ధిక్కరించి నిలిచాం కనుకనే నిలదీస్తున్నాం!

ABN , First Publish Date - 2021-10-11T06:42:08+05:30 IST

ప్రసేన్‌కు ‘స్పష్టంగా అర్థమైన’ విషయం నిజమే! నేను ‘మనోధర్మపరాగం’ నవల పూర్తిగా చదవ లేదు. చదవలేదు అనేకంటే.. చదవలేకపోయాను- అని చెప్పడం సబబు....

ధిక్కరించి నిలిచాం కనుకనే నిలదీస్తున్నాం!

ప్రసేన్‌కు ‘స్పష్టంగా అర్థమైన’ విషయం నిజమే! నేను ‘మనోధర్మపరాగం’ నవల పూర్తిగా చదవ లేదు. చదవలేదు అనేకంటే.. చదవలేకపోయాను- అని చెప్పడం సబబు. తొలి రెండు అధ్యాయాలు చదవ గానే రచయిత దురుద్దేశం ఏమిటో, ఏమి చెప్పదలచుకు న్నారో, ఈ కథాంశాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలనుకు న్నారో నాకు విస్పష్టంగానే అర్థమయింది. సంస్కార హీనంగా చవకబారు బూతు నవల రాసి, ఉనికిలోనే లేని దేవదాసీ వ్యవస్థ నీడ మాటునే ‘సెక్సీ’గా వ్యాపారం చేసు కోవాలనుకున్న ధోరణి బాగానే అవగతమైంది. రజస్వల కాని ఓ బాలికను అరవై ఏళ్లు పైబడిన వృద్ధుడు పోష కునిగా చేరదీయటం, అతను గతించగానే ఆమె మరొకని పంచన చేరటం ప్రసేన్‌కు సంబడంగా వుందేమో కానీ, నాకైతే గుండె మంట రేపింది. అసలు రజస్వలే కాని అమ్మాయి దేవదాసీగా ఎలా అర్హురాలో, ఆలయ సంరక్షణ విధుల్లో ఎలా చేరగలుగుతుందో నవలను అక్షరాక్షరం క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రసేనే విపులంగా చెబితే బావుంటుంది. మరోవైపు ప్రసేన్‌ వొట్టి కాగితమ్ముక్కగా తీసిపారేస్తూ, మనం గౌరవించదగిన చట్టాలు, వ్యవస్థల గురించి హైలెవెల్లోనే లెక్చరిచ్చారు. భావజాలాలు, తీర్మానాలు, ముసుగులగురించి బహు ముచ్చటగానే రాశారు. వరకట్న పిశాచం, బాలకార్మిక వ్యవస్థ, దేవదాసీ వ్యవస్థలకు మధ్య అనుచిత పోలికలు ముందుకు తెచ్చారు.  


దేవదాసీలు నిజమైన ఆలయ సంరక్ష కులుగా, ప్రజల అత్యున్నత గౌరవాభి మానాలు పొందిన సాధ్వీమతల్లులుగా వెలిగిన కాలాన్ని కళ్ళారా చూసి తరించి నవాణ్ణి నేను. కాలగమనంలో కొందరు కాముకుల దుశ్చర్యలకు పవిత్రత కోల్పో యిన వైనాన్నీ ఎరిగిన వాడనై, ఎనభై మూడేళ్ల వయస్సు నిండినవాణ్ణి. సభ్యసమాజంలో ఇక ఏమాత్రం కొనసాగకూడనిదిగా పరి గణించి, గాంధీజీ లాంటి జాతినేతలు దేవదాసీ వ్యవస్థనే నిర్మూలించాక జరిగిన పరిణామాల్నీ.. అతిదగ్గరగా చూసి నవాణ్ణి. నా కుల గౌరవమర్యాదలకోసం అనేక సందర్భాల్లో అధికారులు, పాలకులనే ధిక్కరించి నిలిచినవాణ్ణి. తరాల నాడు సమాజం వేసిన బాధాకర ముద్ర చెరగక విద్యాల యాల్లో తంటాలుపడుతున్న విద్యార్థినులు, ఉద్యోగస్థలాల్లో అవమానాల పాలవుతున్న ఉద్యోగినుల నరకయాతనను సానుభూతితో అర్థంచేసుకున్నవాణ్ణి. దశాబ్దాల ఆత్మగౌరవ పోరాటంలో ‘భోగం’ లాంటి మాటలు ఇక వినకూడదని కంకణంకట్టుకుని, కులంపేరునే ‘సూర్యబలిజ’గా మార్పించ టంలో నేను సైతం అంటూ ముందువరసలో వున్నవాణ్ణి. ఆ జీవో వచ్చిన శుభవేళ భారీ సభలు, సమావేశాలు, సంబరాల్లో కులస్తుల ఆనందోద్వేగాలు పంచుకున్నవాణ్ణి. 


రూపుమాసిన వ్యవస్థ గురించిరాస్తే సమా జానికి ఏం వొనగూరుతుందనే కదా నేను ప్రశ్నించింది. ‘ఎందుకలా!’ అని అమాయకంగా అడుగుతున్నారు ప్రసేన్‌. నేనెందుకలా ప్రశ్నించ కూడదో సమాధానం ఇవ్వాల్సింది ప్రసేనే. నా వ్యాసం ఏ కొంచెం అర్థమయివున్నా ప్రసేన్‌ స్పందన ఇంత అర్థరహితంగా, అపసవ్యంగా వుండేది కాదేమో! నవలా రచయితనీ, సమీ క్షకుడినీ గుడ్డిగా సమర్థించే తొందరలో తప్పులో చెయ్యేశారు! 


నాపై విమర్శా వ్యాసంలో స్వయంగా ప్రసేనే అన్నట్టు - ఒక కులం పేరు చెప్పగానే పడుపు వ్యాపారం గుర్తుకువచ్చే తప్పుడు పరి స్థితి ఎందుకు వచ్చిందనేదే కదా నా ఆవేద నంతా. అసలు దేవదాసీ అన్నా, కళావంతులన్నా పడుపుతనం కాదు, ఘనమైన సాంస్కృతిక వైభవం అనే కదా నేనూ చెప్పింది. ఎవరైనా నవల రాయదలిస్తే ఒక సంగీత, సాహిత్య, సామ్రాజ్య ప్రతీకగా కాలరెగరేసి చెప్పు కునేలా దాని వైభవాన్ని గురించి వివరిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే కదా నేను గొంతెత్తి అరిచిందీ. దేవ దాసీలనాడూ, కళావంతులనాడూ, సూర్యబలిజలనాడూ.. ఏనాడూ కూడా పడుపు వృత్తిలో లేని వాళ్లమీద పడే ఆ ముద్రను చెరిపివేయాలనేదే కదా నా ఆరాటం, ఆజన్మ పోరాటమంతా. ‘‘మనమేమిటో చెప్పుకోవడం, మేం మేమే అని బల్లగుద్దడం, మేమిదే, నీకు తెలియదు... తెలుసుకో. మేం నువ్వనుకుంటున్న మేం కాదు, మా పట్ల నీ భావజాలాన్ని మార్చుకో, నీ భాష మార్చుకో’’ అని నా కులస్తులు సగర్వంగా గర్జించాలనేగా నేనూ ఘోషించేది. మరి ఈ సూక్ష్మం ప్రసేన్‌ గ్రహింపుకి రాలేదెందుకనో!

దాసరి కేశవులు, 94402 75055


Updated Date - 2021-10-11T06:42:08+05:30 IST