చిరిగిన చీరలు... పాత సంచులు!

ABN , First Publish Date - 2021-09-06T04:00:22+05:30 IST

చిరిగిన చీరలు... పాత సంచులు!

చిరిగిన చీరలు... పాత సంచులు!
పాలకొండ-సీతంపేట రోడ్డులో రోడ్డుకిరువైపులా మొక్కలకు సంచులు కట్టిన దృశ్యం

- నీరుగారుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ లక్ష్యం

- మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం

- ట్రీగార్డులు ఏర్పాటుకు నోచుకోని వైనం

(పాలకొండ/మెళియాపుట్టి/ఆమదాలవలస)

జిల్లాలో జగనన్న పచ్చతోరణం పథకం లక్ష్యం నీరుగారుతోంది. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లకు ఇరువైపులా, కాలువలు, చెరువు గట్లపైన లక్షలాది మొక్కలు నాటేలా చర్యలు చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొక్కల సంరక్షణ అటకెక్కుతోంది.  ఫలితంగా చాలా మొక్కలు ఎండిపోతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలి. వీటికోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలి. కానీ చిరిగిన చీరలు.. పాత గోనె సంచులను చుట్టి ట్రీగార్డుల పేరిట నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రీగార్డులు లేకపోవడం.. సంరక్షణ కరువవడంతో చాలా మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. జిల్లాలో  జగనన్న పచ్చతోరణం పథకం కింద 861 కిలోమీటర్ల మేర సుమారు 3,47,450 మొక్కలు నాటారు. పంచాయతీ, ఆర్‌ఎండ్‌బీ, సీసీ, అంతర్గత రహదా రుల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో గతనెల 15న పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు సుమారు రూ.31.42 కోట్లు వెచ్చించారు. వీటి సంరక్షణ బాధ్యతను ఉపాధిహామీ వేతనదారులకు అప్పగించారు. ఒక వేతనదారుడికి వంద నుంచి 160 మొక్కలను సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంత తవ్వేందుకు ఉపాధిహామీ వేతనదారుడికి రూ.52, మొక్కను నాటి దానికి రక్షణ (గార్డు) ఏర్పాటుకు మరో 15 రూపాయల వంతున చెల్లించారు. నీటి లభ్యతను బట్టి వేతనదారుడు మొక్కకు నీరందిస్తే నెలకు నాలుగు తడుల (పదిలీటర్లు) చొప్పునఅందిస్తే పోషణకు నెలకు రూ.20 చెల్లించాలి. మొత్తంగా ఒక్కో మొక్కకు సంరక్షణ కింద రూ. 140 వరకు అందజేయాలి. వీటి సంరక్షణకు అధికంగా నిధు లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా, ఎక్కడా ట్రీగార్డులు ఏర్పా టుకు నోచుకోలేదు. ఉదాహరణకు బూర్జ మండలం కొండ పేట వద్ద రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు, పాల కొండ-శ్రీకాకుళం రోడ్డులో మొక్కలకు గోనె సంచులు కట్టారు. పాలకొండ-సీతంపేట రోడ్డులో మొక్కలకు కూడా సంచులు చుట్టేశారు. ఆమదాలవలస మండలం చీమల వలస వద్ద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు కూడా ఇదే పరిస్థితి. సోంపేట మండలం పాలవలస- పొత్రకొండ రోడ్డులో నాటిన మొక్కలకు చీరలు చుట్టేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలకు సంచులు, చీరలు చుట్టేసి.. ట్రీ గార్డులు ఏర్పాటు చేశామంటూ నిధులు పక్క దారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సంరక్షణ కరువై.. పలుచోట్ల నాటిన మొక్కలు ఇప్పటికే ఎండిపోయాయి.   ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. గతంలో అటవీశాఖ సామాజిక విభాగం ద్వారా నిధులు వెచ్చించి మొక్కలు పెంచేవారు. ఈ ఏడాది అధికంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలు దిగుమతి చేశారు. ఒక్కో పెద్ద మొక్కను రూ.98కి కొనుగోలు చేశారు. రవాణా సమయంలో రెండు, మూడు రోజులు పడుతోంది. దీంతో నాటక ముందే మొక్కలు ఎండిపోతున్నాయని కొంతమంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు చెబుతున్నారు.


మండలాల వారీ నాటిన మొక్కలు 

ఆమదాలవలస మండలంలో 8,062, బూర్జలో 12,271, పొందూరులో 8,724, సరుబుజ్జిలిలో 13,399, భామినిలో 7,448, ఎచ్చెర్ల లో 11,505, జి.సిగడాంలో 8,981, గారలో 8,747, హిరమండలంలో 8,011, ఇచ్ఛాపురంలో 4,300, జలుమూరులో 4,673, కంచిలిలో 6750 మొక్కలు నాటారు. కవిటిలో 9,510, కోటబొమ్మాళిలో 11,601, కొత్తూరులో 9,086, లావేరులో 8,008, ఎల్‌.ఎన్‌.పేటలో 8,365, మందసలో 5,300, మెళియాపుట్టిలో 11,038, నందిగాంలో 11,719, నరసన్నపేటలో 9,128, పాలకొండలో 11,500, పలాసలో 5,880, పాతపట్నంలో 11,343 మొక్కలు నాటారు. పోలాకిలో 10,470, రాజాంలో 10,333, రణస్థలంలో 9,505, రేగిడిఆమదాలవలసలో 9,786, సంతబొమ్మాళిలో  14,160, సంతకవిటిలో 7,290, సారవకోటలో 10,990, సీతంపేటలో 8,832, సోంపేటలో 4,700, శ్రీకాకుళంలో 10,408, టెక్కలిలో 12,872, వజ్రపుకొత్తూరులో 5,776, వంగరలో 6,501, వీరఘట్టంలో 10,478   మొక్కలు నాటారు.


చీరలు చుడితే బిల్లులు నిలిపివేస్తాం

నాటిన మొక్కలకు అల్లిన వెదురు గూళ్లు ఏర్పాటు చేస్తేనే మొక్కకు రూ.140 బిల్లు చొప్పున ఇస్తాం.  అలాకాకుండా చీరలు కట్టి రక్షణ కల్పిస్తే బిల్లులు నిలిపివేస్తాం. మొక్కల సంరక్షణకు చర్యలు చేపడతాం. 

- టి.రవి, ఏపీవో, మెళియాపుట్టి

 

Updated Date - 2021-09-06T04:00:22+05:30 IST