Abn logo
Oct 1 2021 @ 19:02PM

ఈ వరదలు మానవ సృష్టే : మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో వరదలు మానవుడు సృష్టించినవేనని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. తమకు చెప్పకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేశారని, ఇది నేరమని మండిపడ్డారు. తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని వరద బాధితులను కోరారు.


బెంగాల్, బిహార్, జార్ఖండ్‌లలోని జలాశయాల నుంచి నీటిని తమకు సమాచారం ఇవ్వకుండా డీవీసీ విడుదల చేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం వరద బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పారు. దామోదర్ వ్యాలీ రిజర్వాయర్లలో పూడికను తొలగించేందుకు డ్రెడ్జింగ్ జరగలేదన్నారు. ఈ పనులు జరిగి ఉంటే, రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగి ఉండేదని, నీటిని విడుదల చేయవలసిన అవసరం ఉండేది కాదని అన్నారు. 


మమత బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. సీఎం సహాయ నిధి అంటే పీఎంకేర్స్ వంటిది కాదన్నారు. తాము అవసరార్థులకు సహాయపడతామన్నారు. 


డీవీసీ గురువారం 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. శుక్రవారం 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఈ నీటితోపాటు భారీ వర్షాలు కురవడంతో బంకుర, అసన్‌సోల్, బీర్భూమ్, హుగ్లీలలో అత్యధిక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. సుమారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. 


హుగ్లీ, అసన్‌సోల్‌లలో వరద బాధితులకు సహాయపడేందుకు సైనికులను పంపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయపడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. 


ఇవి కూడా చదవండిImage Caption