సమ్మెకు తగ్గేదేలే

ABN , First Publish Date - 2022-01-26T06:46:05+05:30 IST

పీఆర్సీ ఉద్యమం ఎఫెక్ట్‌ మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల మీద కనిపించింది.

సమ్మెకు తగ్గేదేలే

ఎన్జీవో భవనం నుంచి భారీ ప్రదర్శన

ఉద్యోగుల నినాదాలతో హోరెత్తిన చిత్తూరు

కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా

చిత్తూరు, జనవరి 25: వేతన సవరణలో జరుగుతున్న అన్యాయాన్ని, తమ పట్ల ప్రభుత్వ దుష్ప్రచారాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు చిత్తూరులో పెద్దఎత్తున కదం తొక్కారు. సమ్మెకు వెనకాడేది లేదని, ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాలు, కార్యకర్తలతో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా జరిగింది. అంతకుముందు ఎన్జీవో భవనం నుంచి వేలాదిమంది ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. చీకటి జీవోను రద్దు చేయాలని... దుర్మార్గపు పీఆర్సీ మాకొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన మహాధర్నాలో సాధన సమితి నాయకులు మాట్లాడుతూ ఒక వైపు ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానించేలా అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసి, మరో వైపు చర్చల పేరుతో కాలయాపన చేయడం అన్యాయమన్నారు. పీఆర్సీ వల్ల వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గడం దేశ చరిత్రలో రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. పీఆర్సీ అమలు చేయాలంటే రూ. 10వేల కోట్లు ఖజానాపై భారం పడుతుందని దుష్ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి భారం పడుతుందనుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తరువాతే కొత్త పీఆర్సీని తీసుకుంటామని, ప్రజల కోసం కొత్త పీఆర్సీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తామంటూ జగన్‌ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఎవరూ అడగకుండానే పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడంలో ఆంతర్యం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. పదవీ విరమణ వయస్సు పెంపు తమకు అవసరం లేదని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన జాతీయ విద్యావిధానంతో పాఠశాలల్లో టీచర్‌ పోస్టులను కుదించడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకపోవడం, రెగ్యులర్‌ జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రోజురోజుకీ ఇంటి అద్దెలు పెరిగిపోతుండగా చీఫ్‌ సెక్రటరీ కమిటీ మాత్రం ఇంటి అద్దెలను తగ్గించడం విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇలాగే పంతాలకు పోతే వచ్చే నెల 6వ తేది అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మహా ధర్నాకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ నాయకులు కేవీ రాఘవులు, ప్రసాద రెడ్డి, అమరనాథ్‌, గంటా మోహన్‌, జగన్మోహన రెడ్డి, మధుసూదన్‌, ముత్యాలరెడ్డి, జీవీ రమణ, నిర్మల, చెంగల్రాయ మందడి, నరోత్తమరెడ్డి, రమేష్‌, శివయ్య, సురేష్‌, కుమార్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

జూ ఉద్యోగులు లేక బోసిపోయిన 

ప్రభుత్వ కార్యాలయాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 25: పీఆర్సీ ఉద్యమం ఎఫెక్ట్‌ మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల మీద కనిపించింది. జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో ఆయా కార్యాలయాలు వెలవెలబోయాయి. కలెక్టరేట్‌ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలకు క్యాజువల్‌ లీవ్‌ పెట్టి వెళ్ళారు. ఆయా శాఖల జిల్లా అధికారులు మాత్రం కార్యాలయాల్లోనే వుంటూ దైనందిన కార్యక్రమాలు పరిశీలిస్తుండడం కనిపించింది. కొన్ని కార్యాలయాల్లో మాత్రం ఉద్యోగులు మధ్యాహ్నం వేళ విధులకు వచ్చి అత్యవసర పనులు చేపట్టారు. 

Updated Date - 2022-01-26T06:46:05+05:30 IST