అమెరికా యుద్ధనౌకలో కరోనా కలకలం! రక్షించండి అంటూ కమాండర్ వేడుకోలు

ABN , First Publish Date - 2020-04-01T20:37:24+05:30 IST

ఈ నేపథ్యంలో మిగిలి సిబ్బంది కూడా కరోనా బారిన పడతారేమోనని భయపడిపోయిన నౌక కమాండింగ్ అధికారి క్యాప్టెన్ బ్రెట్ క్రోజియర్.. ఉన్నతాధికారులకు ఘాటైన నాలుగు పేజీల లేఖ రాశారు.

అమెరికా యుద్ధనౌకలో కరోనా కలకలం! రక్షించండి అంటూ కమాండర్ వేడుకోలు

వాషింగ్టన్: ఆ యుద్ధనౌక పేరు థియోడోర్ రూజవెల్ట్.  అది అమెరికాకు ఓ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్.  అందులో దాదాపు 5000 మంది సిబ్బంది ఉన్నారు. ఇటీవల నౌకలో కొందరు కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచీ యుద్ధనౌకను గ్వామ్ ద్వీపంలో పోర్టు వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలో మిగిలి సిబ్బంది కూడా కరోనా బారిన పడతారేమోనని భయపడిపోయిన నౌక కమాండింగ్ అధికారి క్యాప్టెన్ బ్రెట్ క్రోజియర్.. ఉన్నతాధికారులకు నాలుగు పేజీల ఘాటు లేఖ రాశారు.


నౌకలో ఉన్న దాదాపు 5 వేల మంది సిబ్బందిని వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని ఆయన ఉన్నతాధికారులను అభ్యర్థించారు. నౌకలో అందుబాటులో ఉన్న ఐసోలేషన్, క్వారంటైన్ వ్యవస్థలు ప్రస్తుత అవసరాలకు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. ‘ఇది యుద్ధం కాదు. నావికులు ప్రాణాలకు కోల్పోవాల్సినంత పరిస్తితి లేదు. సరైన నిర్ణయం తీసుకోకపోతే దేశ రక్షణకు అత్యావస్యకమైన వారిని కోల్పోతాం’ అని హెచ్చరించారు.


కాగా ఈ లేఖపై అమెరికా నావికా దళ సెక్రెటరీ థామస్ మాడ్లీ స్పందించారు. గ్వామ్ ద్వీపం ఆసుపత్రుల్లో తగినన్ని బెడ్లు లేకపోవడంతో స్థానిక హోటళ్లలో సిబ్బందిని ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇందు కోసం స్థానిక అధికారుల సాయం తీసుకుంటున్నామన్నారు. ‘కమాండింగ్ అధికారితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. అయితే థియోడోర్ రూజవెల్ట్ అనేది విహార నౌక కాదు కాబట్టి నిర్ధిష్టమైన పథకం ప్రకారం ఆచి తూచి ముందుకు వెళుతున్నాం. నౌకలో ఆయుధాలు, యుద్ధవిమానాలు ఉన్నాయి కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. కొందరు అమెరికా అధికారుల ప్రకారం ఆ యుద్ధ నౌకలో ప్రస్తుతం 80 మంది కరోనా బారిన పడి ఉండొచ్చని తెలుస్తోంది. 

Updated Date - 2020-04-01T20:37:24+05:30 IST