రూ.480 కోట్లతో వాటర్‌గ్రిడ్‌

ABN , First Publish Date - 2020-07-03T10:17:51+05:30 IST

పులివెందుల నియోజకవర్గంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.

రూ.480 కోట్లతో వాటర్‌గ్రిడ్‌

పులివెందులలో ఇంటింటికీ తాగునీరు


(కడప-ఆంధ్రజ్యోతి): పులివెందుల నియోజకవర్గంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరందించాలనే లక్ష్యంతో రూ.480 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్‌ పథకానికి అంకురార్పణ చేయనున్నారు. దీంతో పులివెందుల నియోజకవర్గంలోని పల్లెలు, మున్సిపాలిటీ వాసుల దప్పిక తీరనుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి .835 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు తీసుకుని ప్రతి ఇంటికీ అందించనున్నారు. జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటికే రహదారులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికీ  నీరందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని జిల్లాలో తొలుత పులివెందులలోనే మొదలుపెడుతున్నారు.


పులివెందుల నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. 299 హ్యాబిటేషన్లు ఉండగా 3,80,689 గ్రామీణ జనాభా ఉంది. పులివెందుల మున్సిపాలిటీలో 1,50,461 మంది జనాభా ఉన్నారు. మొత్తం నియోజకవర్గ జనాభా 5,36,150 మంది. పులివెందుల మున్సిపాలిటీతో పాటు అదే మండలంలోని 17 గ్రామాలు, లింగాలలో 27, సింహాద్రిపురం 31, తొండూరు 27, వేముల 32, వేంపల్లె 34, చక్రాయపేటలో 131 ఆవాస ప్రాంతాలకు తాగునీరందించనున్నారు. 255 కి.మీల పైపులైను, 255 కి.మీ మేర గ్రావిటీ ద్వారా నీరందివ్వాలని నిర్ణయించారు.


ప్రతి కుటుంబానితో పాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీ, ఐజీ కార్ల్‌, జేఎన్‌టీయూ విద్యా సంస్థలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనికి అవసరమైన రక్షిత మంచినీటి పథకాలు నిర్మించేలా అంచనాలు తయారు చేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-07-03T10:17:51+05:30 IST