వదరనీటిలో తడిసిన పాఠ్యపుస్తకాలు

ABN , First Publish Date - 2022-07-26T05:28:10+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంథని మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వేల పాఠ్యపుస్తకాల సెట్లు తడిచిపోయాయి.

వదరనీటిలో తడిసిన పాఠ్యపుస్తకాలు
ఓ పాఠశాల అవరణలో విద్యార్థులు ఆరబెట్టుకున్న పుస్తకాలు

- ఇబ్బందుల్లో విద్యార్థులు, టీచర్లు

మంథని, జూలై 25: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంథని మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వేల పాఠ్యపుస్తకాల సెట్లు తడిచిపోయాయి. మండలంలోని 40 ప్రభత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఈవిద్యా సంవత్సరం ప్రభుత్వం సుమారు రెండు వేల సెట్లు మంథనికి 10 రోజుల క్రితం పంపిన పాఠ్యపుస్తకాలను స్థానిక ఎంఆర్‌సీ భవనంలో పెట్టడానికి వెళ్లారు. భవనం ముందు ఉన్న బురద కారణంగా వాహనం వెళ్లే పరిస్థితిలేకపోవడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనానికి పుస్తకాలను తరలించారు. భారీ వర్షాలతో వరదలు వచ్చి కళాశాల అవరణ మొత్తం చెరువును తలపించడంతో పాఠ్యపుస్తకాలు తడిసిపోయాయి. దీంతో రెండు వేల పుస్తకాల సెట్లలో దాదాపు 70 శాతం పుస్తకాలు పూర్తి తడిచాయి. దీంతో ఎంఈవో దాసరి లక్ష్మి కొత్త పుస్తకాల కోసం డీఈవోకు నివేదిక  పంపారు. తహసీల్దార్‌ ద్వారా పంచనామా చేయించి నివేదిక ఇవ్వాలని డీఈవో ఆదేశించారు. ప్రస్తుతం చేసేది ఏంలేక విద్యా శాఖ అధికారులు కొంచెం తడిచిన పుస్తకాలను అలానే ఆయా పాఠశాలలకు పంపిణీ చేయగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని ఆరబెట్టుకుంటూ విద్యా బోధన కొనసాగిస్తు న్నారు. వాటిని పాఠశాలలు, ఇళ్లల్లో అరబెట్టుకుంటు న్నారు. వాటిలో కొన్ని చదువుకునే విధంగా వీలుండ గా చాలా వరకు పుస్తకాలు చినిగిపోతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పుస్తకాలు తడిసాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికా రులు స్పందించి మంథని మండలానికి నూతనంగా పాఠ్యపుస్తకాలను వెంటనే మంజూరు చేయాలని  విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-26T05:28:10+05:30 IST