మమతపై పోటీకి దూరంగా కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-09-06T21:30:07+05:30 IST

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఈనెల 30న జరిగే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్..

మమతపై పోటీకి దూరంగా కాంగ్రెస్

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఈనెల 30న జరిగే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపడం లేదు. మమతపై పోటీకి కాంగ్రెస్ ఎవరినీ బరిలోకి దింపకపోవచ్చని పార్టీ వర్గాలు సోమవారంనాడు తెలిపాయి. భవనాపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేయనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆదివారంనాడు అధికారికంగా ప్రకటించింది. సంషేర్ గంజ్ నుంచి టీఎంసీ నేత జాకిర్ హుస్సేన్, సంషేర్ గంజ్‌ నుంచి మరో టీఎంసీ నేత అమీరుల్ ఇస్లాం పోటీ చేయనున్నారు.


సెప్టెంబర్ 30న మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు గత ఆదివారంనాడు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటిలో భవానీపూర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంప్రదాయంగా వస్తున్న నియోజకవర్గమే. అక్కడి నుంచే ఆమె ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కాగా, ఈ ఏడాది జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ సంచలన విజయం సాధించినప్పటికీ మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోమమతా బెనర్జీ పోటీకి మార్గం సుగమం చేస్తూ బెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి సోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ గత మేలో భవానీపూర్ నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. ఈ స్థానంలో గెలుపు మమతా బెనర్జీకి కీలకం కానుంది. ఆమె గెలిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను టీఎంసీ 213 స్థానాల్లో గెలుపొందింది. అధికారం ఆశించిన బీజేపీ 77 సీట్లకే పరిమితమై, రెండో పెద్ద పార్టీగా నిలిచింది.

Updated Date - 2021-09-06T21:30:07+05:30 IST