నిబంధనలకు నీళ్లు

ABN , First Publish Date - 2022-09-23T05:04:48+05:30 IST

జిల్లాలో వైద్యం ప్రధాన వ్యాపారంగా మారింది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి.

నిబంధనలకు నీళ్లు

 - ప్రైవేట్‌ ఆసుపత్రుల ఇష్టారాజ్యం 

- సర్టిఫికెట్లు ఉన్నా డాక్టర్లు ఉండరు

- కన్సల్టెంట్లతోనే వైద్యసేవలు 

- రోగుల పరిస్థితి విషమిస్తే చేతులెత్తేయడమే...

- ప్రభుత్వ తాజా ఆదేశాలతో పరిస్థితి మారేనా? 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో వైద్యం ప్రధాన వ్యాపారంగా మారింది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. డాక్టర్లు లేకున్నా సరైన నర్సింగ్‌ సిబ్బంది లేకపోయినా డాక్టర్‌ సర్టిఫికేట్లు మాత్రమే చూపించి ప్రైవేట్‌ ఆసుపత్రులు నిర్వహించేందుకు అనుమతులు పొందుతున్నారని విమర్శలున్నాయి. కనీస వసతులు కూడా లేని ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలకు, పీఎంపీలకు, అంబులెన్సు డ్రైవర్లకు కమీషన్ల ఎరచూపించి పేషెంట్లను రప్పించుకుంటున్నారు. అరకొర వైద్యం చేసి పరిస్థితి విషమించగానే పెద్దాసుపత్రులకు గానీ హైదరాబాద్‌గానీ తీసుకెళ్లాలని చెప్పి చేతులెత్తేస్తున్నట్లు విమర్శలున్నాయి. రోగులు చనిపోయిన సందర్భాల్లో వారి కుటుంబసభ్యులతో చర్చించి ఎంతోకొంత ముట్టజెప్పి కేసులు కాకుండా చూసుకుంటున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులపై పలు ఫిర్యాదులు రావడంతో అనుమతుల్లేని ఆసుపత్రులపై కొరఢా ఝళిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 


 తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు


అనుమతులున్నా నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు సమకూర్చని, వైద్య పరికరాలు సమకూర్చుకోని, శానిటేషన్‌ తదితర నిర్వహణలను సక్రమంగా చేయని ఆసుపత్రులపై కూడా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు జిల్లా వైద్యాధికారులందరికీ సర్క్యులర్‌ జారీ చేస్తూ పది రోజుల్లోగా అన్ని ఆసుపత్రులు, డయోగ్నోస్టిక్స్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులు, డయోగ్నోస్టిక్స్‌ కేంద్రాలు, డాక్టర్లు, వైద్య సిబ్బందిపై క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అందుకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. 


 జిల్లాలో 368 ప్రైవేట్‌ ఆసుపత్రులు


జిల్లాలో 368 ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు, డెంటల్‌ ఆసుపత్రులు ఉన్నాయి. స్కానింగ్‌, పథాలజికల్‌ ల్యాబ్‌లతో కూడిన 39 డయోగ్నోస్టిక్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటన్నింటిని ఆయా సంస్థల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్లు చేసుకొని నిర్వహిస్తున్నారు. మరో 33 ఆసుపత్రుల నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అనుమతులు లేకుండా దరఖాస్తులు మాత్రమే చేసి సుమారు 15 సంస్థలు ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ కోసం అనుమతి పొందాలంటే అందులో ఎంబీబీఎస్‌ చదివిన డాక్టర్‌ ఒకరు ఉండాల్సి ఉంటుంది. సదరు డాక్టర్‌ తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో డాక్టర్‌ వృత్తి నిర్వహించేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకొని సర్టిఫికేట్‌ పొంది ఉండాలి. సర్టిఫికెట్లు మాత్రమే ప్రొడ్యూస్‌చేసి ఆసుపత్రుల నిర్వహణకు అనుమతులు పొందిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఏ డాక్టర్‌ లేకుండానే నర్సింగ్‌ సిబ్బందిని నియమించుకొని పేషెంట్లు చేరిన సందర్భంలో కన్సల్టెంట్లుగా ఉన్న డాక్టర్లను పిలిపించుకొని వైద్య సేవలందిస్తున్నారు. రెసిడెంట్‌ డాక్టర్‌ లేకపోవడంతో పేషెంట్‌కు సీరియస్‌ అయిన సందర్భంలో వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్బున్నవారు బిల్దింగ్‌లు అద్దెకు తీసుకొని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ వైద్య వ్యాపారం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఆసుపత్రుల నిర్వహణ కోసం మున్సిపల్‌ అనుమతులు తీసుకుంటున్నా నిబంధనలకు అనుగుణంగా భవనాలు ఉండడం లేదు. చాలా ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. పార్కింగ్‌, పొల్యుషన్‌ బోర్డు అనుమతులు కూడా పొందడం లేదు. ఆసుపత్రుల్లో ఐసీయూ నిర్వహిస్తే బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసిన సిబ్బంది రోగులను చూసుకోవలసి ఉంటుంది. ఏఎన్‌ఎంలతోనే ఐసీయులను నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో వైద్యసేవలకు చేసే చార్జీలను ప్రదర్శించాల్సి ఉండగా ఆ నిబంధనలను పాటించని సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యసేవలకు తీసుకునే చార్జీల చార్టులను ఏర్పాటు చేసినా బిల్లింగ్‌లో మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండా అధికంగా చార్జీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 30 లేదా అంతకు మించి పడకలతో ఉన్న ఆసుపత్రుల్లో రెండు ఆపరేషన్‌ థియేటర్లు నిర్వహిస్తే నిర్వహకులు ఇన్‌కం టాక్సు వివరాలను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. 


 డయోగ్నోస్టిక్‌ సెంటర్లదీ అదే దారి


డయోగ్నోస్టిక్‌ సెంటర్లలో రేడియాలజీ నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోగనిర్ధారణకు వైద్య పరీక్షలు అవసరమే అయినా దాన్ని ఆసరాగా తీసుకొని చాలా ఆసుపత్రుల్లో అవసరమున్నా లేకున్నా పలురకాల రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తూ డబ్బులు గుంజుతున్నారనే విమర్శలున్నాయి. సొంత ల్యాబ్‌లు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లు, మెడికల్‌ షాపులను ఏర్పాటు చేసుకొని వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. డాక్టర్‌ రాసే మందులు ఆ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపులో మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్‌లో వివిధ కంపెనీలకు ఆర్డర్‌ చేసి కేవలం ఆ మందులు వారి వద్ద మాత్రమే లభ్యమయ్యేలా ఒప్పందం చేసుకొని ఎమ్మార్పీతో విక్రయిస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు కొందరు తామేమి తక్కువ కాదన్నట్లుగా క్లినిక్‌లలో ఎలాంటి అనుమతి లేకుండానే బెడ్స్‌ ఏర్పాటుచేసి వైద్యసేవలందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి ఆసుపత్రులు వైద్యాన్ని వ్యాపారంగా మార్చి సొమ్ముచేసుకుంటున్నా వైద్యఆరోగ్యశాఖ ప్రేక్షక పాత్ర వహిస్తున్నదనే విమర్శలున్నాయి. ఆసుపత్రులపై సరైన నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహిస్తే పరిస్థితి మొరుగుపడే అవకాశముంది. అనుమతులకు దరఖాస్తుచేసుకున్నారా.. లేదా అన్నదానికే ప్రాధాన్యం ఇచ్చి ప్రతి యేటా అనుమతుల పునరుద్ధరణ కోసం డబ్బులు దండుకుంటూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు క్లీన్‌చిట్‌ ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుమతులేని నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కొరఢాఝళిపించాలని నిర్ణయించడంతో ఇప్పుడైనా పరిస్థితి చక్కబడుతుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 


Updated Date - 2022-09-23T05:04:48+05:30 IST