Abn logo
Oct 27 2021 @ 01:56AM

పరీక్షలపై నీళ్లు

జల పరీక్షలకు రాంరాం  

ప్రమాదంలో ప్రజారోగ్యం 

సబ్‌ డివిజన్‌లలో 11 ల్యాబ్‌లు

సిబ్బందికి ఎనిమిది నెలలుగా  నిలిచిన జీతాల చెల్లింపు 

విధులను బహిష్కరించిన ఉద్యోగులు

వీరికి వేతనాలు  ఇచ్చేది కేంద్రమే

ఆ నిధులు సైతం దారిమళ్లింపు

నిధులు ఏవైనా దారి మళ్లించడమే... ఆఖరికి అవి కీలకమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి అయినా సరే. సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఉండవు. వారి హాహాకారాలు పట్టవు. మేము తాగేనీరు శుద్ధమైనవో, కావో పరీక్షించండి మహాప్రభో.. అని గ్రామీణుల వేడుకోళ్లు కూడా వినపడవు. ‘కన్నతల్లికి బువ్వపెట్టనోడు పినతల్లికి బంగారుగాజులు చేయిస్తా’ అని చెప్పినట్లు ఉన్న నీటి పరీక్ష కేంద్రాలను ఏలిన వారు నిర్లక్ష్యంతో పడకేయించారు.  పంచాయతీకి ఒక నీటి పరీక్ష కిట్టు ఇచ్చి అక్కడే నిర్వహించాలంటూ హడావుడి చేస్తున్నారు. సర్కారు తీరుతో నీటి పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా మారిపోయాయి. కీలకమైన సమయంలో పరీక్షలు కరువై జనం రోగాల బారిన పడుతున్నారు.

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 26: వ్యాధుల కాలంలో కీలకమైన నీటి పరీక్షల కేంద్రాలు పడకేశాయి. కాదుకాదు.. ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వాటిని పట్టించుకోవడం మానేసింది. జిల్లావ్యాప్తంగా ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బంది నెలల తరబడి జీతాలు లేక అష్టకష్టాలు పడుతూ మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు తమకు జీతాలివ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్పిన వారు.. ప్రస్తుతం కార్యాచరణలోకి దిగిపోయారు. గత రెండురోజులుగా కార్యాలయాలకు హాజరవుతున్నప్పటికీ విధులను బహిష్కరిస్తున్నారు. ఇక నీటి పరీక్షలు మృగ్యమై కలుషిత జలం తాగి గ్రామీణులు ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. ఇదీ పల్లె ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం వారికి ఉన్న శ్రద్ధ. 


జిల్లావ్యాప్తంగా 11 నీటి పరీక్ష కేంద్రాలు

ఒంగోలు, పొదిలి డివిజన్‌లలో ఉన్న ల్యాబ్‌లతోపాటు సబ్‌ డివిజన్‌ల వారీగా 11 నీటిపరీక్ష కేంద్రాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాబ్‌ల పరిధిలోని గ్రామాల్లో నీటి నమూనాలు సేకరించి విధిగా నెలకు 250 పరీక్షలను ఒక్కోచోట చేయాల్సి ఉంటుంది. ఏ తేదీన ఏగ్రామంలో డ్రైవ్‌ నిర్వహించారో రికార్డుల్లో సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యారోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్న గ్రామాల్లో ఎక్కువ నమూనాలు సేకరించి నీటి పరీక్షలను చేయాలి. ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పడకేసింది.


జిల్లాలో 2,876 మంచినీటి పథకాలు

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రజానీకం మంచినీటి అవసరాలు తీర్చడానికి 2,876 రక్షిత పథకాలు ఉన్నాయి. అందులో పీడబ్ల్యూఎస్‌ కింద 1,008, ఎంపీడబ్ల్యూఎస్‌ కింద 843, డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీమ్స్‌ కింద 1,025 నడుస్తున్నాయి. 22,455 చేతిపంపులు ప్రజల నీటి అవసరాలు తీరుస్తున్నాయి. సమగ్ర రక్షిత మంచినీటి పథకం కింద మరో 49 ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోంది. వీటన్నింటి ద్వారా ప్రజలకు చేరే నీరు శుద్ధమైనవా కావా అని నిత్యం పరీక్షించాల్సిన బాధ్యత ఆయా పరీక్షా కేంద్రాలపైనే ఉంటుంది.


పంచాయతీలకు తాగునీటి పరీక్షల కిట్లు

ల్యాబ్‌లలో అన్ని పరికరాలు, శిక్షితులైన సిబ్బంది ఉన్నా వాటిపై ప్రభుత్వం శీతకన్ను వేస్తూ ప్రతి పంచాయతీకి తాగు నీటి టెస్టింగ్‌ కిట్లు సరఫరా చేస్తున్నామని చెబుతోంది. ఉన్న ల్యా బ్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అదనంగా పరీక్షల కోసం కిట్లు వాడుకుంటే మంచిదే కానీ, వాటిని అటకెక్కించి మళ్లీ టె స్టింగ్‌ కిట్లు అంటూ ప్రభుత్వం చేసే హ డావుడి జనానికి అంతుపట ్టకుండా ఉంది. అంతి మంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. 


ఎనిమిది నెలలుగా సిబ్బందికి జీతాలు బంద్‌

జిల్లావ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో 100మంది వరకు సిబ్బంది సేవలంది స్తున్నారు. వీరికి ఎనిమిది నెలల నుంచి ప్రభు త్వం జీతాలు ఇవ్వడం లేదు. వీరికి చెల్లించే జీతా లు కూడా రాష్ట్రప్రభుత్వం భరించదు. కేంద్ర ప్రభు త్వం విడుదల చేసే గ్రాంటుల నుంచి మూడుశాతం పక్కన పెట్టి వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. ప్రతి ల్యాబ్‌లో కెమిస్ట్రీ, మైక్రోబయోలజిస్టు, ల్యాబ్‌ అసిస్టెంట్‌తో పాటు ఇతర సిబ్బంది ఉంటారు. వీరందరూ కూడా శాశ్వత ఉద్యోగులు కారు. అరకొర జీతాలతో పనిచేసేవారే. వీరి జీతాల విషయంలో కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో పరీక్షలు దాదాపుగా పడకేశాయి. 


పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

అసలే వ్యాధుల కాలం కావడంతో వైరల్‌ జ్వరాల బారినపడి అధిక సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా, విషజ్వరాలు విజృంభించడానికి కలుషిత నీరు తాగడం కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా గ్రామాల్లో చేయాల్సిన నీటి పరీక్షలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కుబడి తంతుగా మిగిలిపోయి ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి.