిలో కొన్ని అంశాలు ఇమిడి ఉంటాయి: 1. నీటి వనరులను, భూగర్భ జలాలను ప్రతి రాష్ట్రానికీ స్పష్టమైన రీతిలో కేటాయించాలి. 2. రాష్ట్రాలు ఆ పరిమితికి లోబడితే ప్రోత్సాహకాలు ఇచ్చి, ఉల్లంఘిస్తే ఫైనాన్స్ కమిషన్ సదరు రాష్ట్రాలకు చేసే కేటాయింపులకు కోతల రూపంలో జరిమానా విధించాలి. 3. రాష్ట్రాల వివాదాలను మూడు మాసాలలో పరిష్కరిస్తూ, ఓడినవారిపై చర్యలు తీసుకోవాలి. 4. నీటిని పొదుపు చేసే రాష్ట్రాలకు వనరులు, వ్యవసాయధరలు, కేంద్ర కేటాయింపుల వంటి రూపాలలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 5. ప్రస్తుత పథకాలు సమర్థవంతంగా పని చేసేందుకు వీలుకల్పిస్తూ పదేళ్ల పాటు కొత్త పథకాలపై నిషేధం విధించాలి. 6. నీటి కేటాయింపులను రైతుకు తన పొలంస్థాయిలో చేసి తక్కువ నీరు వాడేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలా కొంతకాలం చేయవచ్చు.


జలవనరులను ఉమ్మడి జాబితా నుంచి తన అధీనంలోకి తీసుకోవటానికి, ఆ వనరుల నిర్వహణను చేపట్టడానికి ముందు కేంద్ర ప్రభుత్వం రాజకీయాలతో సం బంధం లేకుండా నిష్పాక్షికమైన వృత్తి నిపుణులతో ఒక విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశంలో రావణ కాష్టంలా మండుతూనే ఉన్న జల వివాదాలకు తక్షణ పరిష్కారం కావాలంటే ఇంతకంటే మార్గాంతరం లేదు.

డా. బిక్షం గుజ్జా

(జల విధాన నిపుణుడు, స్విట్జర్లండ్‌లోని డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌– ఇంటర్నేషనల్‌లో జల విధాన విభాగం అధిపతిగా పని చేశారు) 

Updated Date - 2020-06-03T09:11:35+05:30 IST