ఏకగ్రీవ పంచాయితీల ఆశలపై నీళ్లు చల్లేసిన్రు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-09T00:39:13+05:30 IST

ఏకగ్రీవ పంచాయితీల ఆశలపై నీళ్లు చల్లేసిన్రు: విజయశాంతి

ఏకగ్రీవ పంచాయితీల ఆశలపై నీళ్లు చల్లేసిన్రు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఏకగ్రీవ పంచాయితీ పాలక వర్గాలు ప్రభుత్వ నజరానాపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేసిన్రని.... దీంతో గ్రామాభివృద్ధికి ప్రోత్సాహక నిధులు వస్తాయని ఆశించిన పంచాయతీ పాలక వర్గాలకు నిరాశే మిగిలిందని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో విజయశాంతి పోస్టు యథాతథంగా...


''రాష్ట్ర అభివృద్ధికి పట్టుగొమ్మలు గ్రామాలని, వాటిని అభివృద్ధిలో పథంలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికల్లో చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయే గానీ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన పాపానపోలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ గ్రామపంచాయితీ ఎన్నికలప్పుడు ఏకగీవ్రంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ఒక్కో పంచాయతీకి అదనంగా మరో రూ.5 లక్షలను అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి కేటాయించనున్నట్లు తెలిపింది. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.7లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తే... స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రోత్సాహకాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రోత్సాహకంగా ఇచ్చే నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భావించి, విబేధాలను పక్కన పెట్టి, ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్రు ప్రజలు. ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల తమకు పోటీగా నిలిచిన వారిని పోటీ నుంచి తప్పించేందుకు సర్పంచులు, వార్డు సభ్యులు ఎంతో కొంత ముట్టజెప్పిన్రు. కొన్నిచోట్ల గ్రామాల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వారు విరాళాలు కూడా ఇచ్చిన్రు. ఆ దిశగా అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఏకగ్రీవమయ్యేలా చేసిన్రు. కానీ.. ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే... ఓడ దాటే దాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తరువాత బోడి మల్లన్న అన్నట్లుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా మేము ఏకగ్రీవ పంచాయితీలకు 10 లక్షలు ఇస్తామని ఎక్కడా అనలేదని చెప్పి, ఏకగ్రీవ పంచాయితీ పాలక వర్గాలు ప్రభుత్వ నజరానాపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేసిన్రు. దీంతో గ్రామాభివృద్ధికి ప్రోత్సాహక నిధులు వస్తాయని ఆశించిన పంచాయతీ పాలక వర్గాలకు నిరాశే మిగిల్చింది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో కొంతమంది ఏకగ్రీవ సర్పంచులు సొంత పొలాలు తాకట్టు పెట్టి మరీ ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు నానాతంటాలు పడుతుంటే... కొంతమంది సర్పంచులు ఆత్మాభిమానం చంపుకుని చస్తూ బతుకుతున్న పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. ఇక కేంద్రం నుంచి వస్తున్న నిధులే గ్రామ పంచాయితీలకు దిక్కయ్యాయి తప్ప, రాష్ట్ర సర్కార్ కొత్తగా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ధనిక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుడే కానీ... ధనిక రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు, పాలక వర్గాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పట్టింపులేనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు.'' అని విజయశాంతి వ్యాఖ్యనించారు.



Updated Date - 2021-10-09T00:39:13+05:30 IST