పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-17T01:55:36+05:30 IST

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం

కోల్‌కతా: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి విడతల పోలింగ్‌పై ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించింది. దీనితో పాటు 72 గంటలకు (మూడు రోజులు) ముందే ఆయా విడతల ప్రచారానికి తెరపడుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు ఈసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఎన్నికల ప్రచార రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు, నుక్కడ్ సభలను అనుమతించమని ఈసీ స్పష్టం చేసింది. 6,7,8 విడతల ప్రచారానికి ప్రతి దశలోనూ 72 గంటలకు ముందే ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు, నుక్కడ్ సభలు, బైక్ ర్యాలీలకు తెరపడుతుందని తెలిపింది.


బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో సామాజిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం వంటి ఘటనలు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఈసీ పేర్కొంది. ఇది ఈసీ విధించిన నియమనిబంధనలు ఘోరంగా ఉల్లంఘించడమేనని తప్పుపట్టింది. స్టార్ క్యాంపెయినర్లు, రాజకీయ నేతలు, అభ్యర్థులు ప్రచార సమయంలో కోవిడ్ ప్రోటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఇందువల్ల వారికి వారు ప్రమాదంలో పడటమే కాకుండా, ప్రజలను కూడా ఇన్‌ఫెక్షన్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఈసీ చురకలు వేసింది.


దీనికి ముందు, శుక్రవారం ఉదయం కోవిడ్ నిబంధనలపై చర్చించేందుకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తక్కిన మూడు విడతలకు (6,7,8) పోలింగ్ ఒకేరోజు నిర్వహించాలని సీఈఓకు టీఎంసీ విజ్ఞప్తి చేయగా, అఖిలపక్ష సమావేశం ఎజెండాలోనే ఈ అంశం లేదని బీజేపీ ఈసీ సమావేశానంతరం తెలిపింది. కాగా, 8 విడతల పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే 4 విడతల పోలింగ్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఐదో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. ఆరో విడత పోలింగ్ 22న, ఏడో విడత పోలింగ్ 26న, 8వ (చివరి) విడత పోలింగ్ ఈనెల 29న జరుగుతుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-04-17T01:55:36+05:30 IST