తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నాం

ABN , First Publish Date - 2021-11-25T05:08:34+05:30 IST

నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు చదువునిమిత్తం టెక్కలికి వస్తున్నామని, ఆర్టీసీ బస్సు పాసులున్నా తిరుగు ప్రయాణంలో బస్సు సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోయారు.

తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నాం
ఆర్టీసీ బస్సు ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులు

ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

టెక్కలి రూరల్‌: నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు చదువునిమిత్తం టెక్కలికి వస్తున్నామని, ఆర్టీసీ బస్సు పాసులున్నా తిరుగు ప్రయాణంలో బస్సు సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బుధవారం రాత్రి కళాశాలల విద్యార్థులు ఆందోళన చేశారు. నిత్యం ఇబ్బం దులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్కలి-తెంబూరు మార్గం నుంచి టెక్కలి లో ఇంటర్‌, డిగ్రీ ఇతర ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తున్నామని, సాయం సమయాల్లో ఇళ్లకు చేరుందుకు అవసరం మేర కు బస్సులు లేకపోవడంతో ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోయారు. దీనివల్ల అదనపు భారం పడుతోందని పేర్కొంటూ ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు.  టెక్కలి-తెంబూరు మార్గంలో సాయంత్రం 4.30, 5.30 గంటలకు రెండు సర్వీసులు మాత్రమే ఉన్నాయని, ఇవి సాధారణ ప్రయాణీకులకే సరిపోవడం లేదని, విద్యార్థులు ఎలా ప్రయాణించాలని వారు ప్రశ్నించారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని ఆర్టీసీ అధికారులు అక్కడికి వచ్చి విద్యార్థులకు నచ్చచచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై డిపో మేనేజర్‌ డి.వెంకటరెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఈ మార్గంలో ఉదయం, సాయం సమయాల్లో మూడు సర్వీసులు నడుపుతున్నామని, విద్యార్థుల కోసం మరో సర్వీసు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-11-25T05:08:34+05:30 IST