నీరుగారుతున్న చేయూత

ABN , First Publish Date - 2021-01-08T05:18:06+05:30 IST

వైఎస్సార్‌ చేయూత పథకం అమలు నీరు గారుతోంది. ప్రధానంగా ఈ పథకం కింద రెన్యువల్‌ కావాలంటే పట్టణాల్లో కిరాణా సామగ్రి, గ్రామీణ ప్రాంతాల్లో పశువులు కొనుగోలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నీరుగారుతున్న చేయూత
లబ్ధిదారులకు జీవనోపాధులపై అవగాహన కల్పిస్తున్న వెలుగు సిబ్బంది

 రెన్యువల్‌ కావాలంటే కిరాణా షాపు పెట్టాల్సిందే 

 పశువులు కొనుగోలు చేయాల్సిందే

  లేదంటే రెండో విడత రాదని బెదిరింపులు

  ప్రభుత్వ తీరుపై మహిళల ఆగ్రహం


ఇచ్ఛాపురం రూరల్‌

వైఎస్సార్‌ చేయూత పథకం అమలు నీరు గారుతోంది. ప్రధానంగా ఈ పథకం కింద రెన్యువల్‌ కావాలంటే పట్టణాల్లో కిరాణా సామగ్రి, గ్రామీణ ప్రాంతాల్లో పశువులు కొనుగోలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కిరాణా, పశువులు కొనుగోలు చేయకుంటే చేయూత పథకం డబ్బులు రెండోవిడత జమకా బోవని పట్టణాల్లో మెప్మా సిబ్బంది, గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం సిబ్బంది బెదిరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కిరాణా కోసం ఐటీసీ, హెచ్‌యూఎల్‌, పీఅండ్‌జీ కంపెనీలు, పాల వ్యాపారం కోసం అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ నేపథ్యంలో కిరాణా వ్యాపారం చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకున్న వారు ఐటీసీ వద్ద రూ.రెండు వేలు సామగ్రి కొనుగోలుచేయాలని, పశువులు పెంపకానికి దరఖాస్తుల చేసుకున్న వారు ఇతర రాష్ట్రాల్లో ఆవులు, గేదెలు కొనుగోలు చేయాలని ఒత్తిడిచేస్తున్నారు. దీంతో చేయూత లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో వైఎస్సార్‌ చేయూత పథకం కింద 1,84,452 మందికిగాను ఒక్కక్కరికి రూ.18,750 బ్యాంకు ఖాతాలో జమచేశారు. చేయూతకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు కొంతమంది కిరాణా, మరికొందరు పశువుల పెంపకం, మరికొందరు ఇతర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నట్లు నమోదుచేశారు.చేయూత అమలుచేసే సమయంలో ఎటువంటి నిబంధనలు పెట్టకుండా డబ్బులు వేసి రెండోవిడత నిబంధనలు పెట్టడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కిరాణా వ్యాపారం కోసం ఒప్పందం

కిరాణా వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐటీసీ, హెచ్‌యూఎల్‌, పీఅండ్‌జీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కిరాణా వ్యాపారమని చేయూత పథకం కింద లబ్ధిపొందిన వారంతా ఆయా కంపెనీల ఏజెన్సీల్లో రూ.రెండు వేలు విలువ చేసే సామగ్రి కొనుగోలుచేసి బిల్లు ఇస్తేనే రెండోవిడత వైఎస్సార్‌ చేయూత వస్తుందని లేదంటే రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.రెండు వేలు విలువైన సామగ్రి ఎలా కొనుగోలు చేయగలమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సామగ్రి కొనుగోలు నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్రంలో పాల వ్యాపారం కోసం గుజరాత్‌కు చెందిన అమూల్‌ మిల్క్‌ డెయిరీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. చేయూత కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో పశువుల పెంపకంకోసం చేసుకున్న వారంతా ప్రభుత్వం సూచించిన రాష్ట్రాల్లో ఆవులు, గేదెలు కొనుగోలు చేయాలని ఐకేపీ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. దీంతో  మహిళలు గందరగోళానికి గురవుతున్నారు.


బలవంతం లేదు 

వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులు పశువులు కొనుగోలుచేయాలని బలవంతంలేదు. చేయూతకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పశువుల పెంపకంకోసం ఆన్‌లైన్‌ చేసుకున్న వారితో సమావేశాలు నిర్వహిస్తున్నాం. వారికి పశువుల కొనుగోలుపై అవగాహన కల్సిస్తున్నామే తప్ప వాటిని కొనుగోలు చేయకపోతే చేయూత రెన్యూవల్‌ కాదని ఎక్కడా చెప్పలేదు. లబ్ధిదారులకు ఇష్టముంటే పశువులు కొనుగోలు చేయవచ్చు లేదంటే అవసరం లేదు.

-బి.శాంతిశ్రీ, పీడీ, డీఆర్‌డీఏ



Updated Date - 2021-01-08T05:18:06+05:30 IST